శ్రీ కృష్ణుడికి మహాభారతానికి చాలా సంబంధం ఉంది. ఇంట పుట్టిన ఆడబిడ్డకు పుట్టింటి అవసరం ఎంతైనా అవసరమని చాటిచెప్పిన శ్రీకృష్ణుడు.. మేనత్త కుంతి కోసం.. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులకు సారథిగా వ్యవహరించాడు. మేనత్త కుమారులైన పాండుసుతులతో శ్రీ కృష్ణుని అనుబంధం మరువరానిది. పాండవుల జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలో శ్రీకృష్ణుడి పాత్ర తప్పక ఉండి తీరుతుంది. శ్రీ కృష్ణుడిని సంప్రదించకుండా ధర్మరాజు శకునితో ఆడిన జూదము మినహా శ్రీకృష్ణుని సలహా సంప్రదింపులతో జరిగినవే.
కీలకమైన సమస్యలన్నీ కృష్ణుని సహాయంతో తీరినవే. ద్రౌపదిని శ్రీకృష్ణుడు స్వంత చెల్లెలికన్నా కంటే ఎక్కువగా చూసుకున్నాడు. వస్త్రాభరణ అవమానము నుంచి ద్రౌపది గోపాలుడి సాయంతో బయటపడింది. పాండవులు వనవాస సమయంలో ఏర్పడిన అనేక సమస్యలను శ్రీ కృష్ణుడి సలహాలతోనే పరిష్కరించుకున్నారు.
అంతేగాకుండా పాండవుల రాజ్యం మీదకు అనేకమార్లు దండెత్తిన జరాసంధుని భీముని సాయంతో తుదముట్టించి తన రాజ్యానికి శత్రు భయాన్ని తొలగించాడు. ద్వారక సముద్రగర్భంలో మునిగిపోతుందని ముందుగానే ఊహించి ద్వారక వాసులను అప్రమత్తంచేసి వారిని ఆపదనుండి రక్షించాడు. ఇంద్రప్రస్థంలో ధర్మరాజు చేసిన అశ్వమేధయాగ సమయంలో మేనత్తకి ఇచ్చిన మాటను పాలించి శిశుపాలుని నూరు తప్పులను సహించిన తరువాత అతనిని చక్రాయుధంతో వధించాడు.
ముఖ్యంగా యుద్ధ సమయంలో గీతోపదేశం చేసి లోకకళ్యాణానికి పరమార్థంగా నిలిచాడు. అర్జునునికి సారథిగా మహసంగ్రామ యుద్ధం ముగిసేంతవరకు పాండవులకు రక్షణగా ఉన్నాడు. అశ్వత్థామ అస్త్రంవల్ల ఉత్తర గర్భంలో పిండం కూడా మృత్యువును ఎదుర్కోగా కృష్ణుడు తన చక్రంతో ఆ గర్భస్థ శిశువును రక్షించాడు. ఆ శిశువే పరీక్షిత్తుగా జన్మించి పాండవుల అనంతరం రాజ్యానికి అధిపతి అయ్యాడు. అందుచేత లోక కల్యాణార్థం భూలోకంలో శ్రీకృష్ణుడిగా జన్మించిన గోపాలుడు దుష్ట శిక్షణ చేశాడు. ఆ పరమాత్మను శ్రీకృష్ణాష్టమి సందర్భంగా పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
EmoticonEmoticon