మువన్నెల రుచులు

సమరయోధులు స్వాతంత్య్రాన్ని తెచ్చారు.  రాజనీతిజ్ఞులు రాజ్యాంగాన్నిచ్చారు.  మన దేశం, మన పాలన, మన వేడుక.రేపు రిపబ్లిక్ డే.  ప్రతి హృదయం నిండా... మూడు రంగులే.మనకు మాత్రం...  మూడు రంగులతో పాటు... ఆరు రుచులు.

                                                                     హ్యాపీ రిపబ్లిక్ డే!






తిరంగా పులావ్

మూడురంగుల వంటకాలు తయారు చేసుకుంటున్నాము కదా. మరి ఇవాళ ఏం చేద్దామంటారు?? అన్నం చేస్తే ఎలా ఉంటుంది.. ఇది కూడా చాలా ఈజీ .. మూడు ఆకర్షణీయమైన రంగులతో ఏంతో అందంగా ఉంటుంది..

కావలసిన పదార్ధములు

వండిన అన్నం  3 గ్లాసులు, ఉల్లిపాయ  2, పచ్చిమిర్చి  8, పుదీనా  1 కట్ట, టమాటాలు  2, పసుపు  చిటికెడు, పుదీనా ఆకులు  8, యాలకులు 6, లవంగాలు  8, దాల్చిన చెక్క  2 అంగుళం సైజు ముక్కలు, షాజీరా -2 టీస్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద -1 టీస్పూన్, జీలకర్ర  1/4 టీస్పూన్, నూనె -4 టేబుల్ స్పూన్లు.

తయారు చేయు విధానం

టమాటాలను చిన్నముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పుదీనా ఆకులు శుభ్రంగా కడిగి రెండు  పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అన్నాన్ని మూడు సమభాగాలుగా చేసుకోవాలి. ప్యాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొన్ని వేసి మెత్తబడేవరకు వేయించాలి.ఇందులో సగం అల్లం వెల్లుల్లి ముద్ద, పుదీనా ఆకులు, పసుపు కొద్దిగా గరం మసాలా వేసి వేపాలి. ఇందులో టమాట రసం  వేసి మరిగించాలి. తర్వాత ఒక భాగం అన్నం, తగినంత ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు వేయించి తీసిపెట్టుకోవాలి.  ఇది టమాటా రైస్.

ప్యాన్ శుభ్రం చేసుకుని వేడి చేసి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ముక్కలు,



నలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా గరం మసాలా దినుసులు వేసి రెండు నిముషాలు వేపాలి. తర్వాత ఇందులో ఇంకో భాగం అన్నం, తగినంత ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి. రెంఢు నిముషాలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.  ఇది జీరా రైస్.

ప్యాన్ శుభ్రం చేసి మిగిలిన నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు  వేయించాలి. ఇందులోగరం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత రుబ్బి పెట్టుకున్న పుదీనా ముద్దను  వేసి రెండు నిముషాలు వేయించాలి. ఇప్పుడు మిగిలిన అన్నం, తగినంత ఉప్పు వేసి కలుపుతూ కొద్దిసేపు వేయించాలి. బాగా కలిసాక దింపేయాలి. ఇది పుదీనా రైస్. ఒక ప్లేటులో ముందుగా ఆకుపచ్చ పుదీనా రైస్, పక్కన జీరా రైస్, ఎర్రని టమాటా  రైస్ పెట్టి నిమ్మకాయ, ఉల్లిపాయ చక్రాలతో అలంకరించి సర్వ్ చేయాలి.




మువన్నెల హల్వా 

కావలసినవి పదార్ధములు

బొంబాయి రవ్వ  3 కప్పులు, పంచదార -4 కప్పులు, యాలకుల పొడి  1 టీస్పూన్, క్యారట్ రసం -2 టీస్పూన్లు, పాలకూర రసం లేదా  పిస్తా రంగు -చిటికెడు,  పాలు -3 టీ స్పూన్లు, నెయ్యి  5 టీస్పూన్లు

తయారు చేసే విధానం : 

సగం నెయ్యి వేడి చేసి రవ్వను దోరగా వేయించాలి. దానిని మూడు భాగాలుగా చేసుకోవాలి. పంచదార కూడా మూడు భాగాలు చేసుకోవాలి. ప్యాన్‌లో కొద్దిగా నెయ్యి వేడి చేసి ఒక భాగం రవ్వ వేసి వేయిస్తూ అరకప్పుడు నీళ్లు పోయాలి. రవ్వ ఉడుకుతుండగా పంచదార, పాలకూర రసం లేదా పిస్తా గ్రీన్ రంగు వేసి కలపాలి.

