మన ఆహార సంస్కృతి ఎలా అభివృద్ధి చెందింది.?



   మనం నిత్యం ఆకుకూరలు, దుంపలు, మాంసం తింటున్నాం. మరి ఈ ఆహార సంస్కృతి ఎలా అభివృద్ధి చెందింది.? దుంపలు,మొక్కలు,కందలు,పండ్లు మాంసాలను ఎవరు పరిచయం చేశారు.? ఏది తినొచ్చో, ఏది విషపూరితమైనదో ఎవరు గుర్తించారు.? వాళ్లెవరో కాదు మన ఆది గురువులు. కొండాకోనలే జీవితంగా బతికే ఆదివాసీలు. ప్రముఖ సామాజిక విశ్లేషకులు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య...సారె తిప్పు, సాలు దున్ను పుస్తకంలో ఆహార సంస్కృతి అభివృద్ధి క్రమాన్ని అక్షరీకరించారు. అందులో కొన్ని అంశాలను చూద్దాం.

ఆహార పదార్థాలను గుర్తించింది ఆదివాసీలే

ఇప్పుడు మనం తింటున్న చాలా పదార్థాలను గుర్తించిందీ, ఎంపిక చేసిందీ, ప్రామాణీకరించిందీ ఆదివాసీలే. ఈ ఉపఖండమంతా విస్తరించిన వీరు సంప్రదాయంగా మైదాన ప్రాంతాలకు దూరంగా ఉంటూ ఎక్కువగా కొండల మీద, అడవుల్లో, పొడిగా ఉండే పీఠభూమి ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
పుట్టతేనేను మొదటగా పట్టి తెచ్చింది ఆదివాసీలే
ఆదివాసీలు ఎన్నో రకాల పండ్లు తింటారు. వాటిలో కొన్ని బహుశా మన జీవితకాలంలో ఎప్పుడూ తినకపోవచ్చు. పెరుగన్నం, పిజ్జాలు కాదు..అనాస, పనస,దోస,మామిడి, సీతాఫలం, రకరకాల అరటిపండ్లు, ఇంకా ఎన్నో పండ్లను మొదటగా గుర్తించిందీ ఆదివాసీలే. నిమ్మ, నారింజ వంటి పండ్లలోని పుల్లదనాన్ని గుర్తించి, వాటిని రకరకాల పదార్ధాల్లో కలుపుకుని తినటమన్నది గుర్తించీ, తెలుసుకున్నదీ మూలవాసులే. ఎన్నో ఆరోగ్యపరమైన సుగుణాలున్న పుట్టతేనేను మొదటగా పట్టి తెచ్చిందీ వాళ్లే. ఇవాళ మనం పండిస్తున్న చాలా కూరగాయలు,పండ్లు,పూల గురించి మనకు తెలియజెప్పింది కూడా ఆదివాసీలే. అందుకే వాళ్లు మనకు ఆదిగురువులు.

వేల ఏళ్ల క్రితమే ప్రయోగాత్మకంగా పరిశీలించిన ఆదివాసీలు

తినటానికి వీలైన ఎన్నో దుంపలను, గడ్డలను తవ్వి తియ్యటం నేర్చుకున్నారు ఆదివాసీలు. కొన్నింటిని పచ్చిగా తింటే, మరికొన్నింటిని కాల్చుకుని, కొన్నింటిని ఉడికించుకుని తిన్నారు. అన్ని దుంపలూ ఒకే రుచితో ఉండవు. వాటిలో పోషక విలువలూ ఒకే రకంగా ఉండవు. కొన్ని చెట్ల పండ్లు మానవ శరీరానికి కావాల్సిన మంచి పోషకాలను ఇస్తాయి. కానీ వాటి ఆకులు అంత ఉపయోగకరమైనవి కావు. ఇందుకు టమోటాలే ఉదాహరణ. టమోటా పండ్లు మంచివే గాని దాని ఆకులు విషతుల్యమైనవి. అలాగే కొన్ని తినటానికి వీలైన, వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు గల పూలు కూడా ఉన్నాయి. వేల ఏళ్ల క్రితమే ఆదివాసీలు వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించి, మేలు చేస్తున్న పదార్థాలను తమ ఆహారంలో చేర్చుకుంటూ హానికరమైన వాటిని తిరస్కరించారు. అందుకే మన ఆహార సంస్కృతి, ఆహారపు అలవాట్లలో రుచి అన్న దాన్ని నిర్దేశించి, నిర్ధారించిన ప్రముఖమైన పాత్ర, శాస్త్రీయ జ్ఞానం వీరిదే.

ఏ జంతువు మాంసం మనుషులు తినటానికి అనువైనది.?

ఇక మాంసాహారం. ప్రపంచవ్యాప్తంగా కూడా అంతా ఇష్టంగా తినే ఆహారపదార్థం మాంసమే. ఆహారం కోసం జంతువులను వేటాడటమన్నది ఆది మానవుడికి అనివార్యమైంది. ఇప్పటి ఆదివాసీల పూర్వికులే ఏ జంతువు మాంసం మనుషులు తినటానికి అనువైనది, ఏది కాదన్న అవగాహన పెంచారు. ఎన్నింటినో పరిశీలించి చివరికి రుచికరమైన పక్షి,జంతు మాంసాలను ఎంపిక చేయటం ద్వారా వాళ్లే మన మాంసాహార సంస్కృతికి పునాది వేశారు. వాళ్లే దాన్ని అభివృద్ధి చేశారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఇష్టంగా తింటున్న పంది, పక్షి,చేప,పశు మాంసాల్ని మొదటగా కనుగొన్నది, ఆ విజ్ఞానాన్ని ఆవిష్కరించిందీ ఆదివాసీలే. మన మాంసాహార జాబితాలోకి కొత్తకొత్త వాటిని చేర్చే పనిని ఇప్పటికీ నిర్వర్తిస్తున్నది కూడా ఆదివాసీలే.

10 వేల రకాల వృక్ష జాతులను ఉపయోగించే ఆదివాసీలు

ఆదివాసీలు సుమారు 10 వేల రకాల వృక్ష జాతులను ఉపయోగిస్తారు. వీటిలో దాదాపు 8 వేల రకాలను వైద్యపరమైన అవసరాలకు, 325 రకాలను క్రిమీసంహారకాలుగాను, 425 రకాలను జిగురు,లక్క, రంగులకు వినియోగిస్తారు. అలాగే 550 రకాలను పీచు పదార్థాలకు, 3500 రకాలను ఆహారపరమైన అవసరాలకు ఉపయోగిస్తారు.

ఆదివాసీలే.. ఆదిగురువులు..

మన ఆహార సంస్కృతిని అభివృద్ధి పరచటం కోసం శరీరాలను, ప్రాణాలను పణంగా పెట్టటమే కాదు, ఆ విజ్ఞానాన్నంతా వాళ్లు ఇతరులతో పంచుకున్నారు. పాటలు, కథల రూపంలో ఆ జ్ఞానాన్ని మౌఖికంగా ఒక తరం నుంచి మరో తరానికి అందించారు. అందుకే ఆహార సంస్కృతి అభివృద్దిలో ఆదివాసీలు మనకు ఆదిగురువులు. చారిత్రకంగా మనం వాళ్లకు ఎంతో రుణపడి ఉన్నాం.
Previous
Next Post »