కరోనా మహమ్మారి నివారణ కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా మంది ఇంట్లోనే ఏదో విధంగా టైంపాస్ చేస్తున్నారు. టీవీలు చూడటం, ఇంటర్నెట్ వినియోగించడం, ఇంటి పనులు చేసుకోవడం, పుస్తకాలు చదవడం లాంటివి చేస్తున్నారు.
ఇక కొందరైతే సమయం దొరికింది కదా అని అవసరానికి మించి బెడ్‌పై కునుకు తీస్తున్నారు. రోజంతా చేసిన కష్టం అంతా నిద్రలోనే వెళ్లిపోతుంది. మనసు, శరీరం కొత్త శక్తిని సంతరించుకుంటాయి. అలాగని అతిగా నిద్రపోతే మాత్రం కోరి కష్టాలు కొనితెచ్చుకున్నట్టే అంటున్నారు పరిశోధకులు.
-నిద్ర మంచిదే. మంచిది కదా అని బద్దకంగా పది, పన్నెండు గంటల పాటు నిద్రపోతే అసలుకే ఎసరు వస్తుంది. శరీరంలో కొవ్వు పెరిగిపోయి స్థూలకాయం బారిన పడవలసి వస్తుంది.
-అతిగా నిద్ర పోవడం వల్ల తలనొప్పితో మొదలై నాడీ వ్యవస్థ మొత్తం ప్రభావితం అవుతుంది. తగినంత నిద్ర లేకుంటేనే కాదు.. అతిగా నిద్రపోయినా మైగ్రేన్ వస్తుంది.
-డయాబెటిస్ రావడానికి అతి నిద్ర కూడా ఒక కారణమే. ఎక్కువసేపు నిద్ర పోవడం వల్ల రక్తంలోని చక్కెరలు వినియోగం చెందకుండా అలాగే ఉండిపోతాయి.
-అతినిద్ర వల్ల గుండెకు కూడా హాని కలిగే అవకాశం ఉంది. 9 నుంచి 11 గంటలు నిద్రపోయే వారికి 28 శాతం వరకు గుండెజబ్బుల రిస్కు ఉంటుందని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది.
-ఒళ్లునొప్పులు ఉన్నప్పుడు ఎక్కువసేపు నిద్రపోతే నొప్పులు తగ్గుతాయనుకుంటాం. కాని అతినిద్ర వల్ల నడుమునొప్పి ఎక్కువై ఇబ్బందిపడాల్సి రావొచ్చు.
-ఎక్కువసేపు నిద్రపోతే మెదడు చురుకుదనం తగ్గుతుంది. మతిమరుపు త్వరగా వచ్చేస్తుంది.
-నిద్రలో కంఫర్టబుల్ పొజిషన్ లో పడుకోకపోతే కండరాలు ఒత్తిడికి లోనై వెన్నునొప్పి జీవితాంతం వేధించేందుకు ఆస్కారం ఉంది.
-అధిక నిద్ర శరీరంలోని శక్తిని తగ్గించేసి బద్దకస్తులుగా మారుస్తుంది. అందుకే నిద్రపోయేముందు టైమ్ పెట్టుకుని రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉండొచ్చు.
EmoticonEmoticon