దోశలు 111 టర్నోవర్‌ 2కోట్లు




మనకు నచ్చింది చేయడానికి పరిధులు గీసుకోకూడదు. ఇష్టంతో చేయాలి, కష్టాలను దాటాలి... అప్పుడే సత్ఫలితాలు అందుతాయి. ఏడాదిన్నర క్రితం ఫుడ్‌ ట్రక్‌ని ప్రారంభించిన మేం ఇదే సూత్రాన్ని నమ్మాం. ఏడాదిన్నరలో రెండు కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నామంటే! చాలా శ్రమపడాల్సి వచ్చింది. నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. సీబీఐటీలో ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. తరవాత కొన్నిరోజులు అమెరికాలో చదువుకుని అక్కడే ఓ సంస్థలో బిజినెస్‌ ఎనలిస్ట్‌గా ఏడాదిన్నర పాటు పనిచేశా. ఎన్ని రోజులని అక్కడుంటాం? మనదేశంలోనే బోలెడన్ని అవకాశాలు ఉన్నాయనిపించింది. ఇండియాకొచ్చేస్తే అమ్మానాన్నలతో కలిసి ఉండొచ్చనీ అనుకున్నా. అందుకే ఇంకేం ఆలోచించకుండా హైదరాబాద్‌కి వచ్చేశా. వచ్చీ రాగానే ఏటీజీ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగంలో చేరిపోయా. నాలుగున్నర ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశా. ఆ సమయంలోనే నాకు అజయ్‌తో పరిచయం. అది ప్రేమగా మారడం, పెళ్లి చేసుకోవడం ఒకదాని తరవాత మరొకటి వెంట వెంటనే జరిగిపోయాయి.

అలా వచ్చింది ఆలోచన... 



నాకు వంట అద్భుతంగా వచ్చని చెప్పలేను! కానీ రుచులు బాగా చెప్పగలను. మా వారూ అంతే. ఇద్దరం సోషల్‌ మీడియాలోని వివిధ ఆహారప్రియుల బృందాల్లో సభ్యులం కూడా. రెస్టారంట్‌లకి వెళ్లడమే కాదు... చిన్న చిన్న బండ్లమీద అమ్మే స్నాక్స్‌, టిఫిన్‌లనీ వదిలిపెట్టేవాళ్లం కాదు. ఎక్కడ రుచి బాగుంటుందంటే అక్కడికి వెళ్లిపోయేవాళ్లం. ఎక్కడికెళ్లినా శుచీ, శుభ్రతా తక్కువగా ఉండటం మా కంటపడేది. దాంతో కొన్నిసార్లు నోరు కట్టేసుకుని తిరిగొచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఓ రోజు అలా తిరిగొస్తున్నప్పుడు విదేశాల్లో ఉన్నట్టే మనకీ చక్కని ఫుడ్‌ట్రక్స్‌ ఉంటే ఎంత బాగుండును అనిపించింది. అదే అజయ్‌కి చెబుతూ, మనమే ఓ ఫుడ్‌ ట్రక్‌ ప్రారంభిస్తే నలుగురికీ పెట్టొచ్చు, మనమూ తినొచ్చు కదా అన్నా. ‘గుడ్‌ ఐడియా, ఆదాయం కూడా వస్తుంది, కానివ్వు’ అన్నారు. నిజానికి కార్పొరేట్‌ స్టైల్‌లో ఉండే పిజా ట్రక్స్‌ వంటివి విదేశాల్లో ఆదరణ పొందాయి. మన దగ్గర ముంబయి, దిల్లీల్లో అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. వందకు పైగా సాఫ్ట్‌వేర్‌ సంస్థలున్న హైదరాబాద్‌లోనూ ఈ ఆలోచన విజయవంతం అవుతుందనుకున్నాం. ఆలోచన బాగానే ఉంది, కానీ ఇద్దరం ఎవరి ఉద్యోగాల్లో వాళ్లం స్థిరపడ్డాం. స్థిరమైన ఆదాయం, చక్కని హోదా ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో లేనిపోని ఇబ్బందులు వచ్చి పడతాయా... కొన్ని రోజులు మథనపడ్డాం. మంచీ చెడూ బేరీజు వేసుకుని చివరకు ఫుడ్‌ట్రక్‌ ప్రారంభించేందుకు ఓటేశాం.

