జొన్నతో వంటకాలు





జొన్న రొట్టె తప్ప ఈ కాలంలో ఎక్కువమందికి జొన్నతో చేసుకునే ఇతర వంటకాల గురించి అంతగా తెలియదు. ఊబకాయుల, మధుమేహ రోగుల సంఖ్య పెరిగిపోవడంతో ఆ రొట్టెలనైనా తినడం మొదలుపెట్టారు. అవి కూడా ఇంట్లో చేసుకోవడం రాక, తీరిక లేక... బయట నుంచి తెచ్చుకుని తినేవాళ్లే ఎక్కువ. అయితే ఒక్క రొట్టెలే కాకుండా జొన్నలతో దోసెలు, సమోసాలు, ఉప్మా వంటి కారపు వంటలు చేసుకోవచ్చు. ఇవే కాకుండా కేసరి, పాయసం వంటి తీపి వంటలూ చేసుకోవచ్చు.



సంప్రదాయ వంటకాలే కాకుండా సేమ్యా, పాస్తాలు కూడా తయారవుతున్నాయి జొన్నలతో. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇటువంటి చిరుధాన్యాల వాడకాన్ని పెంచేందుకు, అవగాహన కలిగించేందుకు ఇవ్వాళ్టి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో చిరుధాన్యోత్సవం (మిల్లెట్ ఫెస్టివల్) నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఆ సందర్భంగా పొట్టు తీసిన జొన్న, జొన్న రవ్వలతో కొన్ని వంటకాలు మీ కోసం...

ఉప్మా ఒక కప్పు జొన్న రవ్వ తీసుకుని అది ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆవాలు, శెనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, టొమాటొ ముక్కల్ని కొద్దిగా నూనె వేసి అందులో వేగించాలి. అవి వేగిన తరువాత మూడు కప్పుల నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. నీళ్లు ఉడుకుపట్టిన తరువాత వేగించిన జొన్న రవ్వ నెమ్మదిగా కలుపుతూ పోయాలి. రవ్వ మెత్తగా అయ్యే వరకు సన్నటి సెగమీద ఉడికించి వేడివేడిగా తింటే ఉప్మా అంటే ఇదే అంటారు. కేసరి
ఒక కప్పు జొన్న రవ్వ, కొన్ని డ్రైఫ్రూట్స్‌ను తీసుకోవాలి. వాటిని కొద్దిగా డాల్డా వేసి విడివిడిగా లేత రంగు వచ్చే వరకు వేగించాలి. ఒక కడాయి తీసుకుని అందులో పాలు, నీళ్లు ఒక్కోటి రెండేసి కప్పుల చొప్పున పోసి చిటికెడు కేసర్ వేయాలి. ఇందులో వేగించి పెట్టుకున్న రవ్వ, ఒకటిన్నర కప్పు పంచదార వేసి ఉడికించాలి. చల్లారిన తరువాత డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి కొద్దిగా నెయ్యి వేసుకుని తినాలి.

సమోసాలు

జొన్న పిండి, మైదాలను ఒక్కో కప్పు చొప్పున ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసి, నీళ్లు పోస్తూ మెత్తటి ముద్దలా కలపాలి. తరువాత చిన్న ఉండలు చేసి రొట్టెల కర్రతో ఉండల్ని ఒత్తి చపాతీల్లా చేయాలి. చపాతీని రెండు భాగాలుగా కోయాలి. స్టఫ్పింగ్: ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా నలిపి ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి తాలింపు వేయాలి. తరువాత ఉడికించిన బఠాణీలు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఈ మిశ్రమాన్ని చపాతీ ముక్కల్లో నింపి త్రికోణాకారంగా సమోసాల్లా మడిచి నూనెలో బాగా వేగించాలి.

కిచిడి

అరకప్పు పెసరపప్పు, ఒక కప్పు జొన్న రవ్వని తీసుకుని పావుగంటసేపు నానపెట్టాలి. ఆవాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పసుపు వేసి తాలింపు పెట్టాలి. తరువాత సరిపడా నీళ్లు పోసి కాస్త ఉప్పు వేసి సన్నటి మంట మీద రవ్వ ఉడికే వరకు ఉంచాలి. వేడిగా తింటే వారెవ్వా కిచిడీ అనాల్సిందే.


తవా రోటి

పావుకిలో జొన్నపిండిలో తరిగిన ఉల్లి కాడలు, ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, జీలకర్ర, ఉప్పు వేసి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడి అయ్యాక చిన్నచిన్న పిండి ముద్దలు చేసి గుండ్రంగా ఒత్తి నూనెలో రెండు వైపులా వేగించాలి.

Previous
Next Post »