ఏ ఆడపిల్లా బాధపడకూడదని!

భర్త పెట్టే హింసలూ, ఇంట్లోనే ఆడపిల్ల అనే చిన్నచూపూ, కాలేజీలో ర్యాగింగ్ భూతం.. ఎవరికి చెప్పుకోవాలి. ధైర్యం చేసి ఎవరితోనన్నా పంచుకుంటే తరవాత పరిస్థితేంటి.. ఇలా భయపడి బిక్కుబిక్కుమనే వారికోసమే హెల్ప్‌లైన్ ప్రారంభించారు ప్రసన్న. కష్టమని చెబితే చాలు కనిపెట్టుకొని చూస్తారామె. పద్నాలుగేళ్లలో వేలమంది మహిళల్ని ఆదుకొని.. వారి జీవితాలు బాగు చేసిన ప్రసన్న సేవలు ఖండాంతరాలూ దాటాయి. హైదరాబాద్‌లోని షీటీమ్స్‌తో కలిసి పనిచేస్తోన్న ఆమె సేవలు తెలుసుకోవాల్సిందే!



లక్ష్మికి (పేరు మార్చాం) చదుకోవాలనే తపన ఎక్కువ. కానీ తండ్రి మాత్రం కొడుకుల్నే గొప్పవాళ్లని చేయాలని కూతుర్ని పట్టించుకునే వాడు కాదు. కడుపు నిండా భోజనం కూడా పెట్టనిచ్చేవాడు కాదు. దాంతో తను తీవ్ర అనారోగ్యానికి గురైంది. డాక్టరు 'రక్తహీనత' అని చెప్పాడు. కడుపు నిండా తిండి పెట్టి, వైద్యం చేయించే బదులు పెళ్లి చేసి పంపిస్తేనే మంచిదని తండ్రి భావించాడు. కొన్నాళ్లకి లక్ష్మికి పెళ్త్లెంది. భర్తయినా సరిగా చూసుకుంటాడనుకుంటే ఎప్పుడూ తాగి కొట్టేవాడు. ఆమెలో సహనం నశించింది. మా గురించి ఎవరో చెప్పడంతో మా టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసింది. వెంటనే సాయం అందించాం. దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేయించాం. ఇప్పుడొక చిన్న వ్యాపారంలో స్థిరపడి సంతోషంగా ఉంది. ఒక లక్ష్మి మాత్రమే కాదు... రకరకాల హింసలకు గురైన మహిళల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే నా కల. ఆ దిశలో నడుస్తున్నందుకు ఆనందంగా ఉంది.

