అందరివాడు అయప్ప





మన ఊరు - మన గుడి

‘స్వామియేయి శరణం అయప్ప’ అంటూ భక్తులతో మారుమోగుతుంది ఈ ధనుర్‌మాసం. ఎటువంటి అలవాట్లు ఉన్నవారైనా, మనసా వాచా కర్మణలతో త్రికరణ శుద్ధిగా నిత్యం భగవన్ నామ స్మరణతో, నియమ నిష్టలతో కఠిన దీక్షతో అయప్ప స్వామిని పూజిస్తారు, ధ్యానిస్తారు. 

ఈ అయప్పలు వారి మదిలోనే కాక చుట్టూ ఉన్న వారిలో కూడా భక్తిని పెంపొందింప చేస్తారు. అటువంటి స్వాములు నగరం మధ్యలో ఉన్న ఈ దేవాలయంలో ఒక్కచోట చేరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..



నియమ.. నిష్ట.. శ్రద్ధలతో భక్తులకు నిలయంగా నిత్యం అయ్యప్ప నామ స్మరణలతో మారుమోగుతూ భక్తులతో కిటకిటలాడే  అయప్పస్వామి దేవాలయం హైదరాబాద్ నగర నడిబొడ్డులోని సోమాజిగూడలో నిలయమై ఉంది.

కేరళ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయమైన శబరిమలై ఆలయం పూజావిధానంతో ఇక్కడ పూజలు జరుగుతూ భక్తులకు మరో శబరిమలైగా దర్మనభాగ్యం కలిగిస్తున్న ఈ అయ్యప్ప దేవాలయం సుమారు మూడు దశాబ్దాలకు పైగా 1984వ సంవత్సరంలో సంప్రోక్షణ జరిగింది.

కేవలం అయ్యప్పస్వామి చిత్రపటం కింద నిలయమైన ఈ దేవాలయం అనతి కాలంలోనే ప్రసిద్ధ దేవాలయంగా రూపొందింది. అయ్యప్ప దేవాలయ విధి విధానలతో పాటుగా ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన మండల పూజతో ప్రారంభమయ్యే అయ్యప్పస్వామి పూజా విధానాలు మకర సంక్రమణ జ్యోతి దర్శనం వరకూ కొనసాగుతాయి.

అయితే ఈ దేవాలయ ప్రాంగణంలో గణపతి, కుమారస్వామి, అమ్మవారి ఆలయాలు కొలువై ఉన్నాయి. ఇవి 365రోజులు భక్తులకు అందుబాటులో ఉంటాయి.

నిత్య హోమాలు, పూజలు

ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 గంటలకు తెరుచుకునే ఈ దేవాలయంలో నిత్యం గణపతి హోమం జరగడం ప్రత్యేకత. ప్రాముఖ్యత గల దినాలలో ప్రత్యేక గణపతి హోమం నిర్వహిస్తుండడం గత ముప్ఫు సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా నిత్యం పంచామృత అభిషేకం, మధ్యాహ్న పూజ, నివేదన కార్యక్రమాలు జరుగుతాయి.

సాయంత్రం 5:00 గంటలకు తెరుచుకునే ఈ దేవాలయంలో నిత్యకైంకర్యాలు యథావిధిగా సాగుతాయి. స్వామి వారి మండల పూజా విధానం ప్రారంభమైన రోజు నుంచి మకర సంక్రమణం వరకూ నిత్యం మధ్యాహ్నం పడిపూజ, అన్నదానం జరుగుతుండగా సాయంత్రం మహాపడిపూజ దీపారాధన అయ్యప్పస్వామి భక్తులతో పాటు అనేక మంది సాధారణ భక్తులకు కూడా అల్పాహార వితరణ జరుగుతోంది.



ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన జరిగే లక్షార్చన పూజ, 27వ తేదీన జరిగే రథోత్సవం, పుష్పాభిషేకం, జనవరి 1వ తేదీన ప్రత్యేక మహాగణపతి హోమం సంక్రాంతి పర్వదినాన జరిగే మహాపడిపూజ, మకర సంక్రమణ జ్యోతి దర్శనం అత్యంత వైభవంగా జరుగుతాయి. 

స్థల పురాణం

నగరంలోని ఎర్రమంజిల్ కాలనీ సమీపంలో ఒక టెంట్‌కింద పూజలు అందుకున్న ఈ అయ్యప్పస్వామికి ఆలయం నిర్మించాలన్న ఉద్దేశ్యంతో సుమారు 250 గజాలకు పైగా స్థలాన్ని రామశాస్త్రి అవధాని విరాళంగా ఇచ్చారు. ఈ స్థలంలో ఈ ఆలయ కమిటీ దేవస్థాన ప్రధాన పూజారి మురళీధర్ నంబూద్రి ప్రత్యేక చొరవ తీసుకుని ఆలయ నిర్మాణానికి దాతల సహాయంతో రెండు అంతస్థులలో ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఈ ఆలయంలో ఏర్పాటైన ప్రత్యేక వంటశాల ద్వారా స్వామి వారికి జరిగే కైంకర్యాలు పూర్తి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన ప్రారంభమయ్యే మండల పూజ నుంచి మకర సంక్రమణం రోజు వరకూ ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం అల్పాహార వితరణ చాలా సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా జరుగుతోంది.



దీనితో పాటు ప్రతి ఆదివారం మధ్యాహ్నం అన్నదానం, సమీపంలోని వివిధ ఆసుపత్రుల వద్ద రోగులకు వారి సహాయకులకు అన్నదానం నిర్వహిస్తారు. 

ప్రత్యేక పూజా విధానం

ఈ ఆలయ శంకుస్థాపన 1993వ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన శబరిమలై అయ్యప్పస్వామి దేవాలయం ప్రధానతంత్రి ఖండవారు ఆధ్వర్యంలో మురళీధర్ నంబూద్రి, ఇతర ఆలయ కమిటీ సభ్యులతో శంకుస్థాపన జరిగింది. ఆనాటి నుంచి శబరిమల దేవాలయం పూజా విధానం ప్రకారం మురళీధర్ నంబూద్రి ప్రధాన అర్చకుడి హోదాలో తాంత్రిక విధానంలో పూజలు నిర్వహిస్తారు.

వీరికి సహాయంగా కేశవ నంబూద్రి, రంజిత్ నంబూద్రి నిత్య పూజా విధానంలో సహాయ సహకారాలు అందిస్తారు. వీటితో పాటు ఈ దేవాలయం వ్యవస్థాపక దినం అయిన ఏప్రిల్ 25వ తేదీన, ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలలో వచ్చే స్వామి వారి జన్మ నక్షత్రం అయిన ఉత్తరా నక్షత్రం రోజున, ఏప్రిల్ 14వ తేదీన జరిగే విస్సు పూజ రోజున ప్రత్యేక కార్యక్రమాలు ఈ దేవాలయంలో జరుగుతాయి.



శ్రీరామనవమి రోజు ప్రత్యేక పూజలు, మహాశివరాత్రి రోజున ప్రత్యేక అభిషేకాలు జరపుతుండడం ఈ ఆలయం ప్రత్యేకత. ప్రతి సంవత్సరం మాలధారణ, ఇరుముడి కార్యక్రమం, మాల విసర్జన తదితర కార్యక్రమాలు నిర్వహించే వేలాది మంది భక్తులతో ఈ దేవాలయం కిటకిటలాడుతోంది. ఏవిధమైన ఇబ్బందులు భక్తులు ఎదుర్కోకుండా అర్చకస్వాములు, దేవాలయ కమిటీ అందరి ప్రశంసనలను అందుకుంటున్నారు. నామమాత్రపు ధరలతోనే మాలధారణ, ఇరుముడి కార్యక్రమాలు జరుగుతుంటాయి. 
Previous
Next Post »