పురాణాల్లో మనం గమనించే కల్పవృక్షం కూడా మనిషి జీవితానికి ప్రతీకయే. ఇది ఎక్కడో దేవలోకంలో ఉన్నదని భావించనక్కరలేదు. కల్పన అంటే ఒక వస్తువును గొప్పగా భావించడం, దానికై ప్రయత్నించడం. ఆ కోరిక తీర్చే చెట్టే కల్పవృక్షం. జీవితంలో ఎలాంటి కోరికలుంటాయో అలాంటి ప్రయత్నాలు చేస్తాం, ఎలాంటి ప్రయత్నం చేస్తామో అలాంటి ఫలితం లభిస్తుంది. మనకున్న శరీరం, మనస్సు, ఇంద్రియాల సమూహమే ఈ కల్ప వృక్షం.
మనిషి జీవితాన్ని వర్ణించడానికి చెట్టును ఉపమానంగా చెప్పడం వైదిక సాహిత్యం మొదలుగా చాలాచోట్ల చూడగలం. జనన మరణ చక్రంలో కొట్టుకుని తిరిగే మనిషి జీవితాన్ని వివరించడానికై యుజర్వేదానికి చెందిన కఠోపనిషత్తు అనేక అందమైన ఉపమానాల్ని చూపింది. అందులో ఒక ప్రధానమైన ఉపమానం చెట్టు. ఈ ఉపమానాన్నే భగవద్గీతలో(15-1) చూడగలం.
పై ఉపమానాన్ని వ్యాఖ్యానించిన పండితులు అది జీవితానికి ఎలా అన్వయిస్తుందో వివరించారు. చెట్టు ఎలాగ దృఢమైన వ్రేళ్లు నాటుకొని ఉంటుందో అలాగే మనిషి దృఢమైన బంధాల్ని పెంచుకొని ఉంటాడు. చెట్టుకు ఎలాగ బలమైన స్కంధం ఉంటుందో అలాగ మనిషికి నేను అనే భావన బలమైన స్కంధంలాగ ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకొనే మిగతా కొమ్మలు, ఫలాలు, పుష్పాలు మొదలైనవన్నీ ఉంటాయి. కోరికలు అనే నీటితో తడపబడి బలమైన వ్రేళ్ళు కలిగినదట ఈ చెట్టు. మనిషి చేసే మంచి, చెడు పనులకు అనుగుణంగా ఫలాలు, పుష్పాలు ఉంటాయట. సుఖం, దుఃఖం లాంటి అనుభవాలే వీటి రసం. ఫలాలు. పుష్పాలు రాలిపోవడం, కొత్తవి రావడం ఎల్లప్పుడూ మారుతూ ఉండే స్వభావానికి చిహ్నం. ప్రపంచంలో ఎన్నో ఆశగొలిపే విషయాలు మనల్ని ఊరిస్తూ కర్మల్ని చేయిస్తూ ఉంటాయి.
కానీ ఆశ్చర్యమేమంటే ఈ చెట్టు తలక్రిందులుగా ఉంటుంది. భూమిలో ఉన్న వ్రేళ్ళను ఎలా చూడలేమో అలాగే ఆకాశంలో ఉన్న దీని మూలాల్ని మనం చూడలేం. కిందివైపునకు వ్యాపించి ఉన్న చెట్టు యొక్క కాండము, విశాలమైన కొమ్మలు, వాటినుండి చిరుకొమ్మలు, ఫలాలు, పుష్పాలు, మొదలైనవన్నీ కనిపిస్తాయి. చెట్టులో ఉన్న తొర్రలు, పక్షుల గూళ్ళు మనిషి తన కర్మఫలంగా పొందే అనేక లోకాలకు చిహ్నాలు. ఇంత దృఢంగా కనిపించినా దీన్ని నరికివేయడానికి వైరాగ్యము, దాని వల్ల కలిగే జ్ఞానం అనే కత్తి ఉన్నదట. అందుకే ఈ చెట్టును అశ్వత్థం అన్నారు. సంస్కృతంలో ‘శ్వః’ అంటే రేపు అని అర్థం, ‘అశ్వత్థం’ అంటే రేపటికి నిలిచి ఉండనిది, అశాశ్వతమైనది అని అర్థం. జ్ఞానం కలగనంతవరకూ మనల్ని దృఢంగా బంధించి ఆశగొలిపే ఈ చెట్టు జ్ఞానం కలిగిన మరుక్షణంలో ఎండమావిలా తేలిపోతుంది.
