న్యూమోనియాతో జాగ్రత్త





ప్రాణాంతకమైన లక్షణాలు కల వ్యాధులలో ఒకటి న్యూమోనియా. దీని గురించి చాలా మందికి అవగాహన తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాధి చాపకింద నీరులా నెమ్మదిగా వ్యాపిస్తుంది. ఊపితుత్తులపై సూక్ష్మజీవుల దాడి ఎక్కువైనప్పుడు వాటికి నిమ్ము చేరుతుంది. అది వర్షాకాలంలో తన ప్రభావాన్ని ఎక్కువ చూపే అవకాశం ఉంది.

అందుకే ఈ వ్యాధి లక్షణాలు తెలుసుకుని జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. చిన్నపిల్లల్లో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం మెండు. న్యూమోనియా తీవ్రతరమైతే ఊపరితుత్తలు పాడవడమే కాదు మిగతా అవయవాలన్నీ కూడా తీవ్రస్థాయిలో చచ్చుబడిపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాదు ఇది అంటువ్యాధి కూడా. అందుకని ఈ వ్యాధి సోకింది అనుకుంటే ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అంత మంచిది.





న్యూమోనియా అంటే ఊపిరి తిత్తులకు వచ్చే ఇన్‌ఫెక్షన్. ఇది బాక్టీరియా, వైరస్ లేదా రెండు కాని ఎటిపికల్ ఆర్గానిజమ్స్ వలన సాధారణంగా వస్తుంది. ఇది ఒకరి నుంచి ఇంకొకరికి కూడా రావచ్చు. రాకుండా ఉండాలంటే వ్యక్తి శారీరక, పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇది సాధారణంగా చలి, జ్వరం, దగ్గు, దగ్గులో కళ్ళెపడటం, ఆయాసం, ఛాతీలో నొప్పి, ఒక్కోసారి దగ్గులో రక్తం పడటం లాంటి లక్షణాలతో వస్తుంది.

మరికొందరిలో అయితే ఊపిరి తిత్తుల చుట్టూ నీరు లేదా చీము చేరుతుంది. నీరు ఎక్కువగా ఉండి ఆయాసం బాగా ఉన్నా, చీము అని నిర్ధారణ అయినా, పరీక్షలను ద్వారా నీరు తీసేయాలి అని నిర్ధారించినా, ఛాతీలోకి గొట్టం వేసి తీసేయాలి.

ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. షుగర్ ఉన్నా, గుండె లేదా కిడ్నీల జబ్బులు ఉన్నా, లివర్ సిర్రోసిస్ ఉన్నా, వయసు అరవై సంవత్సరాలకు పైబడినా, రెండు వైపులా న్యూమోనియా వచ్చినా, బీపి తక్కువగా ఉన్నా, కిడ్నీలు దెబ్బతిన్నా సీరియస్ న్యూమోనియా అని అంటారు. ఇలాంటి వారిని ఐ.సి.యు.లో చేర్చి ట్రీట్‌మెంట్ చేయాలి. కొందరిలో ఊపిరి తీసుకునే కండరాలు ఫెయిలవుతాయి. లేదా ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్‌డియస్) అనే ప్రమాదకర స్టేజ్‌కి వ్యాధి చేరుకోవచ్చు. అలాంటి వారిని వెంటిలేటర్ పై ఉంచి కోలుకునే దాకా కృత్రిమ శ్వాస అందించాల్సి ఉంటుంది.

న్యూమోనియా వర్గీకరణ..

న్యూమోనియాని కమ్యూనిటీ ఎక్వైర్డ్, ఆస్పిటల్ ఎక్వైర్డ్, హెల్త్‌కేర్ అసోసియేటెడ్,  వెంటిలేటర్ అసోసియేటెడ్ అని క్లాసిఫై చేశారు. ఇప్పటి వరకూ మనం తెలుసుకున్నది కమ్యూనిటీ ఎక్వైర్డ్ న్యూమోనియా గురించే.

ఆసుపత్రిలో ఉండగా వారికి 48 గంటల తర్వాత న్యూమోనియా వస్తే దానిని హాస్పిటల్ ఎక్వైర్డ్ అని, దీర్ఘకాలిక వ్యాధులు ఉండి లేదా మరి ఏ ఇతర కారణాలు వలన కాని ఇంటి దగ్గర కాని, హాస్పిటల్ నందు కాని నర్సింగ్ కేర్ లేదా పేషెంటుకి ట్యూబులు గాని, లైనులు గాని వాడుకలో ఉంటే, వారికి న్యూమోనియా వస్తే దానిని హెల్త్‌కేర్ అసోసియేటెడ్ అని అంటారు. ఇలాంటి న్యూమోనియాలన్నీ సీరియస్ న్యూమోనియాలే, వీటిలో డ్రగ్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. వీరిలో తగు పరీక్షలు చేసి మందులు వాడటం మంచిది.

వ్యాధి లక్షణాలు..

సాధారణంగా పై లక్షణాలు కనపడిన వారికి రక్త పరీక్షలు, కళ్ళె పరీక్షలు, ఛాతీ ఎక్స్‌రే తీసి న్యూమోనియాగా నిర్ధారిస్తారు. న్యూమోనియా అని అనుకున్నప్పుడు ఎంత తొందరగా యాంటిబయోటిక్ మందులు వాడటం ప్రారంభిస్తే అంత మంచిది. మందులు కూడా అన్ని రకాల క్రిములను చంపే విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. చుట్టు పక్కల ప్రాంతాలలో క్రిములకి డ్రగ్ రెసిస్టెన్స్ ఎంత ఉంది అనే విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే మందులు వాడుతున్నా జబ్బు ముదిరి సీరియస్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకసారి సీరియస్ అయ్యిందంటే ఖర్చు పెరుగుతుంది. దానితోపాటు ప్రాణహాని పెరుగుతుంది. అంతేకాకుండా ఐ.వి.ఫ్లూయిడ్స్, అవసరమైతే ఆక్సిజన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటికీ గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఎంత తొందరగా పల్మోనాజిస్ట్ (ఛాతీవైద్యులు)ని సంప్రదించి మందులు వాడితే అంత మంచిది.
Previous
Next Post »