ఇస్తేనే ధనత్య!






“లక్ష్యంపై ఉండే శ్రద్ధ సాధనపైనా ఉండాలన్నదే నా జీవితంలో నేర్చుకున్న గొప్పపాఠం. ఆ ఒకే సిద్ధాంతం నుంచి నేను అనేక పాఠాలను ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉన్నాను. కార్యసిద్ధికి అదే కీలకం. గమ్యంపై మనకు ఎంత శ్రద్ధ ఉంటుందో, దాని గమనంపై కూడా అంతే శ్రద్ధ ఉండాలి. ఇతరుల పట్ల మన కర్తవ్యం... వాళ్ళకు ఉపకారం చేయడమే! అంటే... ప్రపంచానికి సహాయపడడం అన్నమాట.




అసలు మనం ప్రపంచానికి ఎందుకు సహాయపడాలి? ప్రపంచానికి సహాయపడడమంటే మనకు మనం సహాయం చేసుకోవడమే! ఎత్తయిన పీఠం మీద నిలబడి, చేతిలో అయిదు పైసలు పుచ్చుకొని, “...బిచ్చగాడా! ఇదుగో...” అంటూ దర్పంగా అనవద్దు. బిచ్చగాడు అక్కడ నిలబడినందుకు అతడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండు. అతడికి దానం చేయడంతో నీకు నువ్వే ఉపకారం చేసుకుంటున్నావు. ధన్యుడయ్యేది ఇచ్చేవాడే కానీ, పుచ్చుకున్నవాడు కాదు. ఆ బిచ్చగాడి కారణంగానే నీలో కనికరం పుట్టింది. ఆ విధంగా నువ్వు వినమ్రుడివి, పవిత్రుడివి, పరిపూర్ణుడివి అవుతున్నావు.

ఇలాంటి అవకాశం నీకు కలిగినందుకు ఆ బిచ్చగాడికి కృతజ్ఞుడివై ఉండు! ఇతరులకు అపకారం తలపెట్టినప్పుడు అది వారికే కాదు, మనకూ హాని కలిగిస్తుంది. మంచి చెయ్యడం వల్ల మనకూ, ఇతరులకూ మేలు చేకూరుతుంది. కర్మయోగం ప్రకారం జరిగిన పని, దాని ఫలితాన్ని అది ఇచ్చే తీరుతుంది. దాన్ని నశింపజేయలేం. ప్రకృతిలో ఏ శక్తీ కర్మఫలితాన్ని ఆపలేదు. నేనొక చెడ్డపని చేస్తే, దానివల్ల నేను బాధను అనుభవించక తప్పదు. ఈ లోకంలో ఏ శక్తీ దానిని అడ్డగించలేదు. అదే విధంగా నేనొక మంచి పని చేస్తే, దాని సత్ఫలితాలు నాకు అందకుండా ఏ శక్తీ అడ్డుకోలేదు.


స్వామి వివేకానంద

Previous
Next Post »