కర్మయోగం గురించి వ్రాసిన మునుపటి వ్యాసాల్లో మనిషి చేసే వివిధ రకాల కర్మలు, వాటి ఫలాల గురించి గమనించాం. జీవితం అనే చెట్టు అనేక ఫలాల్ని ఇస్తూ ఉంటుంది. ఈ ఫలాల్ని తింటున్నంత కాలం మనిషి జీవితం, మరణమనే చక్రంలో తిరుగుతూంటాడని కూడా చూశాం. ఈ కర్మఫలాన్ని తినకుండా ఉండటం అంటే నిష్కామకర్మ (మునుపటి వ్యాసాల్లో తెలుసుకున్నాం) చేయడం. అంటే జీవుడు పై చెట్టు ఫలాన్ని తినకపోవడం, శ్రీకృష్ణుడు ఈ విషయాన్నే అర్జునుడికి బోధిస్తూ కర్మకు ఫలితంగా వచ్చే జననమరణచక్రానికి నువ్వు కారణం కావద్దు అని చెబుతాడు. ఈ చెట్టుకు కారణమూ మనిషియే, దీని నాశనానికి కారణమూ మనిషియే. దీని నాశనానికి కారణమూ మనిషియే. శరీరం, ఇంద్రియాలు వీటన్నిటితో నేను అనే భావన ముడిపడి ఉన్నంతవరకూ అతడు జీవుడు, చెట్టుకు కారకుడు. పై భావన తొలగిపోయినప్పుడు జీవుడు తను ఆత్మ స్వరూపుడని తెలుసుకొని చెట్టును చేధించివేస్తాడు.
పై చెప్పిన చెట్టు, కర్మఫలం అనే ఉపమానాన్నే మరింత వివరిస్తూ శ్వేతాశ్వతర ఉపనిషత్తు, ముండకోపనిషత్తులు చెప్పాయి. ఒకే చెట్టుపై రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఆ చెట్టుయొక్క ఫలాన్ని తింటుంది. మరొక పక్షి ఆ ఫలాన్ని తినదు కేవలం ప్రకాశిస్తూ ఉంటుంది. మనిషి యొక్క శరీరం, మనస్సు, ఇంద్రియాలే ఈ చెట్టు. జీవుడు, ఆత్మయే పక్షులు. కర్మఫలాన్ని తినే పక్షి జీవుడు. కర్మఫలం తినకుండా కేవలం శుద్ధచైతన్య రూపంలో ఉన్న పక్షి ఆత్మ. కర్మయోగాన్ని అనుసరిస్తే జీవుడు కర్మఫలాన్ని తప్పించుకుంటాడనీ, తన స్వరూపాన్ని ఆత్మగా తెలుసుకుంటాడనీ పై మంత్రాలయొక్క అర్థం. దీన్నే భగవద్గీతలో కృష్ణుడు కూడా వివరించాడు.