అంతుచూస్తాం అనేవారు: మాది హైదరాబాద్. మా పెద్దవాళ్లు నా చిన్నతనంలోనే చెన్నైలో స్థిరపడ్డారు. నాకు చిన్నప్పట్నుంచీ ఫోరెన్సిక్ కోర్సు చదవాలన్న కోరిక. అది క్రిమినాలజీలో ఓ సబ్జెక్టు. అందుకే డిగ్రీ పూర్తయ్యాక అందులో చేరా. ఆ సమయంలోనే ఇంటాబయటా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రత్యక్షంగా చూశా, చలించిపోయా. వారికోసం నా వంతుగా ఏమైనా చేయాలనుకున్నా. మద్రాస్ యూనివర్సిటీలో క్రిమినాలజీ విభాగంలో పనిచేస్తున్న తెలుగమ్మాయి ఉషారాణి, హేమ నాకు తోడయ్యారు. అలా ముగ్గురం 2001లో 'క్రైం ప్రివెన్షన్ అండ్ విక్టిమ్ కేర్' పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాం. నాకు డిగ్రీ అవగానే పెళ్త్లెంది. పిల్లలు పుట్టినా నేను చదువాపలేదు. రెండు వేల సంవత్సరంలో పీహెచ్‌డీ పూర్తయ్యాక సేవ దిశగా అడుగులేశా. ఉష, హేమ ఉద్యోగం చేస్తూ నాకు మద్దతుగా ఉండేవారు. నేను మాత్రం పూర్తి స్థాయిలో గృహహింస మీద పోరాటం మొదలుపెట్టా. మొదట్లో ఒక చిన్న గదిలో ఒక ఫోన్ పెట్టుకొని హెల్ప్‌లైన్ ప్రారంభించా. ఎక్కడైనా సమస్య ఉందని తెలిస్తే అక్కడికి పరుగుతీసేవాళ్లం. బాధితులకు సాయం అందించేవాళ్లం. అందుకోసం వివిధ స్వచ్ఛంద సంస్థల్ని ఆశ్రయించేవాళ్లం. ఆ క్రమంలో ఎన్నో ఇబ్బందులూ, బెదిరింపులూ! 'నా భార్యని కొట్టుకుంటే మీకెందుకూ' అని తాగి ఆఫీసుకొచ్చి గొడవ చేసేవారు. కత్తితో వచ్చి బెదిరించే వారు. నిజం చెప్పొద్దూ, మొదట్లో వణికిపోయేవాళ్లం. కానీ 'ఏ మహిళా బాధపడకూడదు, హింసకు గురికాకూడదు' అన్న లక్ష్యం పెట్టుకున్నాక ఇలా భయపడితే ఎలా అని ధైర్యం కూడదీసుకునేవాళ్లం.

ఉచితంగానే సేవలు: గృహహింసకి సంబంధించి పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశాక కూడా, మేం పరిష్కారం కోసం పెద్ద పోరాటం చేయాల్సి వచ్చేది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల్నీ, న్యాయవాదుల్నీ కలిసి బాధితుల పరిస్థితి చెప్పి, సాయం చేయమని కోరేవాళ్లం. ఉష, హేమ తమ జీతం డబ్బునీ, నేను మావారి సంపాదనలోంచి కొంత మొత్తాన్నీ సేవకి ఉపయోగించేదాన్ని. ఇలా ఆరేడేళ్లు మా కార్యక్రమాల్ని కొనసాగించాం. తమిళనాడులోనే కాదు, ఇతర రాష్ట్రాలకూ మా సేవల గురించి తెలిసింది. 2005 తరవాత సెల్‌ఫోన్ల విప్లవం మొదలవడంతో మమ్మల్ని ఆశ్రయించే వారి సంఖ్య పెరిగింది. దాంతో ఎనిమిదేళ్ల క్రితం కొంత స్థలం తీసుకొని సొంతంగా భవనం నిర్మించుకున్నాం. అప్పట్నుంచి మా సేవల్నీ విస్తరించాం. గత కొన్నేళ్లుగా మా వద్దకి నెలకి అరవైకి పైగా కేసులొస్తున్నాయి. సంవత్సరానికి ఏడొందల మహిళల సమస్యల్ని పరిష్కరిస్తున్నాం. ఇప్పటి వరకూ నాలుగు వేల మంది మహిళల సమస్యల్ని పరిష్కరించాం.

