బోడి రూపాయి

బోడి రూపాయి:-
---------------
(మంచి రూపాయి అయినా, బోడి రూపాయి అయినా
డబ్బు డబ్బే.
హాస్యం పండించిన ఈ కథలో చాలా లోతైన తాత్వికత
ఉందంటే ఎవరు కాదనగలరు?)

------------------------------
------------------------------
---------------------
ఒక ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది.
ముసలమ్మకు ఒక కొడుకు, కోడలు. ముసలిది
మహా పిసినారిది. ఎంత పిసినారంటే, కనీసం కోడలికి
అన్నం కూడా సరిగ్గా పెట్టేదికాదు. కోడలూ తక్కువ
తిన్నది కాదు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ
అన్నట్లుండేది ఆ తల్లి.
అటుచూస్తే తల్లి,
ఇటు చూస్తే పెళ్ళాం- ఏమీ మాట్లాడలేని పరిస్థితి
ముసలమ్మ కొడుకుది.
ముసలమ్మ దగ్గర ఒక పెద్ద ఇనుప పెట్టె ఉండేది.
చాలా కాలం నుండీ తన పిసినారితనం పుణ్యమా అని
కూడబెట్టుకున్న రూపాయి బిళ్ళలను
ముసలమ్మ ఆ ఇనప్పెట్టెలో దాచిపెట్టుకున్నది.
ప్రతిరోజూ సాయంత్రం అవగానే ఆమె పెట్టెను
కిందికి దించేది- రూపాయలను లెక్కబెట్టుకొని,
పెట్టెను మళ్లీ జాగ్రత్తగా పైన పెట్టేసేది.
రోజూ జరిగే ఈ తంతును చూసింది కోడలు.
ఒకరోజున, అత్త ఇంట్లో లేని సమయంలో, పెట్టెను
మెల్లగా కిందికి దించి చూసింది. పెట్టెనిండా
రూపాయిలు! అన్నన్ని రూపాయి బిళ్లలను చూసిన
కోడలు ఒక రూపాయిని కొట్టెయ్యకుండా
ఉండలేకపోయింది.
ఒక రూపాయిని తీసి బొడ్డులో
పెట్టుకుని, పెట్టెను ఉన్నదున్నట్లు తిరిగి పైన
పెట్టేసింది.
అంతలోనే బయటికి వెళ్ళిన ముసలమ్మ ఇంటికి
తిరిగొచ్చింది.
వచ్చీరాగానే తన పెట్టెను కిందికి
దించింది. రూపాయిల్ని లెక్కపెట్టడం
మొదలుపెట్టింది. లెక్కపెట్టడం పూర్తయ్యింది,
కానీ, ఒక రూపాయి తక్కువొచ్చింది. ముసలమ్మ
ఆత్రంగా మరోసారి లెక్కపెట్టింది. లాభం లేదు-
రెండోసారి కూడా రూపాయి తక్కువే. ముసలమ్మ
చాలాసార్లు లెక్కపెట్టింది కానీ, లెక్కించిన ప్రతిసారీ
రూపాయి తక్కువే లెక్క తేలుతోంది.
ముసలమ్మకు గుండె ఆగినంత పనైంది. తన
రూపాయి పోయిందన్నవాస్తవం ఆమెకు
మింగుడు పడలేదు. "నా రూపాయి పోయిందిరో,
నాయనో" అని గట్టిగా అరుస్తూ, ఆమె ఎగిరి ఎగిరి
కిందపడిపోయింది. అది చూసికూడా కోడలు
బయటికిపోయి, అరుగుమీద కూర్చుంది- ఏమీ
ఎరగనట్టు.
కాసేపటికి ముసలమ్మ కొడుకు పొలం నుండి
ఇంటికి వచ్చాడు. ఇంట్లో నిలువునా పడిపోయిన
తల్లిని చూసి కొడుకు "అప్పుడే నీకు నూరేళ్ళు
నిండిపోయాయా అమ్మా!" అని గట్టిగా అరుస్తూ
ఏడవటం మొదలుపెట్టాడు.
కొడుకైతే ఏడ్చాడుగాని,
కోడలు గడప దగ్గరే కూర్చున్నది, నిమ్మకు
నీరెత్తినట్లు. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన కొడుకు
తలుపు దగ్గరకు పోయి, పెళ్ళాంతో అన్నాడు: "కాదే!
మా అమ్మ చచ్చిపోయి, లోపల నేను అంత పెద్దగా
ఏడుస్తుంటే నీకు వినపడతా లేదా" అని. కోడలు
పిల్ల అన్నది: "ఏడిస్తేమాత్రం, పోయినవారు
తిరిగొస్తారా ఏమిటి? ఎందుకీ వృధా ఏడుపులు?"
అని.
కొడుకు అన్నాడు: "అత్త పోయిందన్న బాధ
కొంచెంకూడా లేదని నలుగురూ నాలుగు
రకాలుగా అనుకుంటారు. కనీసం చూసేవాళ్లకోసం
అయినా ఏడవాలికదే! రా, ఏడుద్దువు" అని.
"నలుగురూ ఏమనుకుంటారో అనేకదండీ మీ
బాధ? ఆ నలుగురికోసం, కావాలంటే, వారొచ్చాకనే
ఏడుస్తానులెండి" అన్నది మంకెగా కోడలు పిల్ల.
భార్యను ఏమీ అనలేని ఆ కొడుకు లోపలికి పోయి, తనే
గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. అది విన్న
ఇరుగుపొరుగు వారందరూ అక్కడికి చేరి చోద్యం
చూడసాగారు. అయితే కోడలు మాత్రం
ఏమీపట్టనట్టుగానే ఉన్నది.
అప్పుడు
ముసలమ్మ కొడుకు భార్యతో "నలుగురూ
వచ్చి చూస్తున్నాకూడా నువ్వేమీ పట్టనట్టు
ఇలా ఊరికే ఉండటం ఏమీ బాగాలేదు. కనీసం
ఇప్పుడైనా ఏడుద్దువు, రా" అని పిలిచాడు.
భార్య అన్నది- "మీ బంధువులందర్నీ
రానివ్వండి. అప్పుడు ఏడుస్తానులే" అని.
బంధువులంతా వచ్చారు. అప్పుడు కూడా ఆ
కోడలికి ఏడుపురాలేదు.
ముసలమ్మ కొడుకు తన
భార్యతో మళ్ళీ చెప్పాడు, ఏడవమని.
"కావాలంటే పాడె కట్టాక ఏడుస్తాలెండి" అన్నది
భార్య.
పాడె కట్టారు. ముసలమ్మను పాడెమీద
పడుకోబెట్టారు. కొడుకు మొదలుకొని అందరూ
గట్టిగా ఏడుస్తూ ఉన్నారు. "కనీసం ఇప్పుడైనా
ఏడవదేమి చెప్మా?" అనుకున్నాడు ముసలమ్మ
కొడుకు.
"ఇప్పటికే చచ్చినదానికోసం నన్నెందుకండీ
ఏడవమంటారు? అయినా మీరింతగా
బాధపడుతున్నారు కాబట్టి, కనీసం మీ కోసమైనా, మీ
అమ్మను గోతిలో పెట్టాక తప్పకుండా
ఏడుస్తానులెండి" అన్నది మొహం
తిప్పుకుంటూ, భార్య.
ముసలమ్మను పాడెనెక్కించారు.

