పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు పాత్ర ప్రధానమైనది. వారి ఎదుగుదలపై సరైన శ్రద్ధ చూపితేనే జీవితం సాఫీగా సాగుతుంది. కుదరట్లేదని బయటి వాళ్లకి అప్పచెప్తే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. అమ్మ లాలింపు, తండ్రి దండిపు, తాతా నానమ్మల ఓదార్పు ఇలా అన్ని కలగలిస్తేనే పిల్లలకు జీవితం విలువ తెలుస్తుంది. జీవితంపై ఆసక్తి కలిగి మంచి నడవడికతో మున్ముందుకు సాగే అవకాశం ఉంటుంది.
చిన్నపిల్లల్లో క్రమశిక్షణ ఎందుకు లోపిస్తుంది? దీనికి బాధ్యులెవరు? బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకునే తల్లులు కూడా ప్లిలల క్రమశిక్షణ విషయంలో ఎందుకు విఫలమవుతున్నారు. ఈ విషయాలన్నీ లోతుగా పరిశీలిస్తే, క్రమశిక్షణపై సరియైన అవగాహన లేకపోవడం, అజమాయిషీలో అలసత్వం, పిల్లల శక్తిని వయస్సును తప్పుగా అంచనా వేయడం లాంటి అనేక ముఖ్యమైన అంశాలు కనబడతాయి. వాటిని ఎలా సరిదిద్దాలంటే...
క్రమశిక్షణ అంటే...
పెద్దలుగా చేసే ఈ చిన్న పొరపాట్లు తిట్టడం, కొట్టడం, అరవడం, విసుక్కోవడం, ఇరిటేట్ అవడం ఇవన్నీ డిసిప్లేన్ కాదు. ఇలాంటి చర్యలు పిల్లల్లో కాదు, సమాజంపైనే సరియైన అవగాహన ఏర్పడదు. ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో అర్థమయ్యేలా చెప్పడమే నిజమైన క్రమశిక్షణ.
అది కూడా పిల్లల మనసుకు హత్తుకునేలా, వారికి అర్థమయ్యేలా నెమ్మదిగా, విపులంగా చెప్పాలి. ఇతరుల మనోభావాలను గౌరవిచడం, ఎవరి మనస్సు నొప్పించకుండా ప్రవర్తించే అలవాట్లను నేర్పించాలి. ఇవేవీ చేయకుండా ఫలానా పని సరిగా చెయ్యలేదని పిల్లల్ని నిందించడంలో అర్థం లేదని పెద్దవాళ్ళు గుర్తించాలి.
పెద్దల పర్యవేక్షణలోనే పిల్లల పెంపకం..
పిల్లల నడవడికను తల్లిదండ్రులు ఎప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగం చేసే తల్లులు ఈ విషయంలో జాగ్రత్తతో వ్యవహరించాలి. గతంలో అయితే స్త్రీలు ఇంటికే పరిమితమై పిల్లల ఆలనా పాలన చూసుకునేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరూ పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. అందుకే ఇప్పుడు క్రచ్‌లు పిల్లల బాధ్యత తీసుకుంటున్నాయి.
క్రచ్‌లు ఎంత బాధ్యత వహించినా మన బాధ్యతను కూడా మరవకూడదు కదా.. అందుకే ఉద్యోగస్తులైన తల్లిదండ్రులల్లో ఎవరికి తీరిక దొరికినా మధ్యలో అప్పుడప్పుడు క్రచ్‌కి వెళ్తూ ఉండాలి. తమ పిల్లల ప్రవర్తన గురించి, క్రమశిక్షణ గురించి స్వయంగా అడిగి తెలుసుకోవాలి. శిక్షణ ఎలా ఉందో తెలుసుకొని, నచ్చకపోతే మరొక చోటుకి మార్చాలి.
యాంత్రికంగా జీవించడం...
తల్లిదండ్రులు యాంత్రిక జీవితంలో ఇల్లు, ఆఫీస్ తప్పితే ఎలాంటి సుఖసంతోషాలు లేకుండా పసి పిల్లలు అడిగిందల్లా సమకూర్చడం ఎక్కువ అయ్యింది నేటి రోజుల్లో. కానీ రానురానూ ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పిల్లలు పెద్దవుతున్న కొద్దీ వారి కోరికలు అవసరాల ఖరీదు పెరుగుతుంది. పెంకితనమూ, మొండితనమూ పెరుగుతుంది.
అందుకే మేము అడిగేవన్నీ అమ్మానాన్నా కొనరనే గ్రహింపు పిల్లలకు మొదటి నుంచే కలిగేలా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలకు డబ్బు విలువ తెలియజేయాలి. వారు అడగ్గానే ఇవ్వకుండా దేనికోసమో అడిగి అవసరం తెలుసుకొని ఇవ్వాలి. అలాగని మరీ వారిని ఎందుకు దేనికీ అంత అవసరమా అని అనుమానించినట్టు మాట్లాడకూడదు.
అది మీకు అనవసరమనిపిస్తే దాని వలన కలిగే లాభా నష్టాల గురించి అవసరమైతే ఇంటి పరిస్థితుల గురించి కూడా చెప్పాలి. అప్పుడే పిల్లల ప్రతికూల అంశాలపై అవగాహన ఏర్పడుతుంది.
ముందు రోజుల్లో...
అమ్మమ్మల కాలంలో అయితే ఇంట్లో తాత, మామ్మలాంటి, నానమ్మల్లాంటి పెద్దవాళ్ళు ఉండేవారు. వాళ్లే పిల్లలను చూసుకునేవారు. నేటి ఒంటరి జీవితాల్లో ఇంటిని, పిల్లలను చూసుకునే వారే లేరు. పెద్దలు లేని చోట ఇలాంటి ఇబ్బందులు సహజం. చిన్న కుటుంబాలు ఎక్కువవుతున్న ఈ కాలంలో పెద్దవాళ్ళ అవసరం ఎంతైనా ఉంది.
వారి అనుభవాలు పిల్లల ఆలనాపాలనాకు ఎంతో ఉపయోగపడతాయి. సరైన ప్రవర్తన, క్రమశిక్షణ అలవడటానికి పెద్దవాళ్ళ అనుభవం, సహకారం చాలా అవసరం. ఒకే సంతానం అయినప్పుడు ఎక్కువ గారాబం చేస్తారు. గారాబం పరిమితి దాటితే క్రమశిక్షణ గాడి తప్పుతుంది. దేనికైనా ఒక హద్దు తప్పనిసరిగా ఉండాలి.
EmoticonEmoticon