రవ్వ మొత్తం ఉడికి దగ్గరపడ్డాక చిటికెడు యాలకుల పొడి కలిపి నెయ్యి రాసిన పళ్లెంలో వేసి వెడల్పుగా పరవాలి లేదా ఒక పక్కకు సర్ది పెట్టాలి. తర్వాత వేరే ప్యాన్‌లో మరి కొంచెం నెయ్యి వేడీ చేసి ఇంకో భాగం రవ్వ వేసి అరకప్పుడు నీళ్లు పోసి ఉడికించాలి. రవ్వ ఉడుకుతుండగా పాలు, పంచదార వేసి కలపాలి.



మొత్తం రవ్వ ఉడికాక చిటికెడు యాలకుల పొడి కలిపి ఇంతకు ముందు వేసిన రవ్వ పైన లేదా పక్కన సమానంగా సర్దాలి. ప్యాన్ కడిగి నెయ్యి వేడి చేసి మిగిలిన రవ్వ వేసి అరకప్పుడు నీళ్లు పోయాలి. ఉడుకుతుండగా క్యారట్ రసం లేదా కేసర్ రంగు, పంచదార వేసి కలపాలి.

మొత్తం దగ్గరపడ్డాక యాలకుల  పొడి కలిపి ఇంతకు ముందు వేసిన ప్లేట్లోనే తెల్లరంగు హల్వాపైన లేదా పక్కన ఈ ఎరుపు రంగు హల్వా వేయాలి. చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఈ హల్వాను పక్క పక్కన పెట్టొచ్చు లేదా ఒక రంగుపైన ఇంకో రంగు రవ్వను పరవొచ్చు. మధ్యలో పిస్తా లేదా జీడిపప్పు పొడితో చక్రంలా వేసి అలంకరించాలి.

రంగు రంగుల పూరీలు

మనం మువ్వన్నెల రుచులను ఆస్వాదిస్తున్నాం కదా. మరి ఇవాళ ఏం చేద్దామంటారు?? అందరికి ఇష్టమైన పూరీని రంగుల్లోకి మార్చేద్దామా?

కావలసిన పదార్ధములు

గోధుమ పిండి  3 కప్పులు, బీట్ రూట్ రసం  2 టీస్పూన్లు, పాలకూర రసం -2 టీస్పూన్లు, జీలకర్ర -1 టీస్పూన్, ఉప్పు -తగినంత, నూనె -వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం

గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, జీలకర్ర వేసి కలిపి మూడు భాగాలు చేసుకోవాలి. ఒక దాంట్లో బీట్ రూట్ తురిమి గట్టిగా పిండితే వచ్చే రసం కలిపి, తగినన్ని నీళ్లు పోసి  పూరీ పిండిలా తడుపుకోవాలి. ఒక భాగంలో ఏమీ కలపకుండా అలాగే నీళ్లు చల్లుకుంటూ పూరీపిండిలా తడుపుకోవాలి.

మూడో భాగంలో పాలకూర వేడినీళ్లలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి రసం తీసుకుని పిండిలో కలిపి కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ తడిపి పెట్టుకోవాలి. అన్నీ పిండి ముద్దలు మూతపెట్టి అరగంట అలాగే ఉంచాలి. తర్వాత తీసి బాగా మర్ధనా చేసి చాలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక్కో రంగు పిండి ముద్దను తీసుకుని మూడు రంగులు కలిపి ఒకే ఉండలా చేసి పూరీలా  వత్తుకుని వేడి నూనెలోకాల్చుకోవాలి. ఈ రంగుల పూరీలను కుర్మా లేదా ఏదైనా కూరతో సర్వ్ చేయాలి.

Previous
Next Post »