ఆలయాలు రక్షిద్దాం సంకటాలు హరిద్దాం!





“ఆలయమునకూ వెళ్లనివారికి అపవర్గపుదారెక్కడిది
అర్చనసేయుటనెరుగని వారికి ఆత్మానందంబెక్కడిది
ముమ్మారులు గుడివలగొనకున్న ముక్తికి తెరువు ఎక్కడిది
చేతులెత్తి శరణొందనివారికి చేటులేని పదమెక్కడిది
కాయకప్పురము దేవునికీయక కైవల్యము తనకెక్కడిది
తీర్థప్రసాదము తీసుకొనకనే తిరిగి రాని పదమెక్కడిది”





అంటూ ఆలపించే సంకీర్తనాకారుడి భావన దేవాలయాన్ని ‘నిలువెత్తుగోపురం’గా మన హృదయంలో నిలుపుతుంది. హైందవ ఆచార- సంప్రదాయ, తాత్విక, సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలన్నీ గుడిచుట్టే తిరిగాయి. మనిషి ప్రాథమికంగా ఆధ్యాత్మికత అలవర్చుకొనే చోటు దేవాలయం. అలాంటి హైందవ ధర్మకేంద్రం - ఆలయం ఇవాళ పాలకమండళ్ల పొత్తిళ్ళలో నలిగిపోతున్నది; రాజకీయరాబందుల కబంధహస్తాల్లో కుమిలిపోతున్నది. ప్రతి హిందువు తన ఇంటి సమీపంలోని దేవాలయం ‘తనది’ గా భావిస్తేనే ఆలయాన్ని మనం రక్షించుకోగలుగుతాం!

ప్రముఖ మిఠాయి వ్యాపారస్తులు, ప్రఖ్యాత ధార్మికదానశీలిగా పేరొందిన కీ॥శే॥ జి.పుల్లారెడ్డి వద్దకు కొందరు వ్యక్తులు వచ్చి “మేం! ఫలానా చోట దేవాలయం కడుతున్నాం; విరాళం ఇవ్వండి’-అన్నారట. వచ్చినవాళ్లు 60 పైబడి ఉన్నారు. దానికి రెడ్డిగారు ఇస్తాను గాని ఎవరైనా మీరు కట్టిన ఆలయంపై దాడిచేస్తే మీరేం చేస్తారు” అని అడగ్గానే వాళ్లు “మౌనందాల్చారట.” “అరవై పై బడ్డ మీరు ఎదురుతిరుగుతాం” అని కూడా అనట్లేదు; విరాళం ఇవ్వను అన్నారట. నిజమే! దేవాలయాలు కొత్తగా కట్టడం కన్నా ఉన్న ఆలయాలను కాపాడుకొని అభివృద్ధి చేయడం మంచిది.

దేవాలయ సంప్రదాయం ఎప్పటిది?
పూర్వయుగాల్లో ఇప్పుడున్నన్ని విగ్రహాలు లేవు? శ్రీరామపట్టాభిషేకం నిర్ణయం జరిగిన వెంటనే నగర అలంకరణతోపాటు దేవాలయాల్ని కూడా అలంకరించారని శ్రీమద్రామాయణం తెలియజేస్తుంది. సీతారాములు తమ పట్టాభిషేకం కన్నా ముందురోజు రాత్రి శ్రీమన్నారాయనుణ్ణి ఉపాసన చేసినట్లు రామాయణం వల్ల తెలుస్తున్నది. సేతు బంధనం కన్నా ముందు శివలింగ ప్రతిష్ఠ చేసినట్లు శివపురాణం చెప్తుంది. మహాభారతంలో అశ్వత్థామ శివుణ్ణి లింగరూపంలో కాకుండా ప్రతిమారూపంలో అర్చించినట్లు తెలుస్తుంది. ద్రౌపది, అర్జునుడు ఆరాధన చేసినట్లు భారతం చెబుతోంది.

శ్రుతి స్మృతి విధానేన 
పూజా కార్యయుగత్రయే !
ఆగమోక్త విధానేన
కలౌదేవాన్ యజేత్సుధీః॥

శ్రుతి, స్మృతి విహితాలైన పూజావిధులు కృత, త్రేత, ద్వాపరయుగాలకు పరిమితమైనవి. ఇక కలియుగంలో ఆగమోక్త పూజావిధితో బుద్ధిమంతులు దేవుణ్ణి అర్చించాలని ఆగమాలు తెలియజేస్తున్నాయి.ఈ ప్రమాణాన్ని బట్టి ఆలయాలు కలియుగానికి పరిమితం కాలేదని కృతయుగం నుండి ఉన్నాయని తెలుస్తుంది. నాటి నుండి నేటి వరకు దేవతార్చనకు దేవాలయాలు సజీవ సాక్ష్యాలు. మానవజాతి చరిత్ర ప్రారంభం నుండి ఈ విషయానికి ప్రాధాన్యత ఉంది. ఇదే విషయాన్ని ఓ తాత్వికుడు చెబుతూ దేవాలయాలు కట్టాలి అన్న సార్వత్రిక ప్రేరణ మనిషిలోనే అంతర్గతంగా ఉంది. జంతువులు వాటి నివాసాలను ఏర్పరచుకొంటాయి.

