దేనికైనా పరిహారం ఉంటుంది

     



      శ్లో॥ భస్మనా శుధ్యతే కాంస్యం తామ్రమమ్లేవ శుధ్యతి

      రజసా శుధ్యతే నారీ నదీ వేగేన శుధ్యతి॥



కంచుపాత్ర బూడిదతోను, రాగిపాత్ర చింతపులుసుతోను, స్త్రీ రజస్వల అయిన తర్వాత, నది తీవ్ర గమనం కలిగి(వరదతో) నిర్మలమగునని చాణుక్యుల వారు పై శ్లోకంలో తెలియచేసారు. ఈ శ్లోకంలో దుష్టుల ద్వారా దూషిత అయిన స్త్రీ రజస్వల అయిన శుద్ధమే.. అనగా అనేక కారణాలతో స్త్రీ దుష్టులచే బలాత్కరింపబడినను రజస్వలానంతరం శుద్ధియగును.

దీనికి అనుసంధానంగా ఇంకో ఉదాహరణ చెబుతున్నారు. ఉమ్మి, మలమూత్రాదులు, చెత్త చెదారంతో మలినమైనట్టిది ఒక బలమైన ప్రవాహంతో ఎలా పరిశుభ్రమగునో అలానే పవిత్రమవుతున్నది. ఇక్కడ అపరిశుభ్రమైన వానిని ఏదైనా మార్గంతో పరిశుభ్రం చేసినయెడల అది మరల ఉపయోగించడానికి అనువుగా ఉంటుందంటున్నారు. కంచుపాత్రను కొద్దికాలం వాడకుండా ఉండటం వల్ల అది కిలుం పట్టి వాడటానికి వీలుకాదు.



అటువంటి పాత్రను బూడిద, ఏ ఇతర పదార్ధాలతో గాని తోమితే శుభ్రపడుతుంది. అలాగే రాగిపాత్రను చింతపండును ఉపయోగించి  తుడిస్తే పాత్రపై ఉన్న మలిన పదార్థం అంతా పోయి కొత్త పాత్రలా మెరుస్తూ కానవస్తుంది. దాన్ని నిరాక్షేపంగా ఉపయోగించవచ్చు. పై పాత్రలను శుభ్రం చేసి ఏ విధంగా ఉపయోగకరంగా మార్చుకుంటామో అదే విధంగా ఏ కారణం చేతనైనా దుర్మార్గులతో ఆ స్త్రీ మలినమైన ఇక ఆమె ఈ సంఘంలో ఎందుకూ పనికి రాదని ముద్ర వేస్తారు.

కానీ ఇక్కడ చాణక్యుడు ఆమె కూడా పై వస్తువుల వలె ఉపయోగకరమే. దీనికి పరిహారం కూడా ఉందని తెలియచేస్తున్నారు. ఆమె తదనంతరం మరల రజస్వల అయిన తర్వాత తనలోని మలిన పదార్ధాలను విసర్జిస్తుందని ఆ తర్వాత ఆమెను  పరిశుభ్రంగా భావించి స్వీకరించవచ్చునని తెలియచేస్తున్నారు. ఇలా ఏ విషయానికైనా పరిహారం ఉంటుందని చాణక్యుల వారు తెలుపుతున్నారు. 
Previous
Next Post »