ఈ వంతెన పొడవు 55 కిలోమీటర్లు. ఇది హాంకాంగ్ నుంచి మకావు మీదుగా చైనాలోని జుహాయి నగరానికి వెళ్తుంది.
ఈ వంతెన నిర్మాణానికి 2,000 కోట్ల డాలర్లు (దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు) ఖర్చయింది. అయితే, ఇది అవసరం లేని 'తెల్ల ఏనుగు' అని విమర్శకులు అంటున్నారు.
భద్రత సమస్యల వల్ల ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఆలస్యం జరిగింది. ఈ పనుల్లో 18 మంది కార్మికులు చనిపోయారని అధికారులు చెప్పారు.
ఈ వంతెన ప్రత్యేకతలేమిటి?
ఈ బ్రిడ్జి దక్షిణ చైనాలోని మూడు తీర ప్రాంత నగరాలను - హాంకాంగ్, మకావు, జుహాయి - కలుపుతుంది.
భూకంపాలు, తుపాన్లను తట్టుకునే విధంగా నిర్మించిన ఈ వంతెన కోసం 4 లక్షల టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఈ మొత్తం ఉక్కుతో 60 ఐఫిల్ టవర్లను కట్టవచ్చు.
ఈ వంతెనలో 30 కిలోమీటర్ల మార్గాన్ని పెరల్ రివర్ డెల్టా సముద్రం మీదే నిర్మించారు. ఇందులో 6.7 కిలోమీటర్ల రోడ్డు మధ్యలో సముద్ర గర్భంలో ఉంటుంది. రెండు కృత్రిమ దీవుల గుండా ఈ సొరంగ మార్గం వెళ్తుంది.
ఇందులో ఇంకా లింకు రోడ్లు, జూహాయి, హాంకాంగ్ నగరాలను ప్రధాన వంతెనకు కలిపే భూతల సొరంగమార్గాలు కూడా ఉన్నాయి.
ఈ వంతెనను ఎందుకు నిర్మించారు?
దక్షిణ చైనాలో హాంకాంగ్, మకావు వంటి తొమ్మిది నగరాలను కలుపుతూ విశాల తీర ప్రాంతాన్ని సృష్టించాలనే ప్రణాళికలో భాగంగా ఈ బ్రిడ్జి రూపుదిద్దుకుంది.
ఈ ప్రాంతంలో ప్రస్తుతం 6.8 కోట్ల మంది నివసిస్తున్నారు.
గతంలో, జుహాయి - హాంకాంగ్ ల మధ్య ప్రయాణానికి నాలుగు గంటలు పట్టేది. ఇప్పుడు ఈ వంతెన మీద ఆ వ్యవధి 30 నిమిషాలకు తగ్గిపోయింది.
ఈ బ్రిడ్జి మీద ఎవరైనా వెళ్ళవచ్చా?
లేదు. కోటా విధానం ద్వారా అనుమతి పొందిన వారు మాత్రమే ఈ బ్రిడ్జి మీద ప్రయాణించాలి. అన్ని వాహనాలూ టోల్ సుంకం కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రజారవాణా వ్యవస్థకు దీని మీద అనుమతి లేదు. ప్రైవేటు షటిల్ బస్సులు వెళ్ళవచ్చు. అయితే, దీనికి రైలు మార్గాలతో అనుసంధానం లేదు.
రోజూ 9,200 వాహనాలు ఈ వంతెన మీద ప్రయాణిస్తాయన్నది అధికారుల ప్రాథమిక అంచనా. అయితే, ఈ ప్రాంతంలో కొత్త రహదారుల నిర్మాణం కూడా జరిగిన నేపథ్యంలో ఈ అంచనాను వారు తగ్గించారు.
EmoticonEmoticon