స్త్రీ అంటే ఆకాశమంత సహనం, భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలంటారు. ఆ విషయంలో ఆడవారికి ఎవ్వరూ సాటి రారు. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచీ రాత్రి నిద్రించే దాకా తీరిక ఉండదు. ఇప్పుడు ఇంకో బాధ్యత కూడా పెరిగింది. ఉద్యోగం చేసి, పిల్లలను పికప్ చేసుకోవడం. దీంతో ఆడవారికి వారి ఆరోగ్యం కన్నా భర్త, పిల్లలపై చూపించే శ్రద్ధే ఎక్కువ. తన కంటే తన వారే ముఖ్యం అనుకునే స్త్రీ గుణం చాలా గొప్పది.
ఆడవారికి అన్ని విషయాల్లోనూ బాధ్యతలు ఎక్కువే. సమాజంలో నిర్వహించాల్సిన పాత్రలూ ఎక్కువే. దానితోపాటు ఒత్తిళ్ళూ అధికమే. అందులోనూ ఇంట్లో ఎవరికన్నా బాగోలేదంటే వారితోపాటు రాత్రింబవళ్ళు ఉంటూ వారి ఆరోగ్యం కుదుట పడే దాకా నిద్ర లేకుండా మేల్కొని ఒత్తిడికి గురవుతారు.
అయితే ఈ ఒత్తిళ్ళని కూడా భరిస్తూ తన బాధ్యతలని సక్రమంగా, సరైన సమయంలో పూర్తి చేయడానికి అలవాటుపడిపోయింది. దాంతో తన గురించి, తన ఆరోగ్య పరిస్థితి గురించి, తనలోని మానసిక ఆందోళన గురించి ఏమాత్రం ఆలోచించదు. అదిగో అలా తనని తాను నిర్లక్ష్యం చేసుకునే ఆడవారి గురించి హెచ్చరిస్తోంది ఇటీవల వెలువరించిన పరిశోధన ఫలితం.
ఇంట్లో వారి ఆరోగ్య దృష్ట్యా..
ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారికి సేవలు చేయడంలో ఆడవారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం వుంటుంది అంటున్నారు పరిశోధకులు. ఆ ఒత్తిడి ఆడవారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని కూడా చెబుతున్నారు. ఈ పరిశోధనలో భాగంగా 65 సంవత్సరాలు పైబడ్డ స్త్రీలని, వారి జీవన శైలిని, వారి కుటుంబ ఆరోగ్య పరిస్థితులని, వారి వైద్య రికార్డులని పరిశీలించారు.
ఒకరు ఇద్దరు కాదు.. సుమారు ఐదు లక్షల మందిని పరిశీలించిన ఈ పరిశోధకులు చివరికి తేల్చిన విషయం.. కుటుంబంలోని వారి అనారోగ్యం స్త్రీలని తీవ్ర ఒత్తిడికి గురిచేసి, వారి ఆయుష్షుపై ప్రభావాన్ని చూపిస్తుంది. అదీ దీర్ఘకాలిక అనారోగ్యం కలిగిన వారి మంచి చెడ్డలు చూడటంలో అంతర్లీనంగా ఉండే ఎన్నో విషయాలు ఆ ఒత్తిడికి కారణం అవుతాయట.
అధిక ఒత్తిడికి లోనవుతారు..
వయసు మళ్ళినవారు, మంచంపై ఉన్నవారి ఆలనా పాలనా చూడటంతో తమపై తాము శ్రద్ధ పెట్టకపోవటం. పూర్తిగా తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం ఒక కారణం అయితే, పోషకాహారం తీసుకోకపోవడం, సంరక్షణ చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ఎక్కువ శ్రమపడటం వంటివి మరో కారణం.
అధ్యయనంలో భాగంగా స్త్రీల వైద్య రికార్డుల్ని పరిశీలించినప్పుడు కేన్సర్ వంటి అనారోగ్యంతో బాధపడేవారు, తీవ్ర అంగవైకల్యానికి గురైన వ్యక్తులు, ఇంట్లో వున్న వారికంటే ఎక్కువ ఒత్తిడికి గురైనట్టు తేలింది. శారీకర శ్రమ, సామాజిక ఒత్తిళ్ళ వంటివి కారణం కావచ్చంటున్నారు పరిశోధకులు. మానసిక సమస్యలతో బాధపడే వ్యక్తులకు రక్షణగా ఉండే వారికి ఈ ఒత్తిడి మరీ అధికమట.
ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాలి..
‘డిమెన్షియా’ అంటే మతిమరుపు. ఇతర మానసిక రుగ్మతల బారిన పడిన వారిని రక్షించడంలో సాధారణ స్థాయి కంటే ఒత్తిడి, వేదన అధికంగా వుంటాయట. హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. రోగ నిరోధక వ్యవస్థను కాపాడే తెల్ల రక్తకణాలు చురుకుదనాన్ని కోల్పోతాయట. దీంతో అధిక రక్తపోటు, గుండెజబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా వున్నట్టు గుర్తించారు. ఇలా రోగుల సంరక్షణలో ఎన్నో సవాళ్ళు, ఒత్తిళ్ళు దాగున్నాయని, ఈ విషయంలో స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మీరు బాగుంటేనే.. ఎదుటి వాళ్ళను చూసుకోగలిగేది..
ఇంట్లోవారి ఆరోగ్యం తప్పకుండా ఒత్తిడికి గురిచేస్తుంది. అయినవారి బాధ చూడటం కష్టమే. వారిని అన్నివేళలా కంటికి రెప్పలా కాపాడాలనుకోవటం సహజమే. అయితే అదే సమయంలో మన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించమని చెబుతున్నారు పరిశోధకులు. ముందుగా పరిస్థితులని యథాతథంగా స్వీకరించడం, తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆందోళన చెందకుండా మంచి ఆహారాన్ని, విశ్రాంతిని తీసుకోవడమే మేలు.
ఇంట్లో మిగిలిన సభ్యుల సహాయ సహకారాలని తీసుకోవడం ఉత్తమం. ఒత్తిడిగా అనిపిస్తే రిలాక్స్ అయ్యే టెక్నిక్స్‌ను పాటించాలి. వీలయితే ఓ గంట ఒంటరిగా ఉంటే ఒత్తిడి తగ్గి మనసుకు విశ్రాంతి దొరికే అవకాశమూ లేకపోలేదు. ఇన్ని జాగ్రత్తలు ఎందుకంటే ఆడవారి ఆరోగ్యంతోనే ఇతర కుటుంబాల ఆరోగ్యం ముడి పడి ఉంటుంది. కాబట్టి కొంచెం ధైర్యంగా, జాగ్రత్తగా ఉండటం ఆడవాళ్ళకి చాలా అవసరం.
EmoticonEmoticon