సాధన ప్రభావం





సాధన భావ ప్రధానం. సాధన భావ ప్రసారం. భావ సహితంకాని మంత్రం అక్షర సముదాయమేగానీ మహిమాన్వితం కాలేదు. యుగయుగాలుగా రుషులు భావనాపూరితంగా అనుష్ఠానం చేసినందువల్లే మంత్రానికి అంత శక్తి సమకూరి ఉంటుంది.



కళ్లతో నిర్వికారంగా ఎవరినైనా చూస్తే చూపు వారి కళ్ల వరకు మాత్రమే చేరుతుంది. మంత్రమైనా అంతే. మాటలైనా అంతే. ప్రార్థనైనా, పూజైనా అంతే. భావ ప్రధానం, సంఖ్యా ప్రధానం కాదు. సమయం ప్రధానం కాదు. మనసును ఎంత మిళితం చేశామన్నదే ప్రధానం. ఆ మనసు ఎంత భావపూరితంగా ఉందన్నదే ప్రధానం. రామకృష్ణుల వారికి అమ్మ ‘భావ ముఖంతో ఉండు’ అని ఆదేశిస్తుంది. దిశానిర్దేశం చేస్తుంది.

ఏమిటి భావం? అది మన అభిప్రాయం. మన ప్రేమ. దాన్ని తెలియజేసే తీరు తీవ్రత, దాన్ని తెలియజేస్తున్న సంతృప్తి, సంపూర్ణ సమర్పణ. వాసనలేని గడ్డి పువ్వులాంటి యథాలాప అర్చకులు భగవంతుడికి అవసరం లేదు. పరిమళ భరితమైన పారిజాతాలు కావాలి.

నిర్భావం నిస్తేజమైన శుష్క సాధన దైవాన్ని రంజింపజేయలేదు. మనసనే మరువంపు సౌరభాలు నింపుకోనీ..భావమనే చందనపు లేపనాలు పులుముకోనీ. రుక్మిణీదేవి తులసిదళంలో భక్తి అనే భావభారాన్ని నింపింది. కాబట్టే కృష్ణుడంతటివాణ్ని అవలీలగా తూచుకోగలిగింది, గెలుచుకోగలిగింది.

మురళిలో భావం ఉంది కాబట్టే అమృతరాగాల గారాలు పోయింది. స్వరాల సరాగాల తేలింది. నిజానికి కేవలం వెదురుపుల్ల అయిన మురళిలో శ్రీకృష్ణుడు భావనా శ్వాసలు ఊదాడు కాబట్టే మురళి అంతగా స్వరాలు పోయింది. శివుడి ఢమరుకం అంతే. ఆయన వేళ్లలోంచి ఢమరుకంలోకి ఓంకారనాదాలు భావమోదాలై..అక్షరామృత శబ్ద బిందువులై జాలువారాయి. భావంతో జీర శబ్దాలు జీవ శబ్దాలై సంగీత ఝరుల్ని కురిపిస్తాయి. మనోరంజనులై పుష్పిస్తాయి, పరిమళిస్తాయి.

మనం ఆప్యాయతతో స్పృశిస్తే పూల మొక్కలు సైతం ప్రఫుల్లం అయిపోతాయి. క్రూరమృగాలూ పెంపుడు జంతువులుగా మాలిమి అవుతాయి. నిజానికి భగవత్ సాధనం బాహ్యత్రయాల్లో లేదు. ఆంతర్య భావ ప్రకటనలో ఉంది. కేవలం భావాన్ని పూరించుకొని మాత్రమే సాధకులు బాహ్య సరంజామానంతా విసర్జించి(ఆనక జపమాలతో సహా) కేవలం కౌపీనధారులై నిర్జన నిర్గమ ప్రదేశాలకు వెళ్లిపోతుంటారు.

భావ ప్రకటనకు మనసు చాలు, ప్రేమ చాలు. సాధన చివరి దశకు చేరినప్పుడు మాత్రమే మనసు, అందులోని భావం అంతరించిపోతాయి. ఎందుకంటే- అప్పటికే భగవంతుడికి అందవలసి నంత భావం అంది ఉంటుంది. చేరవేయవలసినంత భావ ఝరిని సాధకుడు చేరవేసే ఉంటాడు. నిజానికి దాని ఫలితమే సాధన చివరి అంకమైన మనోనాశనం, భావశూన్యం.
Previous
Next Post »