* సర్వం పరమేశ్వరుని స్వరూపమే
శ్లో॥ సత్యేన ధార్యతే పృథ్వీ సత్యేన తపతే రవిః
సత్యేన యాతి వాయుశ్చ సర్వం సత్యే ప్రతిష్టితమ్॥
సత్యం వల్ల పృథ్వీ స్థిరంగా ఉంది. సూర్యుడు సత్యబలంతో తపించుచున్నాడు. సత్యం వల్ల వాయువు వీస్తున్నది. సమస్తం సత్యము నందే స్థిరమై ఉంది. భూగోళం సత్యం ఆధారంతో నిలిచి ఉన్నదని వేదం చెబుతోందని చాణక్యుల వారు నీతిశాస్త్రంలో తెలియచేస్తున్నారు. ఇంకా వేదంలో ఈ విధంగా చెప్పబడి ఉంది.
‘సత్యేనోత్త భితా భూమిః’ అని ఋగ్వేదంలో చెప్పబడింది. ఇంకా వేదంలో వేరొక చోట ఫృథ్వీ అంటే భూమి ఎనిమిది స్తంభాలపై నిలిచి ఉందని చెప్పబడి ఉంది. ఆ ఎనిమిది స్తంభాల్లో సత్యం ఒకటని పేర్కొనబడింది.
సత్యం బృహదృత ముగ్రం దీక్షా తపో బ్రహ్మ యజ్ఞః పృథ్వీ ధారయన్తి’ అని అథర్వణ వేదంలో చెప్పబడి ఉంది. సత్యం, విశాలత్వం, నియమం (వ్యవస్థ), ఉగ్రత (తేజస్విత) దీక్ష, తపము, బ్రహ్మ (జ్ఞానం), యజ్ఞం అంటే పరోపకారం, కళాకౌశలం అంటే ఉద్యోగానికి ఏర్పాట్లు వంటివి ఈ ఎనిమిది పృథ్వీని ధరించు స్తంభాలు. ఇంకో శ్లోకంలో ఇలా చెప్పబడింది.
గోభిర్వి ప్రైశ్చ వేదైశ్చ సతీభిర్సత్య వాదిభిః
అలుబ్దుర్దైన శీతైశ్చ సప్తభిర్ధార్యతే మహీ॥ అని స్కంధ పురాణంలో చెప్పబడింది. ఆవు, బ్రాహ్మణుడు, వేదము, పతివ్రత, సత్యవాది, లోభికానివాడు, దానశీలుడు, శూరవీరుడు అను ఏడుగురిపై పృథ్వీ స్థిరపడి ఉంది. ఇక్కడ సత్యవాదులను పృథ్వీ ధారకులుగా అంగీకరించెను. ఇంకా సత్యం గురించి ఈ విధంగా తెలుస్తోంది. సత్యం మహిమ చాలా గొప్పది.
సత్యమేవేశ్వరో లోకే సత్యే ధర్మః సదాశ్రిత
సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదమ్॥
ప్రపంచంలో సత్యమే ఈశ్వరుడు. ఎల్లప్పుడు ధర్మం సత్యంపై ఆధారపడి ఉండును. సత్యమే సర్వానికి మూలం. సత్యాన్ని మించిన శ్రేష్ఠమైన పదం మరొకటి లేదు. సత్యమనగా పరమేశ్వరుడని అర్ధం. పరమేశ్వరుడును అర్ధం చేసుకున్నచో చాణక్యుల వారు పైన రాసిన శ్లోకంలో పేర్కొనదానికి అర్ధం సరిపోతుంది.
పరమేశ్వరుడు పృథ్వీని ధరించెను. అతని ప్రతాపం వల్ల సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అతని భయం వల్ల వాయువు వీస్తుంది. ఈయన శాసనం వల్ల మృత్యువు కూడా పారిపోతుంది. సమస్తం పరమేశ్వరుని వల్లనే స్థితమై ఉంది.
EmoticonEmoticon