సాలెగూడులో ఆ అవశేషాలేంటి?


ప్రశ్న: సాలెగూడులో బోలుగావుండే కీటకాల అవశేషాలు ఎక్కడనుంచి వస్తాయి?

జవాబు: సాలెపురుగు తన ఉదరభాగానికి కిందివైపున ఉండే గ్రంధుల నుంచి స్రవించే ద్రవం సాయంతో గూడును అల్లుతుంది. ఆ ద్రవం గట్టిపడి దారంలాగా అవుతుంటుంది. సాలెగూడు దారాలు సన్నగా దృఢంగా ఉండటమేకాకుండా ఒక జిగురులాంటి పదార్థాన్ని కలిగి ఉంటాయి. గాలిలో ఎగురుతూ వచ్చే కీటకాలు గూడును గమనించలేక దాన్ని తాకి కాళ్లు, రెక్కలు అతుక్కుపోయి చిక్కుకుంటాయి. అక్కడ నుంచి
తప్పించుకొనే ప్రయత్నంలో వాటి దేహాలు మరిన్ని దారాలకు చుట్టుకుపోతాయి. కీటకాల కదలికలతో గూడు కంపించడం వల్ల ఏ మూలనో ఉన్న సాలె పురుగు వాటిని గ్రహించి అతి వేగంగా అక్కడికి చేరుకుంటుంది.

సాలెపురుగు నోటిలో విష గ్రంధులతోపాటు పొడవైన, పదునైన పలువరస ఉంటుంది. ఆ పళ్లతో కీటకాన్ని పట్టుకోగానే విషం దాని దేహంలో ప్రవేశించి చనిపోతుంది. సాలెపురుగు తన ఆహారాన్ని ద్రవరూపంలో మాత్రమే తీసుకోగలుగుతుంది. అందువల్ల చనిపోయిన కీటకం దేహంలోకి సాలెపురుగు తన నోటిలోని కొన్ని స్రావాలను ప్రవహింపజేస్తుంది. అప్పుడు కీటకంలోని మెత్తని భాగాలు ద్రవ రూపంలోకి మారతాయి. వాటిని సాలీడు నోటితో పీల్చుకుంటుంది. కీటకం శరీరంలో దృఢంగా ఉండే కర్పరం (shell)లాంటి భాగాలు ద్రవరూపంలోకి మారవు కాబట్టి అవి అలాగే మిగిలిపోతాయి. అవే సాలెగూటిలో బోలుగా కనిపించే అవశేషాలన్నమాట.

Previous
Next Post »