70mm సినిమాథియేటర్‌కు, 35mm థియేటర్‌కు తేడా ఏంటి
మనం సాధారణంగా ఎడమ నుంచి కుడికి ఎక్కువ విస్తారాన్ని, పై నుంచి కిందికి తక్కువ విస్తారాన్ని చూస్తుంటాము. అందువల్లనే సినిమా థియేటర్లలో తెర ఎడమ కుడి దిశల్లో (అడ్డంగా) ఎక్కువగానూ, పైనుంచి కిందికి (నిలువుగా) తక్కువగానూ ఉంటుంది.
ఇలా అడ్డానికి, నిలువుకి ఉన్న నిష్పత్తిని ఆస్పెక్ట్ నిష్పత్తి (aspect ratio) అంటారు. చాలా కాలం పాటు (నేటికీ చాలా చోట్ల) ఇది 4:3 నిష్పత్తిలో ఉండేది. సినిమా స్కోపు ప్రక్రియలో ఇది 16:9 లేదా 37:20 లేదా 47:20 నిష్పత్తిలో ఉంటుంది. ఆ విధంగా క్రమేపీ నిలువు కన్నా అడ్డం పెరుగుతూ వచ్చింది. తద్వారా కుడి నుంచి ఎడమకి ఎక్కువ విస్తారంలో దృశ్యాల్ని తెరమీద చూసే అవకాశం ఏర్పడింది. ఇంకో మాటలో చెప్పాలంటే 4:3aspect ratio ఉన్న తెర మీద కన్నా సినిమా స్కోపు తెరమీద ఎక్కువ మంది పాత్రలను, దృశ్యాలను మోహరించవచ్చును. సాధారణ తెర అయినా, పైన చెప్పిన మూడు రకాల సినిమా స్కోపు తెర అయినా, దాని మీదకు బొమ్మను పంపే ఫిల్మ్‌లో దృశ్యం పొడవు, వెడల్పుల నిష్పత్తి మాత్రం మారదు. మామూలు ప్రొజెక్టరులో రీళ్లుగా తిరిగే ఫిల్మును 35mm ఫిల్మ్ అంటారు. ఎందుకంటే దాని అడ్డం 35 మిల్లీమీటర్లు, నిలువు సుమారు 26 మిల్లీమీటర్లు ఉంటుంది. ఇంత చిన్న ఫిల్ము నుంచి ప్రకాశవంతమైన కాంతి మామూలు థియేటర్లలోని (35mm) తెరమీద పడ్డం వల్ల బొమ్మల స్పష్టత పెద్దగా తగ్గదు. కానీ ఇదే ఫిల్మును చాలా పెద్ద తెరమీద ప్రదర్శించినప్పుడు బొమ్మల స్పష్టత తగ్గి పోతుంది. అందువల్ల 35 mm ఫిల్ము కన్నా ఎక్కువ వైశాల్యం ఉన్న ఫిల్మును ఆయా పెద్ద థియేటర్లలో వాడతారు. ఇలాంటి పెద్ద థియేటర్లలో వాడే ఫిల్మ్ అడ్డం కొలత 70mm ఉంటుంది.
EmoticonEmoticon