కుటుంబం అంటే అమ్మ.. నాన్న..!




ట్రైన్ కోసం, బస్సు కోసం ఎదురు చూస్తూ గడపడం చాల తక్కువ మంది బోరుగా ఫీలవుతారు. కొందరు తోటి ప్రయాణికుల ప్రవర్తనను గమనిస్తూ ఎవరయితే వారి వారి సమస్యల గురించి సాదక బాధకాలను విచారించుకుంటూ మాట్లాడు కుంటారో వాళ్ళ మీదకు పోతుంది చాలా మంది ధ్యాస. ఆ ఆలోచన అంతా మానవ సంబంధాల వైపే.... బంధాల విలువలు మారిపోయాయి.. సంబంధాల సారాంశం కలుషితమై పోయింది... అమ్మ, నాన్న, తోబుట్టువులు, భార్య, భర్త, పిల్లలు... మంచి కుటుంబాలలో... కడివెడు పాలలో విషపు చుక్కలు కలిసినట్టు.. స్వార్ధం అహంకారం వచ్చి చేరి ఆత్మీయతలను విషపూరితం చేస్తున్నాయి.

అసలు విషయానికి వస్తే... ఓ భార్య భర్త నెలల పసిపిల్ల.. మూడేళ్ల్లు వుంటాయేమో చంటిపిల్లతో సతమతమవుతున్నారు. ఇద్దరిదీ చాల చిన్న వయసు. ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం చంటిదానికి తినిపించడంలో నానా యాతన పడుతున్నారు... అది తినకపోగా మారాము చేస్తున్నది. బిడ్డ ఆకలి తనకు తెలుసన్నట్టు బలవంతంగా నయినా తినిపించే ప్రయత్నం చేస్తూ నీరసించి పోయింది ఆ తల్లి.

నయానా భయానా చెప్పి చూసింది. బిడ్డ వినలేదు... విసిగిపోయి ఓ దెబ్బ వేసే సరికి పాప ఏడ్వడం... తినకపోతే చచ్చిపోతావ్ అంటూ బిడ్డను పట్టుకు తల్లి ఏడవడం..

ఇద్దరు ఏడ్చేసరికి బెదిరిపోయి బిక్కుబిక్కున చూస్తున్న పసివాడితో ఏం చేయాలో తోచని తండ్రి నిస్సహాయత... ఇదంతా చూస్తున్న వారిని బాధకు గురిచేసింది. వెంటనే వెళ్లి ఆ తల్లి తలపై నిమిరి సమాధాన పరచాలని ప్రయత్నించారు అక్కడి వారు.

వారి అనునయంతో తల్లి ఏడుపు రెట్టింపు అయింది... “రెండు రోజుల నుంచి ముద్ద నోట్లో పెడితే వొట్టమ్మ” అని భోరున ఏడ్చేసింది. బిడ్డ ఆకలి తీర్చడంలో తల్లి పడే తపనకు అందరి కళ్ళు చెమర్చినయ్...

సరే... నాకు తోచిన సలహా ఇచ్చి ఇటు పక్కకు తిరిగారో లేదో మరో సంఘటన... అది బాగా కలచి వేసింది... ఎనభై సంవత్స రాల ముసలవ్వ చాల ‘కష్ఠంగా’ నేలపై దోగుతూ ఒక రెక్సిన్ బాగ్‌ను తనతో పాటు నెట్టుకుంటూ బలవంతంగా శరీరాన్ని ఈడ్చుకుంటూ దూరంగా వస్తూ కనిపించింది.

చూడడానికి బతికి చెడిన అవ్వ లాగా అనిపించింది. దగ్గరగా వచ్చిన తరువాత తెలిసింది... తనలో తాను మాట్లాడుకుంటున్నట్టే మనసులోనిదంతా అందరికి వినపడేట్టు అంటున్నది. మధ్య మధ్య బాగ్‌ను తడిమి చూసుకుంటూ మెడకు వేళ్ళాడుతున్న ప్లాస్టిక్ బాటిల్‌లో వున్న నీళ్లను చిన్న చిన్న గుటకలేస్తూ ఆయాసపడుతున్నది. రైల్వే స్టేషన్‌లలో అడుక్కునే వాళ్ళు కనిపిస్తూ వుంటారు. కానీ ఈ అవ్వ అడుక్కునే దానివలె లేదు.