రెండు నెలలు పట్టింది... 


ఇద్దరం ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక, కాస్త ఖాళీ దొరికితే చాలు... వ్యాపార ప్రణాళిక గురించి మాట్లాడుకునే వాళ్లం. చెరో ల్యాప్‌టాప్‌ ముందేసుకుని గంటలు గంటలు ఆన్‌లైన్‌లో ఉండేవాళ్లం. ఏ రకమైన ఆహారాన్ని అందించాలీ, ట్రక్‌ ఎలా ఉండాలీ, వందశాతం పరిశుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలీ... అని ప్రశ్నించుకునే వాళ్లం. పిజాలు అమ్ముదామా, పోనీ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, ఈ రెండూ కాదంటే మినీ మీల్స్‌, అదీ కష్టం అనుకుంటే రకరకాల బిర్యానీలు... ఇలా ఎంతో ఆలోచించాం. చివరకు రుచిగా, తాజాగా ఉండే దోశల్ని ఎంచుకున్నాం. ఇళ్లల్లో చేసే ఓ పది రకాల దోశలు అన్ని హోటళ్లలో ఉంటాయి. వీటితో పాటూ సరికొత్త రకాలను వివిధ రుచుల్లో అందించినప్పుడే ఈ ప్రయత్నం ఫలిస్తుందనుకున్నాం. అందుకే వివిధ ప్రాంతాల్లోని పెద్దవాళ్లనూ, వివిధ హోటళ్ల చెఫ్‌లనూ కలిసి మాట్లాడాం. నూట పదకొండు రకాల దోశలతో మెనూని సిద్ధం చేశాం. వాటిల్లో చాక్లెట్‌ దోశ, ప్రకృతి దోశ, దిల్‌ఖుశ్‌ దోశ, చీజ్‌ దోశ... వంటివెన్నో ఉన్నాయి. వీటన్నింటినీ సకాలంలో అందించడానికి వీలుగా ఓ ట్రక్‌ కావాలిగా! అప్పటికి మన దగ్గర ఎవరూ అలాంటి ‘ట్రక్‌’ దాన్ని చేయిండానికి పడరాని పాట్లు పడ్డామంటే నమ్మండి! ఉద్యోగం చేసి దాచుకున్న మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాం. ట్రక్‌కి సంబంధించి ఓ వూహాచిత్రాన్ని తయారు చేసుకున్నాం. అలా చేసివ్వమని అడుగుతూ చాలా సంస్థల్నీ, ఫ్యాబ్రికేటర్‌లనీ సంప్రదించాం. కొందరు ‘అలా మీకోసం ఒక్కటీ చేసివ్వలేం’ అన్నారు. ఇంకొందరు మా అంచనాకి మించిన ఖర్చు చెప్పారు. చివరికి ఓ ఫ్యాబ్రికేటర్‌ ఒప్పుకున్నాడు. నెమ్మదిగా పని మొదలైంది. దోశ పాన్‌లూ, వాష్‌బేసిన్‌, మంచినీళ్ల డ్రమ్ములూ, గ్రైండర్‌... ఇలా అన్నీ దాన్లో ఇమిడిపోవాలి. చూసేందుకు లుక్‌ అదిరిపోవాలి. ఇదీ మా వూహ. రెండు నెలల తరవాత ట్రక్‌ సిద్ధమైంది. పదిహేను లక్షలు ఖర్చయ్యాయి. ‘దోశప్లేస్‌’ పేరుతో గత ఏడాది మే నుంచి దోశలు అమ్మడం ప్రారంభించాం. వీటి తయారీలో మేం ఎటువంటి రంగులు వాడం. ఆలివ్‌ నూనె, మినర్‌ వాటర్‌ వాడతాం.


అచ్చం మాలాంటివే... 


