శివుడు ఒక్కడే పరబ్రహ్మరూపుడు. కావున ఆయన్ని నిరాకారుడని చెబుతారు. శివునికి రూపం కూడా ఉండటం వల్ల, ఆయన నిరాకారుడు, సాకారుడు కూడా. ఈశ్వరుడు నిరాకారుడు కాబట్టి నిరాకారమైన లింగమందు పూజింపబడుతున్నాడు. ఆయన సాకారుడు కాబట్టి మూర్తియందు కూడా ఆరాధింపబడుతున్నాడు. ఈ విధంగా ఆయన సాకార, నిరాకార రూపుడవడం వల్ల పరబ్రహ్మ శబ్దవాచ్యుడగుచున్నాడు.
ఏ దేవతకు లేని లింగ రూపం శివునికి మాత్రమే ఉంది. శివుని తత్వం పరమాత్మతత్వానికి ప్రతీక. అదే లింగస్వరూపం. లింగం అంటే గుర్తు అని అర్థం. పరమాత్మస్వరూపానికి గుర్తు లింగం. అది జ్యోతిరూపం. లింగరూపం అన్నిచోట్లా ఒకే విధంగా ఉండదు. శుభంకరమైన ఆ స్వరూపాన్ని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తయారు చేసుకున్నారు.
అయితే లింగం ఎలా ఉండాలనేదానికి ఆగమాలు, పురాణాలు చెప్పడం జరిగింది. లింగం ఎక్కువగా గుండ్రని ఆకారంలో ఉంటుంది. కావున ఆదిమధ్యాంతాలు లేని స్వరూపానికి ప్రతీక అనవచ్చు. ఈ లింగస్వరూపంలాగానే భగవంతుడు కూడా ఆదిమధ్యాంతరహితుడు. శివుణ్ణి లింగరూపంలో పూజించాలని ఆగమాలు, పురాణాలు తెలియచేస్తున్నాయి. మహాభారతంలో విగ్రహరూపంలో శివుణ్ణి ఆరాధించి అశ్వత్థామ భంగపడ్డట్టు తెలుస్తుంది.
EmoticonEmoticon