పెద్దవాలకంగా కట్టుకున్న చీర బాగా మాసిపోయి, చిక్కులు పడిన చింపిరి జుట్టుతో ముఖంలో ముడుతలు కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉండి చాలా ఆవేదనగా కనిపిస్తున్నది. దగ్గరగా వెళ్లి అవ్వను గమనిస్తే... మాటలు అస్పష్టాంగా ఉన్నాయి. అర్థం చేసుకోవచ్చు. కన్నబిడ్డలు కాదు పొమ్మన్నారు... పోషించే శక్తి లేదన్నారు. కోడళ్ళు చాకిరీ చేయమన్నారు.. చాలీ చాలని జీతాలతో కొడుకులు వైద్యం చేయించలేమన్నారు... కూలీ నాలీ చేసి పస్తులుంటూ పిల్లలకు పెడుతూ కష్టపడి కట్టుకున్న పెంకుటిల్లు నాది కాదని అంటున్నారు.

యిప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి.... దేవుడా “అంటూ గత కొన్ని రోజులుగా స్టేషన్లో అటు ఇటు తిరుగుతూ అక్కడే కాలం వెళ్లదీస్తూ నిస్సహాయ స్థితిలో వున్నదని అక్కడి వారు అనుకోవడం అందరి చెవిన పడింది. నిస్సహాయులను ఆధారం లేనివాళ్లను పిల్లలు వదిలేసినా ఈ అవ్వ లాంటి వాళ్ళను చేరదీసి అన్నం పెట్టి ఆదుకునే స్వచ్ఛంద సంస్థలు చాల ఉన్నాయ్. సమాచారం అందిస్తే చాలు వాళ్ళే వచ్చి తీసుకుపోతారు.

ప్లాట్‌ఫామ్ పైకి ట్రైన్ వచ్చి ఆగే సరికి ఆలోచనలు చెదిరి పోయాయి. ఏం చేయలేక ట్రైన్ ఎక్కి కూర్చున్నా అవ్వ తడి ఆరని కళ్ళే వెంటాడుతున్నాయి.

తడి ఆరని కన్నవారి కళ్ళు...

మా రెండు కళ్ళు మా పిల్లలే...అని గర్వంగా చెప్పుకొనే ఆ కళ్ళు ఈ రోజు ఒంటరితనంతో బాధపడుతూ కన్న బిడ్డల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయి. వృద్ద్ధాశ్రమాలు ఎంటువంటి ఆసరా లేని వాళ్ల కోసం నిస్సహాయుల కోసం, సంతానం లేని వృద్ధ దంపతుల కోసం ఏర్పడినప్పటికీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. అన్నీ ఉండి, అందరూ ఉండి ఆదరణకు నోచుకోని వద్ధుల సంఖ్య ఆశ్రమాల్లో పెరిగిపోతున్నది.“ మా పిల్లలు వచ్చి మమ్ములను యింటికి తీసుకుపోతార”ని బడి వదిలిన తరువాత అమ్మా నాన్నల కోసం ఎదురు చూసే పసిపిల్లలాగా తలుపులకు చేరగిలబడి చూపు తిప్పుకోకుండా ఎదురు చూసే కన్న వాళ్ళ దీన స్థితి మనసులను కదిలించి వేస్తుంది. బిడ్డలను బాధ్యత లేనివాళ్లుగా తయారు చేస్తూ వద్ధాశ్రమాలు కొన్ని పబ్బం గడుపుకుంటున్నాయనే విమర్శ కూడా వుంది.

అనాథలైన వయోవృద్ధుల, బిడ్డలు వదిలేసినా వద్ధులైన తల్లితండ్రులను చేరదీసి వారి పోషణ బాధ్యతను స్వచ్ఛందంగా చేపట్టిన వద్ధాశ్రమాల సేవానిరతి అభినందనీయమే అయినప్పటికీ డబ్బు సంపాదనే లక్ష్యయంగా కొన్ని సంస్థలు నడుస్తున్నాయన్న విమర్శ కూడా వుంది. సరైన వసతి సౌక ర్యాలను కల్పిస్తూ , వైద్య సదుపాయాలను అందిస్తూ నిస్స్వార్దంగా సేవ చేసే వద్ధాశ్రమాల నిర్వహణ కొంత మంది నిర్భాగ్యులయిన తల్లితండ్రులను చూసిన తరువాత ఎంతైనా అవసరం అనిపిస్తుంది.

ఎనభై సంవత్సరాల ఆ మాతృమూర్తి ఇప్పుడు ఆమె ఎనమిది మంది సంతానానికి అవసరం లేదు. నాలుగో తరాన్ని కూడా ఎత్తుకొని ఆడించిన ఆ చేతులు ఇప్పుడు ఆసరా కోసం అంగలార్చుతున్నాయి. కొడుకులు కాదు పొమ్మన్నారు. కూతుళ్లు మాకే వయసు పైపడిందని అంటున్నారు. అమ్మను చూస్తున్నారన్న పేరు తప్పితే సరైన పోషణ కరువై జీవచ్ఛవంలా రోజులు లెక్కపెడుతున్నది ఆ మాతృ మూర్తి.

