సినిమా చిన్నదా?పెద్దదా? అని కాదు. ఆ చిత్రం కథ, కథనాలు విభిన్నంగా ఉన్నాయా? లేవా? ప్రేక్షకులను అలరించేలా నటీనటులు ప్రవర్తించారా? లేదా? అన్నదే ఇప్పుడు ముఖ్యం. దర్శకులు, నిర్మాతలు ఎవరో తెలియకపోయినా ఫర్వాలేదు కానీ కథ మాత్రం వినూత్నంగా మెప్పించేలా ఉండాలి? అవి ఉంటే ఆ సినిమా విజయం సాధించేసినట్టే. ఇప్పుడు తెలుగు చిత్రసీమలో ఈ ట్రెండే నడుస్తోంది. అటువంటి చిత్రాలకు పెద్ద నిర్మాతలు సమర్పకులుగా వ్యవహరించి విడుదల చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇది శుభపరిణామమే.
పదేళ్ల క్రితం సినిమా రూపొందాలంటే ఓ స్టార్ హీరో, ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఉండి తీరాలి. వీళ్లవి అయితేనే థియేటర్లలో ఎక్కువ కాలం ఆడేవి. వాళ్లే నిత్యం సినిమాలు తీసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు స్టార్ కాదు...కథ ముఖ్యం. దర్శకుడు, నిర్మాత కాదు కథనమే ప్రధానం. అందులో పాత్రల ప్రవర్తనకే ప్రాధాన్యం. సినిమాలైతే చాలా మంది తీసేస్తున్నారు. కొందరు విడుదల వరకూ తీసుకొస్తున్నారు. మరికొందరు ప్రొడక్షన్, సెన్సార్ వద్ద ఆగిపోతున్నారు. ఇంకొందరు అయితే తీవ్రంగానే కృషి చేసినా థియేటర్ల వరకూ వారి చిత్రాలు రావడం లేదు. వాళ్లు తీసిన చిత్రానికి ఎలా ప్రచారం చేసుకోవాలి? థియేటర్ వరకు ఎలా తీసుకెళ్లాలి? అన్న విషయాలపై పట్టుసాధించలేకపోవడమే కారణం. అందుకే చాలా చిత్రాలు విడుదలకు నోచుకోవడం లేదు. కాస్తోకూస్తో సినిమా వాళ్లతో పరిచయం ఉన్న వ్యక్తులు, వారితో పనిచేసిన వారి చిత్రాలే థియేటర్ల వరకూ వస్తున్నాయి. అదైనా సంతోషమే. ఎందుకంటే ఓ చిన్న సినిమా రూపొందిస్తే...అందులో అందరూ కొత్త వ్యక్తులే నటీనటులుగా ఉంటే...అటువంటి చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి ప్రశంసలు పొందితే ఆ సినిమా ఎంతో మందికి జీవితాన్నిచ్చింది అవుతుంది. ఈ మధ్య ఇలా కొత్త చిత్రాల ద్వారా పరిచయం అయిన వారే రాణిస్తున్నారు. అటువంటి వారిలో విజరు దేవరకొండ ఒకరు.
సినిమాను నిర్మించడం ఒక ఎత్తయితే దాన్ని థియేటర్ వరకూ తీసుకురావడం ఒక ఎత్తు. అందులోనూ సినిమాలో అందరూ కొత్తవారే ఉంటే ఆ చిత్రాన్ని విడుదల చేయడం మరీ కష్టం. ఆ సినిమాలో విషయం ఉన్నా విడుదలైతేనే కదా తెలిసేది.
అటు విమర్శకుల నుంచీ, ఇటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలందుకున్న 'కేరాఫ్ కంచరపాలెం' చిత్రం పరిస్థితి అంతే. ఈ సినిమా తీసిన వ్యక్తి వెంకటేశ్ మహా. కొత్త దర్శకుడు. అందులో నటించిన నటీనటులంతా కొత్తవారే. ఎత్త కొత్తవారంటే ఇప్పటివరకూ ఒక్కసారీ ముఖానికి రంగేసుకోలేని వారు... కెమెరా ముఖం చూడని వాళ్లూ. తను అనుకున్న కథ సినిమాగా చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తుందని బలంగా నమ్మాడు వెంకటేశ్ మహా. కానీ నిర్మాణం ఎప్పుడో పూర్తయిపోయినా విడుదలకు నోచుకోలేదు. ఆ చిత్రం ముస్లింలో పాత్ర పోషించిన ప్రవీణ నిర్మించారు. అమెరికాలో ఉండే ఆమె తన చొరవతో న్యూయార్క్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ప్రదర్శనకు నోచుకుంది. అప్పుడే 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా తెరకెక్కిందని పత్రికల్లో వార్తొచ్చింది. తనకు జీవితాన్నిచ్చిన దగ్గుబాటి రామానాయుడు స్టూడియోకి వెళ్లాడు ఈ దర్శకుడు. ఆ చిత్రం చూసి రానా సమర్పకుడిగా మారాడు. అతని ప్రచారం..సినీ ప్రముఖుల చేత ఈ చిత్రం గురించి చెప్పడం వల్ల విపరీతమైన పాపులార్టీని వచ్చేసింది. ఒక్క రోజు కూడా థియేటర్‌లో ఆడని ఇటువంటి సినిమా ఇప్పుడు ఏ థియేటర్‌కి వెళ్లి హౌస్‌ఫుల్ బోర్డు కనిపిస్తుంది. ఈ చిత్రం విడుదల వల్ల ఎంతోమందికి జీవితాన్నిచ్చినట్టు అయింది. ఒక వేళ రానా విడుదల చేయకుంటే అవార్డుల జాబితాలో ఈ సినిమా ఉంటుందేమో కానీ థియేటర్లకు వచ్చేది కాదు.
