జరాసంధుడు మధురపై పదునేడుసార్లు దండయాత్రచేసి శ్రీకృష్ణుని చేతిలో ఓడిపోయి వెళ్లిపోయాడు. అయినా సరైన సమయం కోసం ఎదురు చూశాడు. అదే సమయంలో కాలయవనుడు మూడు కోట్ల మంది మ్లేచ్ఛసైన్యంతో మధురపైకి దండెత్తి వచ్చాడు. దాన్ని అదునుగా ఎంచి జరాసంధుడు పద్దెనిమిదవసారి శ్రీకృష్ణునిపైకి దండెత్తి వచ్చాడు. శ్రీకృష్ణుడు బలరామునితో ‘మనమిప్పుడు మానవులు చొరబడలేని దుర్గమునొకటి నిర్మించి, బంధువులను అందులో ఉంచి పిమ్మట కాలయవనుని సంహరించాలి, అని అన్నాడు.
శ్రీకృష్ణుడు విశ్వకర్మను రప్పించి వాస్తు శాస్త్ర సమ్మతంగా సముద్రములోపల పన్నెండు యోజనాల విస్తీర్ణం గల పట్టణాన్ని నిర్మించమని ఆదేశించాడు. విశ్వకర్మ ఎంతో శోభాయమానంగా ద్వారకను నిర్మించాడు. శ్రీకృష్ణుడు తన యోగ మాయ ద్వారా తన వారినందరినీ శత్రువులెవ్వరికీ తెలియకుండా ఆ ద్వారకానగరానికి చేర్చాడు. భాగవతములోని ఈ కధాంశాన్ని చదివిన వెంటనే నేటి వాస్తు శాస్త్ర కోవిదులు ఎంతో ఉత్సాహంగా లేచి కూర్చొని ఏమండీ చూశారా? మన పవిత్ర గ్రంథాలైన రాయమాయణ భాగవతాదుల్లోనే వాస్తుశాస్త్ర ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణ భగవానుడే వాస్తును గౌరవించాడు, విశ్వకర్మను వాస్తు శాస్త్ర సమ్మతంగా ఒక పట్టణాన్ని నిర్మించమని కోరాడు.
ఈనాడు కుహనా మేధావులు కొందరు పనిగట్టుకుని వాస్తును, జ్యోతిష్యాన్ని అవహేళన చేసి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు అని అంటారు ఇక్కడ మనమందరం ఒకింత ఓపికగా ఆలోచన చేయాలి. నిజమే రామాయణంలోనూ, భాగవతంలోనూ వాస్తు ప్రస్తావన ఉన్నమాట నిజమే. ఖచ్చితంగా వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించిన లంక సర్వనాశనమై పోయింది. సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడు విశ్వకర్మచే వాస్తుశాస్త్ర సమ్మతంగా నిర్మింపచేసిన ద్వారక ఆయన జీవితకాలం ముగిసిన వెంటనే సముద్రంలో మునిగిపోయింది. అంటే ఒక యాభై లేక అరవై సంవత్సరాలకంటే ఎక్కువ కాలం ఆ ద్వారక నివాసయోగ్యంగా లేదన్నమాట. ఇక ద్వారకా వాసులైన యాదవులు ఏమయ్యారో తెలుసా? యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం లేక మహర్షులను పరీక్షింపదలచి శపింపబడిన వారై ఒకరినొకరు కొట్టుకుని చచ్చారు.
ఇక శ్రీమద్రామాయణ విషయానికొస్తే ప్రతి ఒక్కటి వాస్తుశాస్త్ర సమ్మతంగా నిర్మింపబడిన లంక రావణాసురుని దుష్టబుద్ధి వల్ల సర్వనాశనమైంది, ఆయన అనుచరులంతా మరణించారు. అదే లంకలోని సద్గుణ సంపన్నుడైన విభీషణుడు, ఆయన అనుచరులు బతికి బట్ట కట్టగలిగారు. కాబట్టి రామాయణ, భారత భాగవతాదులు మనకు నేర్పుతున్న పాఠం ఏది? గృహవాస్తు, పట్టణ వాస్తు, దేశవాస్తు కాదు ముఖ్యం, మన దేహవాస్తు ముఖ్యం. మన ఇంట్లో ఏ దిక్కులో ఏమి ఉండాలో అన్నది అంత ముఖ్యం కాదు. మన దేహంలో ఏ భాగంలో ఏమి ఉండాలో ఎలా గుండాలో అది ముఖ్యం. కళ్లల్లో చూపు ఉండాలి.
అంధత్వం కాదు. అది ఉంటే గుంతలో పడి చస్తాం. చెవుల్లో వినికిడి శక్తి ఉండి తీరాలి. అది లేకపోతే మన వెనుక వస్తున్న మోటారుకారు ఇచ్చే హారన్ వినక దాని కింద పడి మరణిస్తాం. అలాగే మన దేహంలో బలం లేకపోతే రోగాలపాలై కన్నుమూస్తాం. ఇవన్నీ మనకు అనుభవపూర్వకంగా తెలుసు. కాని మన తలలో వివేకము, హృదయంలో ప్రేమ లేకపోతే మనం బ్రతికి ఉన్న శవాలేనని తెలియదు. ఇనుప కండరాలు, ఉక్కునరాలు, వజ్రసంకల్పం, ఆత్మవిశ్వాసం ప్రేమ ఉండాలంటాడు వివేకాందస్వామి. అట్టి వాస్తు మాత్రమే రక్షిస్తుంది.
EmoticonEmoticon