ఆశ్రయమిస్తాం: బాధితుల్లో కొందరు భర్త లేదా తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి ఇష్టపడరు. వారికి మేమే వసతి కల్పిస్తాం. వాళ్లు ఉద్యోగంలో కుదురుకునేలా, వ్యాపారంలో నిలదొక్కుకునేలా చూస్తాం. ఇలా గత పద్నాలుగేళ్లలో రెండు వేల మందికి ఆశ్రయమిచ్చాం. ఇక, తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆత్మహత్యాయత్నం, అత్తింటి వేధింపులకు బలై చేరిన వారి గురించి వాళ్లు మాకు చెబుతుంటారు. మేం వెళ్లి బాధితులకు మందులూ, పోషకాహారం, దుప్పట్లూ అందించి... కౌన్సెలింగ్‌తో సమస్యను ఎదుర్కొనేలా ధైర్యం చెబుతాం. న్యాయం జరిగే దిశగా నడిపిస్తాం. ఐదేళ్ల క్రితం యశోద అనే అమ్మాయి భర్త వేధింపులు భరించలేక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చర్మం బాగా కాలిపోయింది. ఓ కన్నుపోయింది. ముక్కుకీ, పెదాలకూ శస్త్ర చికిత్సలు చేయాల్సొచ్చింది. విషయం తెలిసి పరుగెత్తుకెళ్లాం. ఆ అమ్మాయి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాక మాతోపాటే వస్తానంది. ఐదేళ్ల నుంచి మేం తనకి చికిత్సా, ప్టాస్టిక్ సర్జరీ చేయిస్తున్నాం. దాతల నుంచి కన్ను తీసుకుని పెట్టించాం. ఇప్పటికీ ఆమె కోర్టు ద్వారా భర్తతో పోరాడుతోంది. రెండేళ్ల నుంచీ టెలీకాలర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఈ రకంగా ఎవరికైనా సాయం చేసేందుకూ, మా కార్యక్రమాలకీ నెలకి మూడు లక్షల వరకూ ఖర్చవుతోంది. మా జీతాలూ, బంధువులూ, స్నేహితుల ఆర్థిక సాయంతోనే ఈ మొత్తాన్ని సమకూర్చుకుంటున్నాం.

హైదరాబాద్‌లో సేవలు: నా స్వస్థలం హైదరాబాద్‌లోనూ సేవలందించాలనేది ఎప్పట్నుంచో ఉన్న కోరిక. ఇన్నాళ్లకి ఆ అవకాశం వచ్చింది. షీటీమ్స్ ఏర్పాటు చేశాక... గృహహింసకు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల బాధ్యత నన్ను చూడమన్నారు. దాన్లో భాగంగా కొన్ని కార్యక్రమాల్ని నేను నిర్వహిస్తున్నా. సెయింట్‌మెరీస్, సెయింట్ ఆన్స్ కళాశాలల్లో షీటీమ్స్‌తో కలిసి 'లైంగిక వేధింపుల్నీ, వీధుల్లో అకృత్యాల్నీ ఎలా ఎదుర్కోవాలి' అన్న అంశంపై తరగతులు నిర్వహిస్తున్నా. త్వరలో మా సేవల్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం మమ్మల్ని సంప్రదించాలంటే మా టోల్‌ఫ్రీ నంబర్... 18001027282.

అలా కాపాడాం.. మనదేశంలోని పలు రాష్ట్రాల నుంచే కాదు.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా నుంచీ మాకు ఫోన్లు వస్తాయి. ఆ దేశాల్లోని మా స్నేహితులతో మాట్లాడి సాయం అందిస్తాం. రెండేళ్ల క్రితం ఓ అమ్మాయికి తల్లిదండ్రులు పెళ్లి చేసి అమెరికా పంపారు. అక్కడికెళ్లాక భర్త ఉద్యోగం మాన్పించాడు. ఫోన్ మాట్లాడితే స్పీకర్ పెట్టమనేవాడు, ప్రతిక్షణం అనుమానించేవాడు. ఆఫీసుకెళితే ఇంటికి తాళం వేసుకెళ్లేవాడు. ఆఖరికి తల్లిదండ్రులకి ఫోన్ చేయకుండా తనని బందీగా మార్చాడు. ఆమె తల్లిదండ్రులు ఏడుస్తూ మా దగ్గరికొచ్చారు. విదేశంలోని మా సభ్యుల్ని వాళ్ల అమ్మాయి ఉన్న చోటుకి పంపి, ఇక్కడికి తీసుకొచ్చి అప్పగించాం, విడాకులిప్పించాం. ఇప్పుడు మరో పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉంది.




Previous
Next Post »