మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే..


ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంతో ప్రయోజకులు కావాలని అనుకుంటుంటారు. అందులో తప్పు లేదు. ఎందుకంటే పిల్లలు ఎదిగితే సంతోషించేవారు కన్నవారే కదా! కానీ అనుకోవడం వరకు సరే! ఆచరణలో అది ఎంతవరకు సాధ్యమవుతుంది? అనే విషయమే చాలా ముఖ్యమైనది. వాళ్లు ఉన్నత స్థానానికి చేరాలని ఎవరు కోరుకోరు? అందుకే వారికి ఉపయోగపడే అంశాలు నేర్పాల్సిన బాధ్యత కూడా కన్న వారిపైనే ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని అంశాలను తల్లిదండ్రులు పాటిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

మొదటి అంశం



వారి వ్యక్తిత్వాన్ని వారు తీర్చిదిద్దుకునేందుకు తల్లిదండ్రులుగా సహాయం చేయడం.  వారిలా ఉన్నారు& వీరు అలా ఉన్నారు వంటి పోలికలు పొరపాటున కూడా చేయొద్దు. ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంటుందని&. ఎవరి గొప్పదనం వారిదే అని చెప్పాలి. తమదైన వ్యక్తిత్వాన్ని కూడా సొంతం చేసుకోవాలని వివరించాలి. నీలా నువ్వు ఉండు&అని తల్లిదండ్రులు చెప్పగలిగితే పిల్లల భవిష్యత్తుకు గట్టి పునాది పడినట్లే.

రెండో అంశం



పిల్లలు ఎప్పుడూ తమ చుట్టూ ఉన్న అంశాలు, పరిస్థితులను బట్టి అన్ని నేర్చుకుంటారని  మనం మరువకూడదు. దీనిని దృష్టిలో ఉంచుకొని  కూడా ప్రతి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏదైనా తల్లిదండ్రులు పాటిస్తేనే పిల్లలు కూడా పాటిస్తారని తెలుసుకోవాలి. పిల్లలకు చెప్పే ముందు మనం కూడా అన్ని పాటించాలి. చిన్నారులకు ఏ విషయంలో నైనా కన్నవారే గురువులు అరు  మాత్రం మర్చిపోకూడదు.

మూడో అంశం




ప్రతి ఒక్క తల్లిదండ్రులు చిన్నారులతో కాస్త సమయం గడపాలి. రోజూ ఎంత పని వత్తిడి ఉన్నా వీలు చేసుకోవాలి. మనం ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా వారితో కాసేపు మనసు విప్పి మాట్లాడాలి. ఈ రోజు ఎలా గడిచింది?  పాఠశాలలో ఎలా ఉంది?  కళాశాలలో ఎలా చదువు చెబుతున్నారు? స్నేహితులు ఎలా మెలుగుతున్నారు? వంటి అంశాలు అడిగితే మేలు. వారి మనసులోని భావాలను మీతో పంచుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల వారికి మీరు ఎంత విలువ ఇస్తున్నారో తెలుసుకుంటారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు కూడా అవకాశం లభిస్తుంది.

నాలుగో అంశం

కష్టం విలువ చిన్నప్పటి నుంచి తెలిసేలా చేయాలి. అలాగని వారిని ఎంతో కష్టపడి పని చేయించమని కాదు అర్థం. మన చుట్టుపక్కల ఎన్నో ఉదాహరణలు కనిపిస్తుంటాయి. రైతు బజార్ తీసుకెళ్తే రైతుల కష్టాలు తెలుస్తాయి. మనం తినే ఆహారం పండించటానికి ఎంత కష్టపడతారో తెలుస్తుంది. ఆటో ఎక్కినప్పుడు ఆటోడ్రైవర్ కష్టం కూడా వారికి తెలిసేలా చేయాలి. రోజంతా కష్టపడితే   సంపాదించేది ఎంత? మిగిలేది ఎంత? వివరించాలి.

ఐదో అంశం



బంధాలకు విలువ ఇవ్వడం కూడా నేర్పాలి. తల్లిదండ్రుల విలువ చిన్నప్పుటి నుంచి వారికి అర్థం అవ్వాలి. అందుకు ముందు మనం కూడా కన్నవారిని అలాగే చూసుకోవాలి. పండగల సమయంలో కుటుంబ సభ్యులంతా ఒక చోటికి చేరాలి. తరచూ బంధువుల ఇంటికి రాకపోకలు సాగించాలి. దీనివల్ల మనకంటూ కొంత మంది ఉన్నారని ఆత్మవిశ్వాసం పిల్లలలో పెరుగుతుంది.  అది వారి నడవడిక మెరుగు కావడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

ఆరో అంశం



చిన్నారుల ఇష్టాలను తల్లిదండ్రులు తెలుసుకోవాలి. తీర్చగలిగే వైతే సాధ్యమైనంతవరకు తీర్చండి. ఒకవేళ సాధ్యం కాకపోతే కారణాలు చెప్పండి. వారు ముందు కొంత మొండిగా ఉన్నా తర్వాత మీ ఉదేశ్యం తెలుసుకుంటారు. మన ఆర్థిక స్థాయి, స్థితిగతులు వాళ్ళకి దీనివల్ల అర్థమవుతాయి. వారి రేపటి భవిష్యత్తుకు సోపానాలుగా మారుతాయి.

ఏడో అంశం



ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉండాలని చెప్పండి. అలాగే మీ పిల్లలకూ లక్ష్యాన్ని నిర్దేశించింది. సాధిస్తానా లేదనేది పక్కనపెట్టి ముందు ప్రయత్నం చేయమనండి. ఓడిపోతే దిగులు చెందకూడదని తెలపండి. ప్రయత్నం మాత్రం చేయమని  ప్రోత్సహించండి. వెనుకడుగేయవద్దని & అన్నింట్లో నేను అండగా ఉంటానని భరోసా ఇవ్వండి. ఓటమిని గెలుపుకి సోపానంగా మార్చుకోవాలని వివరించండి.

ఎనిమిదో అంశం



చిన్నారులతో ముద్దుగా ఐ లవ్ యు అనండి. ఎన్నిసార్లు అంటారా&  అది మీ ఓపిక. మీరు ఎంతగా వారిని దగ్గర తీసుకొని ఇలాంటి మాటలు చెప్తారో అంతగా ఆప్యాయత, అనుబంధం పెరుగుతుంది. కాస్త కష్టం వచ్చి పిల్లలు మీ ముందు  ఉన్నప్పుడు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోండి. అదే మీ చిన్నారులకు వెయ్యేనుగుల బలం ఇస్తుంది.
ఇంకేముంది మీ కలల ప్రతి రూపాన్ని తీర్చిదిద్దండి.
Previous
Next Post »