స్మశానానికి
తీసుకెళ్లారు. కడసారి చూసుకున్నారు
అందరూ. శవాన్ని గోతిలో పెట్టారు. అప్పుడుకూడా
ఏడవని భార్య వైపుకు ప్రాధేయపూర్వకంగా
చూశాడు భర్త. ఇక తప్పదన్నట్లు ఆమె లేచి, గోతి
దగ్గరకు వెళ్ళింది. అటూ ఇటూ చూసి, ఎవరూ
తనను గమనించటంలేదని నిర్ధారించుకున్నది.
మెల్లగా బొడ్డులో ఉంచుకున్న రూపాయి బిళ్ళను
బైటికి తీసి, వేరే ఎవరికీ వినబడకుండా అన్నది:.
"ఇదిగోనే, ముసలమ్మా! ఎవరికి కావాలే, నీ బోడి
రూపాయి? నీది నీకే ఇచ్చేస్తున్నా తీసుకో!" అంటూ
పడుకోబెట్టిన ముసలమ్మ మీదికి విసిరేసింది దాన్ని,
చికాకుగా.
రూపాయి స్పర్శ తగిలిందో, లేదో- గబుక్కున కళ్ళు
తెరిచింది ముసలమ్మ. "ఆ! దొరికింది! దొరికింది! నా
రూపాయి నాకు దొరికింది"! అంటూ ఒక్క
ఉదుటున పైకి లేచింది చావును జయించిన ఆ
ముసలమ్మ! ఆపైన బంధువులందరూ
రూపాయి మహాత్మ్యాన్ని కథలు కథలుగా
చెప్పుకున్నారు, అనేక సంవత్సరాల వరకూనూ!
Previous
Next Post »