చూసి నేర్చు‌కోవాలి





పాలమూరు పొలిమేరలోవున్న అడవిలో ఓ పెద్ద చెట్టు ఆ చెట్టుపైన కోతులు, ఉడుతలు, చిలుకలు, పిచ్చుకలు జీవిస్తుంటాయి. పిచ్చుకలు కొన్నాళ్ళకు గుడ్లు పెట్టి పొదిగి వాటిని అపురూపంగా చూసుకుంటున్నాయి. వాటికి తల్లి తండ్రి పక్షులు ఎక్కడెక్కడో తిరిగి ఆహారం సేకరించి తెచ్చి పెడుతుంటాయి.



కొన్నాళ్ళకు అవి పెరిగి కూతకొచ్చాయి. ఒకరోజు ఒక లకుముకి పిట్ట వచ్చి ఆ చెట్టు బెరడును తొలవడం మొదలుపెట్టింది. పిచ్చుకపిల్లలు లకుముకిపిట్ట చేసే శబ్దానికి భయపడి వాళ్ళమ్మతో ''అమ్మా..! నీవు బయటకు వెళ్ళినపుడు మాకు భయంగావుంటోంది'' అన్నాయి. ''ఎందుకమ్మా..? భయం.. ఎవరన్నా ఏమన్నా అన్నారా ?'' అంది. పిల్ల పక్షులు ''అమ్మా..! చెట్టుపైన కోతులు అరుస్తూ కొమ్మలు వూగిస్తున్నాయి, ఉడుతలు ఎగిరెగిరి దుముకుతున్నాయి. అప్పుడప్పుడు సీతాకొక చిలుకలు, తూనీగలు దగ్గరకొచ్చి పోతున్నాయి. గబ్బిలాలు రెక్కలాడిస్తూ వచ్చిపోయున్నాయి. చెట్టుని ఒక పొడవాటి ముక్కు పక్షి వచ్చి టకటకకొట్టి శబ్ధం చేస్తుంటే చాలా భయంగా వుంది.'' అన్నాయి.


ఇంతలో తండ్రి పక్షి గూటికివచ్చి ''ఎందుకలా వున్నారు? ఏమైంది'' అని అడిగింది. విషయమంతా వివరించి చెప్పింది తల్లి పక్షి . ''చూడండి పిల్లలు! మీరేమీ భయపడకండి. మేమున్నాం. ఇక్కడే ఈ చెట్టుపైన కోతులు, ఉడుతలు, పక్షులు వున్నాయి. మనం కూడావచ్చి ఇక్కడ గూడు కట్టుకున్నాము. ఇప్పుడు ఆ లకుముకిపిట్ట గూడా వచ్చి గూడు కట్టుకోబోతోంది. మనందరికి ఆశ్రయం ఇచ్చిన ఈ చెట్టును చూసారా? ఈ చెట్టు ఎంత స్థిరంగా నిలబడి ఉంది. ఈ చెట్టుపై వున్న మనం చెట్టును చూసి నేర్చుకోవాలి. ఈ చెట్టు కోతులు కొమ్మలపై ఎగురుతున్నా, కొమ్మలు విరిగిపోతున్నా వాటికీ ఉడుత లకి, పిట్టలకి పళ్ళు ఇస్తోంది.


 ఎన్నో కీటకాలు, పురుగులు చెట్టుపైన వుంటున్నాయి. అలాగే లకుముకి పిట్ట చెట్టుని తొలుస్తూ గూడు ఏర్పరచుకుంటున్నా అది మనలా ఇక్కడ ఉండటానికే... అని మనం అర్థం చేసుకోవాలి. మన ఇరుగుపొరుగు జంతువులు, పక్షులు అన్నీఒకదానిపైన ఒకటి ఆధారపడి జీవిస్తాయి, అది ఈ ప్రకృతి ధర్మం, లేకపోతే ప్రకృతికి అర్థ్థం వుండదు. కనుక మనమందరం కలసి మెలసి జీవించాల్సిందే. మనకు ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో తప్పించుకోవాలి తెలిసిందా?'' అంది తండ్రి పక్షి. ''అర్థం అయింది అమ్మ , నాన్నలు'' అన్నాయి సంతోషంగా !
Previous
Next Post »