ఒకసారి రామయోగిగారు భగవానులను ఇలా ప్రశ్నించారు. ‘స్వామీ! సాయిబాబా శిష్యులు కొందరు బాబా పటం పెట్టుకొని పూజిస్తూ ఆ పటమే గురువంటారే ఎట్లా పొసగుతుంది? దైవమని పూజింపవచ్చుగాని గురువని సేవిస్తే వీరు పొందే లాభమేమిటి?’ ‘చిత్తుకాగ్రత కలుగుతుం’దన్నారు భగవాన్.
కాని ఆ ఏకాగ్రత స్థిరపరచుకోటానికి గురువు కావద్దా? అన్నారు యోగిగారు. ‘అవునండి గురియేగదా గురువు’ అన్నారు భగవాన్. ‘ఆ గురి కుదరటానికి ఆచరణ రూపంగా చూపించే సజీవ గురువు కావాలిగాని, నిర్జీవ ప్రతిమ ఏం చేస్తుంది? అట్లా సజీవ గురువు లేకుండానే సిద్ధి పొందటం భగవాన్ కంటె సరిపోయిందిగాని మా బోంట్లకు సాధ్యమా? అన్నారు వారు.
‘వాస్తవమే, అయినా, నిర్జీవ ప్రతిమను ఆరాధించినందువల్ల కొంతవరకు చిత్తుకాగ్రత కలుగుతుంది. ఆ ఏకాగ్రత స్థిరపడుటకు తానెవరో విచారించి తెలుసుకుంటేగాని కుదరదు. ఆ విచారణకు గురుసహాయం అవసరమే. ఆందుకే ఉపాసనతో ఆగకూడదంటారు పెద్దలు. అయితే, ఈ ఉపాసన వృథాకాదు.
ఎప్పటికైనా ఫలిస్తుంది. కాని ఈ ఉపాసనలో డాంబికం ఉండరాదు. మనసు స్వచ్ఛంగా ఉంటే అంతా ఫలిస్తుంది. లేకుంటే చవిటి నేలన నాటిన విత్తనముల వలె వృథా అవుతుంది” అన్నారు భగవాన్.
‘ఏమో స్వామి! మీరు నూరు చెప్పండి వెయ్యి చెప్పండి. తన నడత సరిచూచుకోటానికి మీవంటి సజీవ గురువు కావాలిగాని, నిర్జీవ ప్రతిమలకు గురుస్థానం ఎట్లా ఇవ్వటం?’ అన్నారు వారు. భగవాన్ మందహాసంతో ‘ఊ ఊ’ అంటూ తలూపి మౌనం వహించారు. మౌనసహితమైన ఆ మందహాసంలో మాణిక్యాలు ఒలికినయ్యన్నా! ఏం వ్రాయమంటావు?
EmoticonEmoticon