సినిమా బాగుంటే సమర్పకులుగా మారి విడుదల చేసేందుకు ఈ మధ్య తెలుగు నిర్మాతలు ఇద్దరు ముగ్గురు ముందుకొస్తుండడం శుభపరిణామం. అందులో దిల్ రాజు, అల్లు అరవింద్ ఉన్నారు. వీరితో పాటు చిన్నచిత్రాలు తోడుగా, కొత్తవారికి అండగా ఉంటామని నటుడు, నిర్మాత సుధీర్ బాబు, జగపతిబాబు గతంలో ప్రకటించారు. సుధీర్ బాబు కొత్తవారికి అవకాశం ఇస్తూ అండగా ఉంటున్నారు.
విభిన్నంగా ఉన్న చిన్న పెద్ద చిత్రాల సమర్పకులుగానూ, పంపిణీదారుడిగానూ ఉండడం అనేది దిల్ రాజు 'బాహుబలి' నుంచే ఎక్కువగా చేస్తున్నాడు. ఆ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకున్న తర్వాత చిన్న చిత్రాలు ఏవైనా బాగుంటే దిల్ రాజే స్వయంగా విడుదల చేస్తున్నారు. ఇటీవల నాలుగు కోట్లకు 'గూఢచారి' చిత్రం హక్కులను కొనుగోలు చేసి విడుదల చేశారు నిర్మాత అనిల్ సుంకర. ఇదీ చిన్న చిత్రమే కానీ భారీ విజయాన్ని అందుకుంది. నాగార్జున తన మేనల్లుడు హీరోగా చేసిన 'చి.ల.సౌ. చిత్రం విడుదల హక్కులు కొని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఆ చిత్రమూ మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఇటీవలే అల్లు అరవింద్ ఈ జాబితాలో చేరారు. అంతా కొత్తవారితో చేసిన 'పేపర్ బారు' సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించి విడుదల చేశారు. ఈ విధంగా సినిమాను నిర్మించకుండా కేవలం విడుదల వరకూ నిర్మాతగా వ్యవహరించి లాభాలు అర్జించారు వీరంతా. కొత్తగా సినిమాలు తీసేవారికి ఇటువంటి వారు అండగా నిలిస్తే...కొత్త కథలు, నూతన నటీనటులు, కొత్త టాలెంట్ ఇండిస్టీకి పరిచయం అవుతాయి. అప్పుడు వినూత్నమైన చిత్రాలు రావడానికి అవకాశం ఉంటుంది.
2 Comments
Write Commentsసినీరంగం 'స్టార్ హౌస్'ల చేతిలో ఇంకా బందీగానే ఉందనిపిస్తోంది. ఐతే క్రమంగా ఈ 'స్టార్ హౌస్' మరియి 'స్టార్ కిడ్'ల నుండి బయటపడితే దాని గౌరవం మరింతగా పెరుగుతుంది కాలక్రమేణా. ఆ దిశగానే గాలులూ వీస్తుండటం, కొందరు ప్రముఖులు ఆ గాలులకు తోడ్పడటమూ ముదావహం.
Replyఅసలు ఈ సినిమా క్రెడిట్ అంతా వెంకట్ సిద్ధారెడ్డి గారికే దక్కాలి.ఆయన రామానాయుడు స్టూడియోలో పనిచేస్తున్నారు.ఆయనే సురేష్ బాబుగారితో చెప్పి రెకమెండ్ చేసారు.నవతరంగం లోనూ కొన్ని కధలు సారంగలోనూ ఆయన వ్రాసారు.
Replyసినిమా నేను చూడలేదు గానీ మన చుట్టూ ఉన్న ప్రతిభావంతులను మనము గుర్తిస్తున్నామా ?
EmoticonEmoticon