గర్భిణుల యొక్క ఆహార నియమాలు ఏమిటి


మాతృత్వం అనేది ప్రతి స్త్రీకి ఓ వరం. ఆ వరం శాపం కాకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా ఆమెదే! గర్భిణులు తీసుకునే మందుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో, ఆహారం విషయంలో కూడా అంతే అప్రమత్తంగా ఉండాలి. చాలామంది ఇద్దరికి సరిపడా ఆహారం తీసుకుంటుంటారు. అలా తీసుకోవలసిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. గర్భిణులు ఎలాంటి ఆహారం, ఎంత మొత్తంలో తీసుకోవాలి? అన్న వివరాలు మీకోసం…


– గర్భిణులు ఎక్కువగా తింటే పుట్టబోయే బిడ్డ బరువు అధికంగా ఉంటుంది అన్నది అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. గర్భిణులు ఆహారంలో పోషకాలు అధికంగా ఉండేవిధంగా చూసుకోవాలే తప్ప మోతాదుకు మించి ఆహారం తీసుకోకూడదని వారు సూచిస్తున్నారు.

– ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకూడదు. కొద్దికొద్దిగా వీలైనన్ని సార్లు అంటే రోజు మొత్తం మీద నాలుగైదు సార్లు తినడం అలవాటు చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

– అందుబాటులో ఎప్పుడూ కొన్ని పళ్ళు ఉంచుకోవడం మంచిది. సీడ్‌లెస్‌ గ్రేప్స్‌ లాంటివి స్నాక్స్‌ కింద తీసుకోవాలి.

– కెఫైన్‌ అధికంగా లభించే ద్రవపదార్థాలు పూర్తిగా మానేస్తే మంచిది.

– బరువుపెరగడం అన్నది గర్భిణులకు సర్వసాధారణం. కానీ ఒకేసారి అధికంగా పెరగడం లేదా తగ్గడం అన్నది అనారోగ్యానికి చిహ్నం.

– చిప్స్‌, వేపుడు పదార్థాలు బరువును పెంచడానికి దోహదం చేసేవే అయినా, ఈవిధమైన పదార్థాలు తీసుకోవడం ద్వారా బరువు పెరగడం అన్నది గర్భిణులకు ఆరోగ్యం కాదని నిపుణులు సూచిస్తున్నారు. పై వాటిని పూర్తిగా మానేయకుండా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి.

– ఆస్తమాతో బాధపడే గర్భిణులు వేరుశనగపప్పుకి దూరంగా ఉండాలి. వీరు ఆహారంలో వీటిని తీసుకుంటే పుట్టబోయే శిశువు ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

– కొన్ని రకాల జలచరాలకి దూరంగా ఉండాలి. పచ్చిమాంసం లేదా ఉడికీ ఉడకని మాంసాహారం అస్సలు తినకూడదు. మాంసాహారంలో ఉండే లివర్‌ లేదా లివర్‌తో చేసే ఆహారపదార్థాలకూ పూర్తిగా దూరంగా ఉండాలి.
Previous
Next Post »