మేం దోశ ట్రక్‌ తయారీ మొదలు పెట్టినప్పటి నుంచే వెరైటీ దోశల గురించి ఫేస్‌బుక్‌లో ప్రచారం ప్రారంభించాం. మొదటి ట్రక్‌ని హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అధికంగా ఉండే అయ్యప్ప సొసైటీ వద్ద ఉంచాం. మొదటి రోజే మూడొందల ప్లేట్ల దోశలు అమ్ముడుపోయాయి. రెండు వారాలు తిరిగేసరికి చెప్పలేనంత రద్దీ. దీన్ని తట్టుకునేలా పక్కనే ఓ ఇడ్లీ ట్రక్‌ ఏర్పాటుచేశాం. శని, ఆది వారాల్లో నాలుగు వేల దాకా దోశలు అమ్మేవాళ్లం. అంతా బాగుంది అనుకునే లోపే అనుకోని దెబ్బ. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ‘మీ ఫుడ్‌ ట్రక్‌ కాన్సెప్ట్‌ బాగుంది. నాకు సాయం చేస్తే పిజా ట్రక్‌ పెడతా’ అన్నారు. కాదనలేక వివరాలు చెప్పాం. నెల తిరిగేసరికి ఆ వాహనం బయటికొచ్చింది. అది పిజా ట్రక్‌ కాదు... ఇంచుమించు మాలాంటి దోశ ట్రక్‌. చాలా బాధనిపించింది. ఆ తరవాత ఓ ఇరవై మంది అలాంటి బళ్లు చేయించుకున్నారు. ఏం చేయగలం.. అంతమందికి స్పూర్తిగా నిలిచాం అనుకున్నాం. రుచీ, శుచీ, మర్యాదతో వడ్డించడం... వీటితోనే ముందుకు సాగాలనుకున్నాం.


ఆ రోజు మరిచిపోలేను...


ఇంకో రెండు నెలలు గడిచాయి. మాకు వచ్చిన ఆదాయం, కొంత అప్పూ చేసి ఇంకో రెండు దోశ ట్రక్‌లూ, ఓ ఇడ్లీ ట్రక్‌ ఏర్పాటుచేశాం. ‘దేశంలో మొట్టమొదటి మల్టీ ట్రక్‌ సంస్థ’ గా ఆన్‌లైన్‌ సర్వే మాకు గుర్తింపునిచ్చింది కూడా. అన్నట్లు చెప్పనే లేదు కదూ... సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మా ట్రక్‌ల పేర్లేమిటో తెలుసా... వి1, వి2, వి3, ఐటీ. వి అంటే వెర్షన్‌! ఐటీ అంటే, ఇడ్లీ అండ్‌ టీ. మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, నెక్లెస్‌ రోడ్‌... వంటి ప్రాంతాలకీ మా ట్రక్‌లు వచ్చి వెళుతుంటాయి. రాజమౌళికి నేనూ అజయ్‌ అభిమానులమే.. అలాంటిది ఒకరోజు రాజమౌళి కుటుంబం మొత్తం మా వాహనం వద్దకొచ్చింది. ఆయన సోదరుడి పెళ్లి రోజుని రుచికరమైన దోశలు తింటూ మా ట్రక్‌ వద్ద జరుపుకున్నారు. మంచు మనోజ్‌, అనుష్క కూడా మా దోశలూ, ఇడ్లీల ప్రియులే. అనుష్క అయితే నెలలో రెండు మూడు సార్లయినా ఇక్కడికొచ్చి వెళుతుంది. ఈ ఆలోచనలు చేస్తున్న కొత్తలో ‘హాయిగా ఉద్యోగాలు చేసుకోక ఈ దోశ వ్యాపారాలెందుకు’ అని చాలామంది అన్నారు. ఇప్పుడు వాళ్లే ‘మీరు ఉద్యోగాలు చేస్తూనే... ఇలా మరో డెబ్భై మందికి పని ఇస్తుండటం గొప్ప విషయమే’ అంటున్నారు. నిజమే, వాళ్లంతా మా కుటుంబంలో సభ్యులే. రెండు కోట్ల టర్నోవర్‌కి చేరుకున్నామంటే అది అందరం కలిసి సాధించిందే!




Previous
Next Post »

2 Comments

Write Comments
nmrao bandi
AUTHOR
October 16, 2018 at 9:07 AM delete

WOwww...
Just amazing...
Go rocking...
Good luck...

Reply
avatar
October 16, 2018 at 10:06 AM delete

వీ వన్ వీటూ వీత్రీ
సేవించిరి ప్రముఖు లెల్ల సిత్రపు దోశల్
భావింపగ ఇడ్లీ టీ
సేవలు ఐటీ యనంగ చెలువం బొప్పెన్ .

Reply
avatar