సాఫ్ట్‌టాయిస్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ దాకా...!




ఎప్పుడూ ఒకేదారిలో వెళితే ఏం బాగుంటుంది.... ప్రపంచ పోకడలను బట్టి పంథా మార్చుకుంటే విజయాలను గుప్పిట ఒడిసిపట్టేయొచ్చు. అలా మారడమూ....సరికొత్త సవాళ్లను ఎదుర్కోవడమూ తన దృష్టిలో ఓ కళే....అంటారు విజయవాడకు చెందిన సుధారాణి. పద్దెనిమిదేళ్ల వయసులో పరిశ్రమను స్థాపించి విజయం సాధించినా అక్కడితో సంతృప్తి చెందలేదు. సాఫ్ట్‌వేర్‌ చదువులు చదవకపోయినా... ఆ రంగంలో అనుభవం లేకపోయినా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేటి యువత ఆసక్తులను అందిపుచ్చుకున్నారు. కొత్తతరహా సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులూ, గేమ్‌లూ, యాప్‌లను రూపొందిస్తున్నారు. మరోవైపు కళలనూ ప్రోత్సహిస్తున్నారు. స్వశక్తితో ఎదిగి... పలు రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బోడేపూడి సుధారాణి ప్రస్థానమిది


మాది విజయవాడ. నాన్న బ్యాంకు ఉద్యోగి. కష్టం అంటే తెలియకుండా పెంచారు. నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు...నా స్నేహితురాలి ఇంటికి వెళ్లా. వాళ్ల మావయ్యకు నన్ను పరిచయం చేసింది. అతనేమో ‘మీ నాన్న పెద్ద ఉద్యోగి కదా! నాకేమన్నా ఆర్థిక సాయం ఇప్పించగలవా’ అని అడిగారు. అదే విషయం నాన్నకి చెప్పా. నాన్న అతనికి రెండు లక్షల రూపాయలను తన సొంత డబ్బు నుంచి తీసి ఇచ్చారు. ఆ సమయంలో నేను చూపిన చొరవకు అంకుల్‌( నా ఫ్రెండ్‌ వాళ్ల మావయ్య) నన్ను మెచ్చుకున్నారు. అప్పుడు నేను ఇంటర్‌ చదువుతున్నా. ఇంటరయ్యాక ఒకసారి అంకుల్‌ మా ఇంటికొచ్చి ‘మీరిచ్చిన రెండు లక్షరూపాయలతో మీ అమ్మాయికి ఓ యంత్రాన్ని కొనిస్తా. తనలో నిర్వహణా నైపుణ్యాలున్నాయి. ప్రోత్సహించండి’ అని చెప్పారు. అది నాన్నకు నచ్చలేదు. అయినా నా పట్టుదల చూసి ఒప్పుకున్నారు. అలా అంకుల్‌ ఆలోచనతో చెత్త నుంచి ప్లాస్టిక్‌ పైపుల తయారీకి అవసరమైన గ్రాన్యువల్స్‌ చేసే యంత్రాన్ని తీసుకుందామని నిర్ణయించుకున్నా.

బెదిరించేవారు

అప్పట్లో నేను ఉదయంపూట డిగ్రీ కాలేజీకి వెళుతూనే ఈ పనులు చూసుకునేదాన్ని. ఓసారి యంత్రం పని మీద చెన్నై వెళ్లా. అక్కడ ఒకావిడ సాఫ్ట్‌టాయ్స్‌ తయారు చేస్తుండటం చూసి వారం పాటూ నేనూ అక్కడుండి నేర్చుకున్నా. విజయవాడ వచ్చాక సాఫ్ట్‌టాయ్స్‌ తయారీ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి లక్షన్నర రూపాయల ఆదాయం పొందా. ఆ డబ్బులతో ఓ గ్యారేజీ అద్దెకు తీసుకుని 2000లో ఆటోనగర్‌లో పైపుల తయారీకి అవసరమయ్యే ముడిసరకు పరిశ్రమను మొదలుపెట్టా. పదిహేను మంది కార్మికులతో రాత్రింబవళ్లూ కష్టపడేదాన్ని. అంకుల్‌ కొన్ని ప్రముఖ పైపుల పరిశ్రమలకు మా సరకు అందించేలా మాట సాయం చేశారు. అయితే నన్ను పోటీగా భావించిన కొన్ని సంస్థల వారు పరిశ్రమను మూసేయమంటూ బెదిరించేవారు. అయినా పట్టించుకునేదాన్ని కాదు. మొదటి ఏడాదిలోనే పదిలక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ ఉత్సాహంతోనే సొంతంగా నేనే పైపుల పరిశ్రమ పెడితే బాగుంటుందని అనిపించింది. అలా 2006లో వైజాగ్‌లో పదిలక్షల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించా. యాభై మంది కార్మికులను తీసుకున్నా. అదే సంవత్సరం నాకు మా మేనమామతో పెళ్లైంది. తను న్యాయవాది. నా మీద నమ్మకంతో ఏం చేసినా ప్రోత్సహిస్తారు. విజయవాడలో గ్రాన్యువల్స్‌ తయారు చేసి ముడిసరకును వైజాగ్‌ పంపుతుండేదాన్ని. ఈ పరిశ్రమా తక్కువ సమయంలో లాభాలబాట పట్టింది. ఏడేళ్లలో ఎనభై లక్షల రూపాయల టర్నోవర్‌ అందించే స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో సాఫ్ట్‌వేర్‌ ప్రాధాన్యం పెరగడంతో ఆ దిశగా ఏదైనా చేద్దామా! మారుతున్న పరిస్థితికి అనుగుణంగా వ్యాపార¹పరంగా కూడా నాకు తగిన అవకాశాన్ని వెతుక్కుందామా! అని ఆలోచించా. సాఫ్ట్‌వేర్‌ రంగం గురించీ అధ్యయనం చేశా. బోలెడు పుస్తకాలు చదివా. ఎన్నో తర్జనభర్జనల అనంతరం 2012లో విజయవాడలోనే ‘ట్రిక్సన్‌ టెక్‌ సొల్యూషన్స్‌’ పేరుతో ఓ సంస్థను స్థాపించా. మా సంస్థ ద్వారా సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు తయారు చేయడం మొదలుపెట్టా.

