చీరకు మ్యాచింగ్ జాకెట్టు మాత్రమే ఉంటే సరిపోదు. ఆ జాకెట్టు కుట్టు ఒద్దికగా, ఒంటికి హత్తుకున్నట్టు ఉండాలి. అంతకుమించి కొత్త మోడల్ ఉండి తీరాలి. అప్పుడే చీర కట్టు చూడముచ్చటగా ఉంటుంది. జాకెట్టు ఇలాగే కుట్టించుకోవాలనే సంప్రదాయానికి చెల్లుచీటీ ఇచ్చేయండి.
అంతే కాకుండా పెళ్లిళ్ల సీజన్‌లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ చక్కర్లు కొడతాయి. పట్టుచీరలు అనగానే బ్లౌజుపై మగ్గం వర్క్, మిర్రర్ వర్క్.. అంటూ రకరకాల ఎంబ్రాయిడరీలు గ్రాండ్‌గా హల్‌చల్ చేస్తుంటాయి. అవేవీ లేకుండా సింపుల్ హైనెక్‌తో ఇలా హైగా కనిపించవచ్చు.
చీర రంగులోనే బ్లౌజ్ ప్యాటర్న్ ఉండేలా చూసుకోవాలి. దీనికి హై నెక్ పెట్టించాలి. చేతులకు అంచు వేయిస్తే చాలు. చెవులకు పెద్ద పెద్ద జూకాలు, మెడలో ఒక చోకర్ హారం లేదంటే లాంగ్ హారం అదీ కాస్త వెడల్పుగా ఉండేది ధరిస్తే చాలు మహారాణి కళ వచ్చేస్తుంది.
చీరకు పూర్తి కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని హై నెక్‌తో డిజైన్ చేయించుకుంటే చాలు. వేరే ఎంబ్రాయిడరీ అవసరమే లేదు. చెవులకు పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ లేదా బుట్టలు పెట్టేకుంటే మెడలో ఏం ధరించకపోయినా గ్రేస్‌గా కనిపిస్తారు.
గంధం రంగు చీరలకు ఎరుపు రంగు బెనారస్ క్లాత్ లేదా రా సిల్క్ క్లాత్‌తో డిజైన్ చేసిన హైనెక్ బ్లౌజ్ వేసుకుంటే చాలు. మెడలో గ్రాండ్‌గా కనిపించే టెంపుల్ అభరణాలు అలాగే చెవులకు పెద్ద పెద్ద బుట్టాలు అలంకరించుకుంటే వివాహ వేడుకలో గ్రాండ్‌గా వెలిగిపోతారు.
పట్టుచీర అంచు రంగులో గ్రాండ్‌గా కనిపించేందుకు బెనారస్ పట్టు ఫ్యాబ్రిక్ బాగుంటుంది. అలాగే కలంకారీ ఫ్యాబ్రిక్ బాగా నప్పుతాయి. హైనెక్ బ్లౌజ్‌తో ధరిస్తే సింపుల్ లుక్ అనిపిస్తూ హై ఫై ఫ్యాషన్ జాబితాలో ఉన్నారన్న కితాబు పొందవచ్చు. హై నెక్ వల్ల ఆభరణాల అలంకరణ అవసరం ఉండదు. నేటి తరం అమ్మాయిలు కోరుకునే గొప్ప స్టెల్‌గా హైనెక్ బ్లౌజ్ నిలిచియింది.
EmoticonEmoticon