బౌద్ధ, జైన సంప్రదాయాల్లో కూడా చెట్టును ప్రతీక (టడఝఛౌజూ) గా చెప్పడం గమనిస్తాం. పోతే ఇది తలక్రిందులుగా కాక నిటారుగా ఉన్న చెట్టు. బోధి వృక్షం క్రింద ధ్యానం చేస్తున్న బుద్ధునికి జ్ఞానోదయమైనదని మనం చదివాం. బుద్ధుడు ధ్యానం చేసినది జీవితమనే చెట్టు గురించి, దానిలోని ఆకర్షణలు, బంధాలు, వాటివల్ల కలిగే దుఃఖం గురించి. ఆ సమయంలోనే మన్మథుడు, అప్సరసలు మొదలైనవారు బుద్ధుణ్ణి తమవశం చేసుకోవడానికి ననప్రయత్నించడం, బుద్ధుడు వాటికి లొంగకపోవడం కూడా చదివాం. వీటన్నిటినీ ప్రతీకలుగానే గ్రహించాలి కానీ వారి మధ్య పెద్ద యుద్ధం జరిగినట్లు, బుద్ధుడిపై మన్మథుడు బాణాలు వేసినట్లు, ఆయన వాటికి చలించనట్లు భావించకూడదు. బుద్ధునికి జ్ఞానోదయం కావడం బుద్ధుని గొప్పదనమే కాని చెట్టు మహిమ కాదు. అయినా మనం బౌద్ధగయ వెళ్ళినపుడు జీవితాన్ని గురించి గాక ఆ చెట్టే జ్ఞానం ఇస్తుంది అన్నట్లుగా దాని క్రింద కొద్దిసేపు ధ్యానం చేసి వస్తూంటాం.
వైదిక సాహిత్యంలో చెప్పిన ఈ చెట్టు ఉపమానం మిగతా సంస్కృతుల్లో కూడా దాదాపు ఇదే పద్ధతిలో ఉన్నట్టు చూడగలం. ఉదాహరణకు ఆడం, ఈవ్ ల కథ. ఆ కథలో చెట్టు ఫలాన్ని తినేది ఈవ్. మన కథలో జీవుడితో ఈవ్ ను పోల్చవచ్చు. ఫలాన్ని తిననిది ఆడం, మన కథలో ఆత్మతో ఆడం ను పోల్చవచ్చు. ఫలాన్ని తిననంతకాలం వాళ్ళిద్దరూ దైవికజ్ఞానమనే ఆనందమయ స్థాయిలో ఉండేవారు. కర్మఫలాన్ని తిన్న జీవుడు ఎలా బంధాన్ని పొందుతాడో అలాగే ఆ చెట్టు ఫలాన్ని తిన్న ఈవ్ కు దైవికజ్ఞానం నశించి లౌకికజ్ఞానం కలుగుతుంది. అంతకు పూర్వం గర్భధారణ, ముసలితనం, మరణం అనేవి లేవు. ఆ తర్వాత ఇవన్నీ వచ్చాయి. వారిద్దరూ అమాయకత్వాన్ని, ఆనందాన్ని కోల్పోవడం, దేహాభిమానం ఏర్పడి తాము నగ్నంగా ఉన్నామని భావించడం మొదలైనవన్నీ ఆ కథలో చూడగలం. అంతవరకూ మంచి, చెడు అనే భావాలకు అతీతంగా, భగవంతుడికి సన్నిహితంగా ఉండేవారు. ఫలం తిన్న తర్వాత మంచి, చెడు అనే ఆలోచనలు మొదలై భగవంతుడికి దూరమయ్యారు. జ్ఞాని అయినవాడు మంచి చెడులకు, వాటివల్ల కలిగే పుణ్యపాపాలకూ అతీతంగా ఉంటాడనీ, అలా కానప్పుడు పుణ్యపాపాల్ని పొందుతుంటాడని ఉపనిషత్తు చెప్పే భావాన్నే పై కథలో కూడా గమనించగలం.
పురాణాల్లో మనం గమనించే కల్పవృక్షం కూడా మనిషి జీవితానికి ప్రతీకయే. ఇది ఎక్కడో దేవలోకంలో ఉన్నదని భావించనక్కరలేదు. కల్పన అంటే ఒక వస్తువును గొప్పగా భావించడం, దానికై ప్రయత్నించడం. ఆ కోరిక తీర్చే చెట్టే కల్పవృక్షం. జీవితంలో ఎలాంటి కోరికలుంటాయో అలాంటి ప్రయత్నాలు చేస్తాం, ఎలాంటి ప్రయత్నం చేస్తామో అలాంటి ఫలితం లభిస్తుంది. మనకున్న శరీరం, మనస్సు, ఇంద్రియాల సమూహమే ఈ కల్ప వృక్షం. ఈ చెట్టు యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకున్నవాడే జ్ఞాని అని భగవద్గీత చెబుతుంది.
EmoticonEmoticon