మరో అమ్మ పరిస్థితి మరీ దారుణం. ఒక్కగానొక్క కొడుకు... జీవనోపాధి కోసం విదేశాల్లో స్థిరపడ్డాడు. ఆర్ధికంగా ఏలోటూ లేదు. భర్త పెన్షన్ వస్తుంది. సిటీలో అద్దెలు వస్తాయి. బ్యాంకు బ్యాలెన్స్ వుంది. లాకర్‌లో బంగారం వుంది.

అన్నీ వున్నా పట్టెడన్నం పెట్టేవాళ్ళు లేక రోజుల కొద్దీ మంచానికి అతుక్కుపోయి అనారోగ్యంతో మరణించింది ఆ వృద్ధురాలు. కొన్ని వృద్ధాశ్రమాలు అనారోగ్యంతో బాధపడుతున్న వయో వృద్ధులకు ఆరోగ్య కరమైన వాతావరణం కల్పిస్తూ మరణ వేదనను దూరం చేస్తూ ఆదరణ చూపిస్తున్నారు. అనారోగ్యంతో ఒంటరితనంతో బాధపడుతున్న తల్లితండ్రులకు ఆసరా ఓదార్పు ఇవ్వకపోగా వృద్ధాశ్రమాల్లో చేర్పించడానికి పరువు ప్రతిష్ట కోసం పాకులాడుతున్న వారసులు ఎందరో...

ప్రశ్నించరెందుకు.....!

వసుధైక కుటుంబ వ్యవస్థలో లొసుగులు ఎన్ని వున్నా కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుకోవడంలో ఆరోగ్యవంతమైన వ్యవస్థను కోల్పోతూ మానసిక శారీరక సంఘర్షణకు లోనవుతున్నాం. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు వుంది... ఆరోగ్యకరమైన జీవనం కోరుకోవడం ప్రాధమిక హక్కు.

జన్మ ఇచ్చినందుకు మాకెందుకీ శిక్ష అంటూ బిడ్డల నిరాదరణకు గురవుతున్న తల్లి తండ్రులు ప్రశ్నించరెందుకు... తాము సమిధలై కన్నబిడ్డల జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేసిన ఆ త్యాగనిరతి ఈ రోజు నిస్సహాయంగా నిర్వీర్యంగా దైన్యంగా మారడానికి కారకులు ఎవరు...

చివరి మాట

అమ్మ పాదాలు స్వర్గానికి దారులు చూపుతాయని, నాన్న భుజాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయని మరవద్దు... మాతృ దేవోభవ... పితృ దేవోభవ అని వూరికే అనలేదు.

చట్టాలు ఉన్నాయి!

తల్లితండ్రులు, వృద్ధుల పోషణ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2007 సంవత్సరంలో చట్టాన్ని ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమ వారసులపై పోషణ హక్కు కోరుతూ న్యాయ స్థానాలను ఆశ్రయించడం ఎంతో ఖర్చుతోనూ కాలాయాపన తోనూ కూడుకున్న పని.

అందువల్ల సమస్యల సత్వర పరిష్కారానికి ఈ చట్టం ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వం జీవో జారీ చేసింది. అరవై సంవత్సరాలు పైబడిన తల్లితండ్రుల వయోవృద్ధుల అవసరాలను వారి సంతానం వారసులు తీర్చాలి. వారి జీవనానికి అయ్యే ఖర్చులు భరించాలి. పోషించలేని పరిస్థితుల్లో ఏదైనా రిజిస్టర్ అయివున్న స్వచ్ఛంద సంస్థల్లో గాని వృద్ధాశ్రమంలో గానీ వారి జరుగుబాటు కోసం కొంత రుసుము చెల్లించి ఆశ్రయం కోరాలి.

నిరుపేదలకు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలనీ ఈ చట్టం చెబుతున్నది. ఆయా వృద్ధాశ్రమాలలో నివసించే వారికి ఆహారంతో పాటూ వైద్యం, నచ్చిన వ్యాపకం వంటివి సంస్థలు సమకూర్చాలి.

తల్లి తండ్రులను పోషించాల్సిన పిల్లలు వారిని నిర్లక్ష్యం చేసినా వారి అవసరాలు తీర్చక పోయినా విడిచిపెట్టినా వదిలించుకోవాలని చూసినా సంతానానికి వారి వారసులకు శిక్ష పడుతుంది. జైలు శిక్ష, జరిమానా తప్పదు. 
Previous
Next Post »