గౌరవిస్తే గొడవలుండవు..!




ఇద్దరూ ఇష్టపడ్డారు... అబ్బాయి తల్లితండ్రులకు ఇష్టం లేకపోయినా కొడుకు కోసం పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. అమ్మాయి బాగా చదువుకుంది. అందంగా వుంది. మంచి కుటుంబ నేపధ్యం. కొడుకు ఇష్టాన్ని కాదనడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవు. పెళ్లి జరిగింది. అమ్మాయి అత్తగారింట్లో అడుగు పెట్టిన తరువాత గాని అసలు సమస్య మొదలు కాలేదు కొన్నాళ్ళు బాగానే గడిచింది. అత్తా కోడళ్ల సర్దుబాటు ధోరణి చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ సాఫీగానే సాగుతూ వచ్చింది. 



పిల్లలకు పెళ్లి చేసిన తరువాత తల్లితండ్రులు ఎదురుచూసే ముచ్చట వారి సంతానం. పిల్లలు కలగడం కాస్త ఆలస్యమయితే చాలు ఏదో అపచారం జరిగిపోయినట్టుగా భావిస్తారు కొందరు తల్లితండ్రులు. దీనికి తోడు ఇరుగుపొరుగు, బంధువులు ప్రశ్నలతో, సందేహాలతో ఇబ్బంది పెడుతూ వుంటారు. మూడేళ్ళ వరకు ఆ జంట ఒకరినొకరు అర్థం చేసుకోవడానికే సరిపోతుంది.



అప్పుడు గాని పిల్లల కోసం ఆలోచించరు. ఇది తెలిసినా తల్లితండ్రులు కొడుకు కోడలి గురించి ఆలోచించకపోగా బయటివాళ్ల ఆసక్తిని ఆసరా చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తూ వుంటారు... ఈ సమస్య ప్రతి ఆడపిల్లా ఎదుర్కోక తప్పదు. పెళ్లయిన ఏడాది రెండేళ్లలో వెంటనే పిల్లల కోసం ప్లాన్ చేయాలనీ ఆలస్యం చేయొద్దని పెద్దలు బంధువులు చెప్తూఉంటారు. వాళ్ళు భావించినట్టుగా ఆ జంటకు సంతానం కలిగితే వాళ్లకు లభించే గౌరవం అంతాఇంతా కాదు.


మానసిక ఆందోళన... 

సున్నిత మనస్కులు వీరి ఈ ప్రవర్తనకు చలించి పోవడమే కాదు మానసిక కుంగుబాటుకు గురి అయ్యే అవకాశాలే ఎక్కువ. సంతానం ఆలస్యం కావడానికి మానసిక పరిస్థితి కూడా ముఖ్య కారణమని అంటున్నారు మానసిక విశ్లేషకులు. పిల్లలు ఆలస్యం కావడానికి కారణాలు వెతికే ప్రయత్నంలో ప్రశ్నలు అడిగేతీరు ఒక్కోసారి కించపరిచేలా ఉండడం వల్ల తట్టుకోలేని మహిళలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తరచుగా చోటుచేసుకునే అంశం.

వాస్తవానికి గర్భధారణ, వారి వారి వ్యగ్తిగత విషయం. పిల్లలు కావాలని ఎవరు మాత్రం కోరుకోరు... భవిష్యత్ ప్రణాళికలో ఇద్దరు ముగ్గురయ్యే అంశం ప్రధానమైన మలుపు. అన్నీ సమకూర్చుకొని ఆ తరువాత పిల్లలను కనొచ్చని అనుకుంటారు కొందరు. అంత మాత్రాన అసలు పిల్లలు కలగరనో, లేదా పిల్లలంటే ఆసక్తి లేదనో అనుకోవడానికి వీల్లేదు. పిల్లలకు మంచి జీవితాన్ని అందించాలంటే ఆర్ధికంగా వెతుక్కోకుండా ఉండాలన్నది కొందరి ఆలోచన. ఇది పెద్దవాళ్ళు గ్రహిస్తే సమస్యలే వుండవు. 


డాక్టర్ సలహా... 

పెళ్లయిన వెంటనే కొత్త జంటలు గైనకాలజిస్ట్ ను సంప్రదిస్తారు. పిల్లలను కనే ఆలోచన ఇప్పుడప్పుడే లేదని, కొంత కాలం ఆగాలని అనుకుంటున్నామని,ఏమైనా మార్గాలు సూచించమని సలహా అడుగుతారు. డాక్టర్లు కూడా మూడేళ్ళ కంటే ఎక్కువ సమయం తీసుకోవద్దని చెబుతారు. ఆలస్యం చేస్తే అండం విడుదల కావడానికి సమస్యలు ఎదురయ్యే అవకాశాలే ఎక్కువ అని అంటున్నారు స్త్రీల వైద్య నిపుణులు.

