మన సంతోషం.. సరదా.. హుషారు.. చురుకుదనం నిరంతరం మన వెన్నంటే ఉండేలా చూసేది మన గుప్పెడు గుండె. గుండె ఆరోగ్యంగా ఉన్నంత కాలం మనమూ చలాకీగా ఉంటాము. మరి మన గుండె ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం రోజూ తీసుకునే ఆహారం లో చిన్న చిన్న మార్పులు చేసి తీసుకుంటే గుండె జబ్బులు దరి చేరవు. ఏడాదిలో దాదాపు రెండు లక్షలకు పైగా గుండె జబ్బులతోనే మరణిస్తున్నారట. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎనభై శాతం వరకు మరణాన్ని అదుపు చేయవచ్చని అంటున్నారు నిపుణులు.
అదెలాగంటే మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు కాయ కూరలు, పండ్లు, గింజ ధాన్యాలు, చేపలు, నట్స్, ఆలివ్ ఆయిల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
ఎక్కువ సార్లు.. ఎక్కువెక్కువ..
రోజులో కనీసం పదిసార్లు పండ్లు,కూరగాయలు తినడం వల్ల కార్డియో వాస్క్యూలర్ నుంచి ప్రమాదం ఉండదని అంటున్నారు. గ్రీన్ వెజిటబుల్స్ ,పండ్లలో వుండే పీచు,విటమిన్లు, ఆంటీ యాక్సిడెంట్లు నేరుగా గుండెకు మేలు చేస్తాయట. పండ్లలో వుండే తీపిదనం. కూరల్లో వుండే కమ్మదనం రుచిని కలిగించడమే కాదు గుండెను మరింత బలోపేతం చేస్తాయి.
చేపా.. చేపా..
రెడ్ మీట్....అంటే మేక మాంసం అప్పుడప్పుడయితే ఫర్వాలేదు .అదేపనిగా వారానికి రెండు మూడు సార్లు తింటే మాత్రం చేదు ఫలితాలే ఎక్కువ. రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడి గుండె ను యిబ్బంది పెడుతుంది. మాంసానికి బదులుగా చేపలను తరచుగా తినడం వల్ల ఆర్టరీస్ సాఫీగా పనిచేసుకు పోతాయి. వారంలో రెండు సార్లు చేపలు ఒకసారి మాంసం తీసుకోవడం వల్ల ఒమేగా 3 కావలసినంత సమకూరి రక్త సరఫరాకు దోహద పడుతుంది.
మా మంచి నూనెలు..
వేపుళ్ళు మానేసి బట్టర్ ,చీజ్, పేస్ట్రీస్ కి ఫుల్ స్టాప్ పెట్టి వెజిటబుల్ ఆయిల్స్ ,ఎక్కువ మోతాదులో ఫైబర్ కార్బో హైడ్రాట్స్ కలిగి వున్న ఆలివ్ ఆయిల్,తక్కువ రిఫైన్డ్ చేసిన వంట నూనెలు వాడడం అలవాటు చేసుకోవాలి. రోజుకు మొత్తంలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వంటకు ఉపయోగించాలి. కూరలను ఆవిరి పై ఉడికించి పైనుంచి నూనె డ్రెస్సింగ్ చేస్తే గుండె గట్టి పడడం ఖాయం.
చిటికెడు చాలు...
రోజులో ఆహారంలో కి తీసుకునే ఉప్పు దాదాపుగా 9గ్రా చాలామందికి అలవాటు.. దీనిని 6 మి గ్రా లకు కుదించాలని అంటున్నారు నిపుణులు. ఉప్పు ఎక్కువగా తింటే రక్త పోటు తప్పదని అందరికి తెలుసు. రక్త పోటు తో పాటు చిన్న వయసులోనే వయసు పైబడిన లక్షణాలు చోటు చేసుకుంటాయి.
రోజూ ఎగ్ డే ..
ఒకటి కాదు రోజుకు రెండు గుడ్లు తప్పనిసరిగా తినాలని అంటున్నారు డాక్టర్లు. అబ్బా రెండా అనినీరసపడితే ఒంట్లో సత్తువ ఉండదని కూడా అంటున్నారు. గుడ్లతో పాటు పాలు పెరుగు.. మొదలైన పాల ఉత్పత్తులు రోజులో కనీసం రెండు మూడు సార్లు ఆహారం తో పాటు తీసుకుంటే 22%గుండె జబ్బులను, 34% గుండె పోటును, 23% గుండె పోటుతో జరిగే మరణాలను నివారించ వచ్చని కూడా సూచిస్తున్నారు. కాల్షియం, పొటాషియం సమృద్ధిగా లభించే పాల ఉత్పత్తులు గుండె పనితీరును మెరుగుపరిచి ఆరోగ్యాన్ని చేకూర్చుతాయి.
సంతోషాన్ని, బాధను, సంతృప్తిని, శాంతిని, భావోద్వేగాలను అణచిపెట్టాలన్నా, వ్యక్తం చేయాలన్నా, ఎదుటివారితో పంచుకోవాలన్నా గుండె గట్టిదై ఉండాలి. స్థితప్రజ్ఞత కలిగి ఉండాలంటే గుండెను పదిలపరుచుకోక తప్పదు. దానికి ఆరోగ్యకరమైన అలవాట్లే సరియైన దారి.
EmoticonEmoticon