వివాహం అయిన అమ్మాయిలు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వుంటుంది. కొత్త ఆచారాలు, కొత్త బంధుత్వాలు, కొత్త నియమ నిబంధనలను పాటించాల్సి వుంటుంది. మొత్తంగా చెప్పాలంటే.. ఆ అమ్మాయి తన పాత జ్ఞాపకాలను, పాత అలవాట్లను మర్చిపోయి మరో సరికొత్త మార్గాన్ని, తనదైన శైలిలో ఎంచుకోవాల్సి వుంటుంది. అమ్మాయి కాస్త అలవాటు చేసుకోవాలి మరి. ఎందుకంటే మీ అత్తగారికీ మీకీ మధ్య వయస్సు తేడా కూడా ఉంటుంది.
వారు పెరిగిన పరిస్థితులకు మీరు పెరిగిన పరిస్థితులకు ఎంతో తేడా ఉంటుంది. ఆ విషయాలన్నీ మీరు ముందుగా మననం చేసుకోవాలి. కానీ మీ అత్తగారు ముందు ఆ యింటికి కోడలిగానే వచ్చారు. ఆ విషయాన్ని మీరు సున్నితంగా ఆమెకి గుర్తు చేస్తూ కన్నతల్లి కంటే మీ అత్తగారిని లాలనగా చూసుకుంటే సమస్యే ఉండదు.. మరి ఆ అత్తాకోడళ్ల మధ్య గొడవలు ఎక్కువగా రాకుండా ఎలా ఉండాలో చూడండి.
వివాహం అయిన తర్వాత కొత్తగా అత్వారింట్లో అడుగుపెట్టినప్పుడు కొంతమంది అమ్మాయిలకు అత్తమామలతో ఎలా మెసలుకోవాలో తెలీదు. ఇటువంటివారు ఎటువంటి వరుసలకు విలువ ఇవ్వకుండా... అంటే అత్తమామలు, ఇతర బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా, తమదైన జీవితంలో ఎవడి అడ్డూ లేకుండా స్వేచ్ఛగా తమ జీవితాన్ని గడపాలనుకుంటారు. అత్తామామలు చెప్పిన విషయాలను పట్టించుకోకుండా, కేవలం తమ పనులను కానిచ్చుకుంటుంటారు. కానీ ఇలా చేయడం వల్ల తమ జీవితానికే చాలా ప్రమాదకరం. దీంతో తరుచుగా ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య గొడవలు అవుతుంటాయి. కొందరైతే ఒకరికొకరు కొట్టుకుంటారు కూడా. మరికొందరు తమ భర్తను తీసుకుని ఇల్లు వదిలి వేరే కాపురం పెడతారు కూడా. దీంతో బంధుత్వాలు తెగిపోవడమే కాకుండా, గౌరవమర్యాదలు కూడా మంటలో కలిసిపోతాయి.
కోడలికి కొంత సమయం ఇవ్వండి..
సాధారణంగా వివాహం చేసుకుని వచ్చిన ఒక కొత్త అమ్మాయికి కొత్త ఆచారాలను పాటించడానికి కొంత సమయం పడుతుంది. అటువంటి సమయాల్లో అత్తవారింటి నుంచి కూడా కొంతమేరకు ఆమెకు సహాయం చేయాలి. కోడలు అత్తను ఒక అమ్మలా భావించి, తను చెప్పే కార్యక్రమాలను నిర్వర్తించాలి. ఇలా చేయడం వల్ల అత్త కూడా చాలా సంతోషిస్తుంది. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు సంభవించవు.
పనులు ప్రేమగా చేసుకోండి..
సాధారణంగా ఒక అమ్మాయి తన అత్తవారింట్లో ఎంత పనిచేసినా... దానికి ఎవరూ ప్రశంసించరు. ఎందుకంటే ఎప్పుడైతే వివాహమయిందో అప్పుడు అత్తవారిళ్లే మీ సొంత ఇల్లు అవుతుంది కనుక. అక్కడా అంతా మీ సొంతవారే. అందుకే సొంతింట్లో ఎంత పని చేసినా అది మీ పనే అవుతుంది, అందుకే ఆ పనులు ఎవరూ అంతగా పట్టించుకోరు. అటువంటి సమయాల్లో మీరు ఇంట్లోని వారితో గొడవ పడకుండా, పనుల విషయంలో వాగ్వివాదాలకు దిగకుండా చురుకుగా వ్యవహరించాలి. మీరు మీ అత్తతో స్నేహాపూర్వకంగా కలిసిపోవాలి.
జ్ఞాపకాలను గుర్తుచేయండి..
మీ అత్తగారు ముందుచేసిన మంచి కార్యక్రమాలను గుర్తుచేసి, దాని గురించి మాట్లాడండి. దాంతో ఆమె పాత అనుభవాలను గుర్తు చేసుకుని సంతోషిస్తుంది. ఆమె పడిన కష్టాలను గుర్తించి, తన కొడుకుని ప్రయోజకుడిగా చేసినందుకు వారిని అభినందించండి... గౌరవించండి. దాంతో ఆమె మీతో ఓపికగా వ్యవహరించే అవకాశాలు చాలానే వున్నాయి.
కొంచెం పట్టించుకోండి..
పెళ్లయిన కొందరు వివాహితులు తమ అత్తమామల గురించి పట్టించుకోరు. అటువంటి సమయాల్లో వారికి చాలా బాధ కలుగుతుంది. దాంతో ఒకరికొకరి మధ్య మనస్పర్థలు ఏర్పడి నిత్యం గొడవలకు దారితీయొచ్చు. అలా కాకుండా వారికి తోడుగా వుండండి... వారి సలహాలను గుర్తించండి. దాంతో వారిలో మీ మీద ఒక మంచి భావన కలుగుతుంది.
బాధను పంచుకోండి
మామూలుగా కొందరి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. అటువంటి వాటిని మీ అత్తగారితో చర్చించండి. మీరు మీ జీవితంలో ఏ విధంగా అయితే భర్తకు ప్రాముఖ్యతను ఇస్తారో... అదే విధంగా ఇంట్లో వున్న ఇతరులకు కూడా ఇవ్వండి. అప్పుడు మిమ్మల్ని ఒక కోడలిగా కాకుండా, తమ సొంత కూతురిలా వారు వ్యవహరించుకుంటారు.
అత్తపై ప్రేమని కనబరచండి..
కొంతమంది తల్లీకొడుకులు చాలా స్నేహాపూర్వకంగా వుంటారు. ఆ సమయంలో మీరు కూడా స్నేహంగా కలవడానికి ప్రయత్నించండి. మీకు తన మీదున్న అభిమానాన్ని వ్యక్తమయ్యేలా చేస్తే... తనకు కూడా మీతో స్నేహాపూర్వకంగా, ఒక తల్లిలా వుంటుంది.
కోపంతో చెప్పేవారు మంచిని కోరుకుంటారు
మీ నుంచి ఏదైనా ఒక చిన్న తప్పు జరిగితే.. దానికి మీ అత్తగారు మందలించడం జరుగుతుంది. అప్పుడు మీరు వారిమీద అసూయ పెంచుకోకుండా వారు చెప్పిన మాటలను అర్థం చేసుకొని, మరోసారి తప్పులు జరగకుండా జాగ్రత్త పడండి. మీరు తనతో ఒక మంచి స్నేహితురాలుగా నడుచుకోవడం నేర్చుకోండి.
EmoticonEmoticon