మనిషి సంఘజీవి. ఒకరిపై మరొకరు ఆధారపడి జీవించాల్సిందే. అందుకు ఎవరు ఎటువంటి వారైనా సరే. కాని సాంగత్యానికి మాత్రం సత్సాంగత్యంతోనే కూడుకుని ఉండాలి అని చాణక్యుడు తన అర్థశాస్త్రం ద్వారా వివరించాడు. ముఖ్యంగా భారతావని సత్సంగాలకు నెలవు. అంటే మంచి వ్యక్తులతో ఉండాలని.
తెలివైన వారితో సహచర్యం చేయమని చాణక్యుడి సలహా. దీని అర్థం ఎటువంటి వారికైన తెలివైన వారితో ఉంటే సమస్యలను పరిష్కరించగలుగుతారు. మనిషిని ప్రభావితం చేసేది వారి చుట్టూ ఉన్న వ్యక్తుల ఆలోచనలే. ఎవరు ఎటువంటి కులంలో పుట్టినా, ఎంతటి ధనంవంతులైనా, బీదవారైనా.. తెలివైన వ్యక్తుల సహచర్యంతో జీవనాన్ని సుగమనంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా నాయకులు తెలివైన వారి సహచర్యం వల్ల తమకే కాక దేశానికి ఎంతో పురోభివృద్ధిని కలిగిస్తారు.
ఎటువంటి పరిస్థితులోనైనా గట్టేంక్కించే సత్తా వారిలో ఉంటుంది. శత్రువుల ఎత్తుకు పైఎత్తు వేయగలుగుతారు. గండం నుంచి బయట పడగలుగుతారు. పాండవులు యుద్ధంలో గెలవగలిగారు అంటే అది వారికున్న శస్త్రవిద్య ఒక్కటే కాదు. శ్రీకృష్ణుడి మనోబుద్ధి కారణం. యుద్ధంలో నడిచినది పాండవులే అయినా నడిపించింది ఆ భాగవోత్తముడు.
కౌరవులు నూరుగురు అయిన, వారి సైన్యం పాండవుల సైన్యం కన్నా అత్యధికమైనా, ఏ సమయానికి ఏం చేయాలి అని తెలిసినవాడు, చురుకైన వాడైన వాసుదేవుడు పాండవుల పక్షాన ఉండటం వల్ల పాండవులకు విజయం హస్తగతం అయ్యింది. తెలివైనవారి మెదడు చురుకుగా ఉంటుంది. వారి ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. వారు నిరంతరం తమకన్నా గొప్పవారి చేష్టలను, వారి విధివిధానాలను గురించి చర్చిస్తూంటారు.
కనుక వారి ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉంటాయి. ఉన్నతమైన ఆలోచనలు గలవ్యక్తుల సహచర్యంతో వీరు కూడా తమని తాము ఉన్నతంగా, ఉన్నత స్థితికి ఎదిగే విధంగా మలచుకోవచ్చు. తెలివైన వారి ఆలోచనలతో సహచరుల మెదడు మమేకమై తెలియకుండానే చురుకుగా మారి ఉన్నత స్వభావాలను సంతరించుకుంటాయి.
తెలివైన వ్యక్తులతో మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పరివేష్టించుకుంటూ ఉండాలి. వారి పుస్తకాలు చదవాలి. ప్రేరణ ఇచ్చే వీడియోలు చూస్తుండాలి. ఆడియోలు వింటుండాలి ఇవే స్పూర్తిని ఇవ్వడానికి మంచి కారకాలు. అందుకే ఒక వ్యక్తి అతను చాలా సమయం గడిపే ఐదుగురి వ్యక్తుల సగటు అని పెద్దలు చెప్తుంటారు. ఇది అధ్యయనాలలో తేటతెల్లమవుతుంది.
EmoticonEmoticon