23 దేశాలకు సేవలు

మేం బీ2బీ వ్యాపారం చేస్తాం. అంటే విదేశీ సంస్థలకు అవుట్‌సోర్సింగ్‌ చేసి పెడతాం. న్యూయార్క్‌, చైనా, జపాన్‌, సింగపూర్‌, కొరియా.. వంటి 23 దేశాలకు మా సేవలందిస్తున్నాం. మొబైల్‌ గేమ్‌లూ, యాప్‌లూ తయారు చేస్తున్నాం. ఇప్పుడు అగ్‌మెంట్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ వంటి సాఫ్ట్‌వేర్‌లకు మంచి ఆదరణ ఉంది. అగ్‌మెంట్‌ రియాలిటీ అంటే.. ఉదాహరణకి ఒక పుస్తకం మీద బొమ్మ ఉందనుకోండి. మా సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్‌ చేసిన మొబైల్‌ లేదా ట్యాబ్‌లెట్‌ను దాని మీద ఉంచితే అది వీడియో రూపంలో కనిపిస్తుంది. కదలినట్లు, మాట్లాడినట్టు ఉంటుంది. ఇక... వర్చువల్‌ రియాలిటీ రియల్‌ ఎస్టేట్‌ రంగం వాళ్లకి పనికొస్తుంది. వాళ్లు ఏదైనా కట్టేటప్పుడు ప్లాన్‌ ఇస్తారు. దాని ప్రకారం... మేం త్రీడీలో ఆ భవనాన్ని డిజైన్‌ చేస్తాం. ఎవరైనా ఇల్లు కొనుక్కున్న తరవాత.. ఆ ఇంట్లో సోఫాలో కూర్చుంటే ఎలా ఉంటుందీ, వాళ్ల వంటగదిలో నిల్చుంటే ఎలా ఉంటుందో వీడియో చేసి చూపిస్తాం. మా శాఖలు ముంబయి, దిల్లీ, బెంగళూర్‌లోనూ ఉన్నాయి.

కష్టం నీళ్లపాలు

ఇంతలో 2014లో వచ్చిన హుద్‌హుద్‌లో నా పైపుల పరిశ్రమ నేలమట్టమైంది. యాభై లక్షలరూపాయల సరకు గాలికి కొట్టుకుపోయింది. ఆ సంవత్సరం బీమా చేయలేదు. చేసేదేంలేక ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి.. పాతిక లక్షల రూపాయల రుణం తెచ్చా. యాభైమందికి మూడు నెలల జీతం ఇచ్చి మరో ఉపాధి చూసుకోమని పంపేశా. ఆ సమయంలో విపరీతంగా కుంగిపోయా. మావారు ఎంతో ధైర్యం చెప్పి.. సాఫ్ట్‌వేర్‌ సంస్థ మీద దృష్టి పెట్టేలా ప్రోత్సహించారు. ఈ మూడేళ్లలో మూడొందల డెబ్భై ప్రాజెక్టులు పూర్తి చేశాం.

సేవా కార్యక్రమాలు

ఏటా ఓ పది మంది పిల్లల్ని చదివిస్తున్నా. కేవలం పాఠశాలకు వెళ్లే వాళ్లనే కాదు. కాలేజీ చదువులు చదవడానికీ, సివిల్స్‌, బ్యాంకు పరీక్షలకు శిక్షణ కూడా ఇప్పిస్తున్నా. పదిమంది మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఒకబ్బాయి విదేశాల్లో స్థిరపడ్డాడు. కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఆర్థికంగా సాయం చేస్తున్నా. అలానే ఓ అకాడమీ స్థాపించి దాని ద్వారా చిన్నారుల్ని కళల దిశగా ప్రోత్సహిస్తుంటా. ఏటా నవంబరులో బాలల మేళా నిర్వహిస్తా. అందుకయ్యే ఖర్చంతా నేనే భరిస్తా. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి చిన్నారులు వస్తారు. గతేడాది ‘ఫోక్‌ సునామీ’ అని ఓ కార్యక్రమం చేశా. దానికి లిమ్కాబుక్‌ రికార్డుతో పాటూ మరో ఏడుకూడా సొంతమయ్యాయి. ఇంద్రజాలం ఆసక్తితో నేర్చుకున్నా. వృద్ధాశ్రమాలూ, అనాథాశ్రమాల్లో ని వారికి ఉచితంగా ఇంద్రజాల వినోదాన్ని అందిస్తుంటా. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఆరేళ్ల మా చిన్నబ్బాయి ధనుష్‌ క్విక్‌ డ్రెస్‌ చేంజ్‌ కార్యక్రమంలో పలు రికార్డులు సాధించాడు.
Previous
Next Post »