పక్షులు గూళ్లు కడతాయి; కానీ అవి దేవాలయాలను కట్టవు. జంతువులకి, మనిషికి భేదాన్ని గుర్తించేటపుడు ప్రస్ఫుటమయ్యే ఒక విశిష్టలక్షణం ఏమిటంటే మనిషి దేవాలయాలు కట్టే జంతువని.. (జత్రుః అస్తీతి జంతుః = ఎముకలు కల్గినది జంతువు కనుక మనిషి కూడా జంతువే) వేరే జంతువులు దేవాలయాలు కట్టవు. ఎవరికి వారు ఆశ్రయం ఏర్పరచుకోవడం చాలా సహజం; పశువులు, పక్షులు, చిన్నిక్రిములు - ప్రతి జీవి చేసేది అదే - కానీ దైవానికి ఇల్లు కట్టడం అన్నది మనిషి ప్రత్యేక లక్షణం” అని మన అంతరాంతారాళాలను తడతాడు.

ఆలయం - అందులోని విశేషాలు
కళ :- శిల్పం, నిర్మాణం, వాస్తువిజ్ఞానం, ప్రకృతివిజ్ఞానం, కళాకృతులు
సేవ :- ప్రసూతి, వైద్యం, విద్యా, న్యాయకేంద్రం, అన్నదానం, సాధువులకు ఆవాసం, ధర్మోపదేశం.
ధర్మం :- పారాయణం, అధ్యయనకేంద్రం, మతతాత్విక విజ్ఞానం, వేదవిద్య మంత్ర విజ్ఞాన పరిశోధనశాల
సంస్కృతి :- నృత్యం, గానం, శిల్పం, చిత్రలేఖనం, కవిత్వం, గానం శబ్ద బ్రహ్మ అయిన పరమాత్మను సాధించే స్థలం దేవాలయం అంటారు స్వామి విశుద్ధానంద. అలాంటి ఆలయాన్ని ‘దేవశరీరభూతమ్’ అని పిలుస్తారు. ఇందులోని పంచప్రాకారాలు పంచకోశాలకు ప్రతీక.

మొదటిప్రాకారం: (అన్నమయకోశం) - ప్రధానరాజగోపురం. ఈ రాజ-గోపుర మండపంలో మతాతీతమైన, సామాజిక, లౌకిక కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్తర ఈశాన్యంలో నిర్మించే పుష్కరిణి’ రాజగోపుర పరిధిలోనే ఉంటుంది.
రెండవప్రాకారం : (ప్రాణమయకోశం) : అలంకార, వాహన, కల్యాణ, వెయ్యి-కాళ్లమండపం, పరివారదేవతలు మండపాలు, యాగశాల, వంటగది
మూడవప్రాకారం:- (విజ్ఞానమయకోశం) మహామండపం, వాహన మండపం, బలిపీఠం, ధ్వజస్తంభం - ప్రధాన ప్రాంగణం అంతా ఈ పరిధిలోదే.
నాల్గవప్రాకారం: (మనోమయకోశం)- ప్రదక్షిణ చేసే ప్రాకారం.
అయిదవప్రాకారం:- (ఆనందమయకోశం) గర్భగృహం ఆలయానికి అర్చకుడు ప్రధాన పీఠాధిపతి, “ప్రతిమాయాంతు సాన్నిధ్యమ్ అర్చకస్యతపోబలం” అంటుందిశాస్త్రం, శ్రీరామకృష్ణ పరమహంస కాళికా దేవాలయంలో 20 ఏళ్లు పూజారిగా పనిచేశారు. అర్చకుడు ఎలా ఉండాలో నేర్పించారు; ఆయన జీవిత చరిత్ర అర్చకులు అధ్యయనం చేయాలి, కేవలం కాసులకు కక్కుర్తిపడి, మొక్కుబడిగా పూజలు జరిపించడం కాదు. సమాజంలో జరిగే వికృతులపై ఆలయానికి వచ్చే భక్తులకు బోధకుడిగా అర్చకుడు మారాలి.

ప్రతిరోజు ఏదో ఓ సమయంలో వచ్చిన భక్తులకు మన ధర్మంపట్ల కొన్ని విషయాలు తెలిసేటట్లుగా ప్రబోధించాలి. మొక్కుబడి తంతుగా ఉదరపోషణార్థం చేసినట్లుగా అర్చకత్వం ఉండకూడదు. వచ్చిన భక్తులు అర్చకుడ్ని గురువుగా భావించేలా ప్రవర్తించాలి. దేవుడికి మనం చేసే పూజల్లో నమ్మకం-భక్తి ప్రధానంగా ఉండాలి. కృతజ్ఞతగా మనంచేసేపూజ మన అదృష్టంగా భావించాలి. ఉదాహరణకు కోరిక నేరవేరిందని మొక్కుతీర్చుకొంటాం, దానిని మన విజయంగా భావించకూడదు. అదికూడా స్వామి నిర్ణయమే అనుకోవాలి.

పూజ ఇంద్రియవక్రతను సరిచేస్తుంది. చంచలమైన మనస్సును మనం అర్చనలోని ఆరాధన చూసి ఏకాగ్రతలోకి తేవటానికి ప్రయత్నం చేస్తాం, దేవునికి మనం సమర్పించే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అనే వాటిద్వారా కళ్లు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శ - ఇవన్నీ సుఖం పొందుతాయి. ఇది పంచోపచారపూజ’ ద్వారా పొందే ఆనందం.
Previous
Next Post »