జీవన కాంతి





వాహనం నడవాలంటే ఇంధనం కావాలి. అది కేవలం ఆ బండి డబ్బాలో పడి ఉంటే సరిపోదు. ఆ ఇంధనమంతా మండి, ఉష్ణం వెలువడాలి. అప్పుడే చోదక శక్తి కలిగి, ఎంతటి వాహనమైనా ముందుకు కదులుతుంది. అలా సృష్టిలోని ఎన్నింటినో నిప్పు నడిపిస్తోంది. భూమి గ్రహం మొదట అగ్ని (సూర్యుడు) నుంచే వచ్చింది. భూమి నుంచి పుట్టుకు వచ్చే అన్నింటిలోనూ ఉష్ణశక్తి అంతర్భాగంగా ఉంటుంది. జీవజాలం తీసుకున్న ఆహారాన్ని ఊష్ణం (జఠర రసం) జీర్ణం చేస్తుంది. సూర్యరశ్మితో కిరణజన్య సంయోగ క్రియ సాగడం వల్ల మొక్కలు  పెరుగుతుంటాయి.




తారాజువ్వలు లేదా ఆకాశబాణాల్ని మండించి, కృత్రిమ ఉపగ్రహాలుగా విశ్వంలోకి పంపించి, ఖగోళ రహస్యాల్ని ఛేదిస్తుంటారు. నిప్పు మూలంగా పుట్టిన కాంతివేగాన్ని శాస్త్రవేత్తలు విజ్ఞానరంగంలో  ఓ ప్రామాణిక వేగంగా తీసుకుంటారు. పంచభూతాల్లో అగ్ని ఎంతో చురుకైనది. తేజస్సు కలిగినది. అది అత్యంత శక్తిసంపన్నం. చైతన్యమంత గొప్పది అగ్ని. ప్రతికూల పరిస్థితుల్లో జడత్వ స్థితి ఆవహించినప్పుడు, ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

ఎప్పుడైనా ఎక్కడైనా కదలిక తెచ్చేది నిప్పే!

మంచులో కూరుకుపోయిన ఒక ప్రాణి రక్తప్రసరణ ఆగిపోయింది. ఆ జీవి కొన ఊపిరితో కొట్టు మిట్టాడటం కనిపిస్తోంది. కదలలేని స్థితిలో నిస్సహాయంగా పడి ఉందది! అంతలో తూరుపు కొండల నుంచి ధగధగలాడుతూ ఎర్రటి సూర్యుడు పైకి వచ్చాడు. ఆ నులివెచ్చని కిరణాలు సోకడంతో, పోతున్న ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. ముప్పు నుంచి బయటపడిందా ప్రాణి! మనిషిని నిప్పు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంచుతుంది.నాట్యం వల్ల మానవ శరీరం వేడిమితో పుంజుకొంటుంది.

అదే సమయంలో దేహానికి, ఆత్మకు వారధిలా ఉండే మనసు కరిగి సహజ స్థితికి చేరుతుంది. అంటే, అప్పటివరకు పరధ్యానంలో ఉన్న మనసు ధ్యాన స్థితిలోకి వస్తుంది. శరీరం, మనసు, ఆత్మ- సమస్థితిలో నెలకొంటాయి. మనసు అనేది కదిలే గుణం కలది. ఆత్మ ఓ చైతన్య స్వరూపం. నాట్యం చేస్తున్నప్పుడు దేహమంతా చలనదశలో ఉంటుంది. ఆ విధంగా మూడూ ఒకే స్థితిలో ఉన్నట్లే! నాట్యం సాగించే వ్యక్తి వర్తమానంలోనే ఉంటాడు. నాట్యకారులతో పాటు, ఆటలపై మొగ్గుచూపే పిల్లలూ సదా ఆనందంతో ఉంటుంటారు.

నాట్యానికి, ఆనందానికి అంత దగ్గరి సంబంధం ఉంది. అందువల్ల,  బాగా ఆనందం కలిగినప్పుడు నాట్యం చేయాలనుకుంటాడు మనిషి! బాల్యంలో అందరూ రోజంతా ఆడుతూనే ఉంటారు. కోపం కలిగినా నర్తించాలంటారు పెద్దలు. అప్పుడు ఆ కోపమంతా ఆనందంగా రూపాంతరం చెందుతుందని చెబుతారు. అదే కోణంలో చూసినప్పుడు, ఆది యోగి ‘శివుడు’ నటరాజుగా ప్రత్యక్షమవుతాడు. దేశంలో రూపొందిన శాస్త్రీయ నృత్యాలకు ఒక తాత్విక నేపథ్యం ఉంది. ఆధ్యాత్మిక కారణాలూ ఉన్నాయి.

‘ఆదిమ మతాలన్నింటికీ నాట్యమే ఆధారం’ అంటారు ఓషో. శాస్త్రీయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి వంటివి ఎంతో ప్రశస్తి పొందాయి. ప్రపంచవ్యాప్తంగా వాటికి గల ఆదరణ అపారం! ఇల్లు, వాకిలిని నీటితో కడుగుతారు. బావిలోని నీళ్లను విరంజన పిండి (బ్లీచింగ్ పౌడరు)తో శుభ్రపరచుకుంటారు. ఇంటి లోపలి బూజును కర్ర చీపురుతో దులుపుతారు. ఇంటా బయటా కలుషితమైన గాలిని శుభ్రపరచేదెలా? ధూపదీపాలు, అగరుబత్తీలు, నవధాన్యాల్ని అగ్నికి ఆహుతి చేసే హోమాలు అందుకేనేమో! పండుగలు, ఇతర పర్వదినాల్లో ‘అగ్ని’ ప్రధాన పాత్ర వహిస్తుంది.

రకరకాల రుచులతో వంటలు చేస్తారు. వివిధ రూపాల్లో జీవన సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసే దీపాలంకరణ దాకా అగ్ని ప్రాధాన్యం కనిపిస్తుంటుంది. చరాచర జగత్తునంతటినీ వెలుగుమయం చేస్తోంది- అగ్ని. ఆ రూపానికి చేతులెత్తి వందనాలు అర్పించడమే సూర్య నమస్కారం! ఆరోగ్యానికి అది పూర్తిగా దోహదపడుతుంది. ధ్యానులు సాధనలో అంతిమంగా చేసేదేమిటి? నిత్యనూతనమైన ‘జీవన కాంతి’ని దర్శించడం! అదే- అనంతం, ఆనందకరం, శాశ్వతం!
Previous
Next Post »