మరునాడు వంటకు పని సులువవుతుందనీ, సమయం కలిసి వస్తుందని కూరలను ముందుగానే తరిగి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు చాలామంది. సాధారణముగా కూరగాయలను కట్ చేసి నిల్వచేస్తే ఆక్సిడేషన్ వలన త్వరగా చెడిపోతాయి. వీటితో పాటు కురగాయలలోని పోషక విలువలు కూడా తగ్గిపోతాయి.
అలా కాకుండా కొన్ని జాగ్రత్తలను తీసుకొని కూరగాయలను కట్ చేసుకొని భద్రపరచడం వలన మీ విలువైన సమయం, డబ్బు ఆదా కావడముతో పాటు వంట పని కూడా సులభతరం అవుతుంది. కూరగాయలను తరిగిన తరువాత రేఫ్రిజిరేటర్‌లో భద్రపరిచి మీకు కావలసిన సమయములో వాటిని ఉపయోగించి క్షణాల్లో వంటను పూర్తి చేయవచ్చు.
ఆకు కూరలు
ఫ్రిజ్‌లో ఆకుకూరలు భద్రపరిచే ముందు ఆకులను కాండం నుండి అలాగే చెడిపోయిన, వాడిపోయిన ఆకులను వేరుచేసి ఉంచాలి. ఆకుకూరలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచాలంటే నీటిలో కడగకుండ అలాగే ఉంచాలి. టిష్యూపేపర్ లేదా కాటన్ బట్టలో ఆకులను చుట్టి ఫ్రిజ్‌లో నిల్వచేసుకోవచ్చు. ఇలా చేస్తే ఆకులలోని తేమ పోకుండా, ఆకులు కూడా తాజాగా ఉంటాయి. ఇలా నిల్వ చేసిన ఆకుకూరలను వీలైనంత త్వరగా వినియోగించడం మంచిది.
దుంప కూరగాయలు
బంగాళదుంప, క్యారెట్, బీట్‌రూట్, ముల్లంగి వంటి దుంప కూరగాయలు కట్ చేసి వదిలేస్తే రంగులను పిండి పదార్థాలను త్వరగా కోల్పోతాయి. దీంతో వాటిలోని తేమ తగ్గిపోయి వాటి రుచి కూడా దాదాపు ఆవిరైపోతుంది. కట్ చేసిన దుంప కూరలను ఒక గిన్నెలో వేసి, అందులో కొంత నీరు పోసి మూత పెట్టి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. ఇలా భద్రం చేసిన దుంప కూరగాయల ముక్కలను ఒక్క రోజులోనే వాడేసుకోవాలి.
క్యాబేజీ బ్రోకోలి, కాలీఫ్లవరు
కాలిఫ్లవర్, బ్రోకోలి కట్ చేసిన వెంటనే వాటిలోని తేమను అంత త్వరగా కోల్పోవు. కాని రిఫ్రిజిరేటర్‌లో పెడితే రుచులు కోల్పోయే అవకాశం ఉంది. కనుక కాలీఫ్లవర్‌ను కట్ చేసిన వెంటనే గాలి చొరబడని బాక్స్‌లో ఉంచుకోవాలి. బ్రోకోలిని గాలి తగిలే విధంగా నిల్వచేసుకోవాలి.
ఉల్లి పాయలు
కట్ చేసిన ఉల్లిపాయలను ఎక్కువ సేపు ఉంచకూడదు, ఉంచినా వంటకు ఉపయోగించకూడదు. కనుక ఉల్లిపాయలను అప్పటికప్పుడే అవసరానికి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో అయితే గాలి చొరని డబ్బాలో ఉంచి, టైట్‌గా మూత బిగించాలి.
వంకాయలు
ఆక్సిడేషన్ వల్ల వంకాయలు కోసిన కొద్ది సేపటికే రంగు మారిపోతాయి. ఇవి రంగుమారకుండా ఉండడానికి వంకాయ ముక్కలపై పసుపు, నిమ్మ రసము కలిపిన నీటిని చల్లాలి. కోసిన వంకాయలను ఫ్రిజ్‌లో ఉంచేందుకు వాటిని రౌండ్‌గా కోసి పేపర్, టవల్, లేదా డబ్బాలో పెట్టొచ్చు. రెండు రోజుల వరకు వంకాయ ముక్కలు తాజాగా ఉంటాయి.
టమాటా
వీటిని కట్ చేయకుండానే నిల్వ చేయొచ్చు. కోసిన తరువాత టమాటా ముక్కలు వాటిలోని తేమ, నీరును కోల్పోతాయి. కాబట్టి టమాటాలను అవసమైనప్పుడు తీసుకొని కట్ చేసికుంటేనే బాగుంటుంది.
బెండకాయలు
టమాటా లాగే బెండకాయలను కూడా కోయకుండా నిల్వచేస్తే మంచిది. బెండలోని జిగురు స్వభావము వల్ల, ముద్దగా అయి పాడవకుండా ఉండాలంటే కాయల మొదలు, కొస కట్‌చేసి ఫ్రిజ్‌లో నిలువచేసుకోవచ్చు.
అల్లం
అల్లం నేల లోపలి నుండి వచ్చేది. అల్లాన్ని మట్టిలేకుండా శుభ్రంగా కడిగి దానిపై ఉన్న పొట్టును తీసివేసి ముక్కలుగా కోసి గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో భద్రపరచుకుంటే దానిలోని పోషక విలువలు పోకుండా తాజాగా ఉంటుంది. ఈ భద్రపరచుకున్న ముక్కలను అయిదు రోజులలో వినియోగించుకోవాలి.
వెల్లుల్లి
వెల్లుల్లి అనగానే మనకు గుర్తుకు వచ్చేది దాని గాఢమైన వాసన. వెల్లుల్లి పై ఉండే పొట్టుని తీసేసి చిన్న ముక్కలుగా తరిగి గాలి తగలని డబ్బాలో ఉంచితే దాని వాసన పోకుండా తాజాగా ఉంటుంది. ఇలా చేసిన వెల్లుల్లి పదిరోజుల వరకూ నిల్వ ఉంటాయి.
మునక్కాయలు
దీన్ని కూడా గాలి తగలని డబ్బాలో ఉంచితే తాజాగా ఉంటాయి.
బఠాణి
పచ్చి బఠాణీలను ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టి నిల్వ చేయొచ్చు. ఇలా చేస్తే బఠాణి సుమారు ఆరు నెలల వరకు తాజాగా ఉంటుంది.
పచ్చి మిర్చి
పచ్చి మిరప కాయలను తడి లేకుండ శుభ్రపరచి వాటి తోడిమలను తీసేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
EmoticonEmoticon