వైద్యులు స్పష్టంగా చెప్పిన తరువాత కూడా ఎవరూ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా వుండరు. యిది అర్థం చేసుకొని పెద్దలు కొంత ఓపిక పట్టాల్సింది పోయి ఇరుగు పొరుగు మాటలను ఆసరాగా చేసుకొని పెళ్లయ్యింది మొదలు కొడుకు కోడలి వెంట పడుతూ వాళ్ళను యిబ్బంది పెడుతూ వుంటారు. 



కొత్తగా పెళ్లయిన జంటలు కొంత కాలం ముచ్చట్లు మురిపాలు తీర్చుకొని అప్పుడు గాని పిల్లల గురించి ఆలోచించరు.యిది పెద్దలు అర్థం చేసుకోవాలి. 


అంతలా భయపెట్టొద్దు.. 

అమ్మాయి అమ్మానాన్నలు కూడా కూతురి పెళ్లయిన కొద్ది రోజులకే ఆ బాధ్యత కూడా తీర్చుకుంటే వాళ్ళ పని అయిపోతుందన్నట్టుగా కూతురి వెంట పడుతూ వుంటారు. ఆలస్యం చేస్తే అసలు పిల్లలు పుట్టరన్నట్టుగా కూతుర్ని భయపెడుతూ వుంటారు. మనవడినో మనవరాలినో ఇంకెప్పుడు ఇస్తావని, ఇంకెన్నాళ్లు.. రానురాను వయసు పెరిగేదే కానీ తగ్గదు, సమస్యలు కూడా పెరిగిపోతాయని నిరుత్సాహ పెడుతూ వుంటారు. చివరికి అమ్మానాన్నలు కూడా అర్థం చేసుకోకుండా బాధ పెడుతున్నారని నీరుగారి పోతారు కూతుళ్లు. 


వారి ఆలోచనలను గుర్తించాలి 


పెళ్లయిన వెంటనే పిల్లల కోసం కొడుకు గాని కూతురిని గాని హడావుడి పెట్టొద్దు. వాళ్ళకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి... ఫ్యామిలీ ప్లానింగ్ ఆలోచనలు ఉంటాయి. వారి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. మాటలతో కించపరచకుండా వారి సముచిత నిర్ణయాలను ప్రోత్సహించాలి. వయసులో చిన్న వాళ్ళయినా తీసుకున్న నిర్ణయం సరి అయినదని అనిపించినప్పుడు గౌరవించాలి కూడా. 


నష్టం కలగొచ్చు..


పెళ్లయిన తరువాత ఏ జంటకయినా జీవితం కొత్తకొత్తగా ఉంటుంది. వారి శ్రేయోభిలాషుల్లా కష్ట సుఖాలు అడిగి తెలుసుకోవాలి. గందరగోళంగా దంపతులు కంగారు పడుతుంటే వాళ్లకు సరియైన మార్గం చూపించాలి. పెద్దరికం పెద్ద మనసు వాళ్ళకో భరోసాను అందివ్వాలి. అనుభవజ్ఞులం మా మాటే చెల్లు అన్నట్టుగా ప్రవర్తిస్తే కన్న బిడ్డలు నలిగిపోతారు.

ఒత్తిడికి లోనవుతారు. ఆ ప్రభావం గర్భధారణ సమస్యలకు దారి తీస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలే ఎక్కువ. అందుకని పెద్దలు పిల్లల మనసెరిగి ప్రవర్తిస్తే సమస్యలే రావని. పండంటి పాపాయిలతో ఇల్లు కళకళలాడుతూ విలసిల్లుతుందని వేరే చెప్పాల్సిన అవసరం ఉండదు కదా.


అన్నీ శుభవార్తలే ..

పెళ్లి అయిపోగానే కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలని కాదుకదా. పెళ్లితో మధ్యలో ఆగిపోయిన కెరీర్ ప్లాన్స్‌కి ఒక మంచి ముగింపు ఇవ్వాలి. అమ్మాయిలను చదివించేది ఎదుటి వారిపై ఆధార పడకుండా జీవితంలో సొంత వ్యక్తిత్వంతో రాణించాలని. వారి కలలను సాకారం చేసుకొని ఫలాలు అనుభవించడానికి అవకాశం పెద్దలే కల్పించాలి. అది వారి బాధ్యత కూడా. అమ్మమ్మను చేయడమే కాదు మంచి వుద్యోగం మంచి సంపాదన వివాహానంతరం సమకూరితే అవి కూడా కన్నవాళ్ళకి శుభ వార్తలే మరి.
Previous
Next Post »