ఉదయం లేవగానే బ్రష్ చేసి ఒక గ్లాస్ నీటిని తాగే అలవాటు చాలామందికి ఉండదు, కాని తప్పకుండా చేసుకోవాల్సిన అలవాటిది. నిద్రలేవగానే కాఫీ లేదా టీలతో రోజును మొదలెట్టే కంటే కాసిన్ని నీళ్లు కడుపులో పడేస్తే ఆరోగ్యానికి సోపానం వేసినట్టే. ఆ తర్వాత డైలీ రొటీన్ లో పడి బ్రేక్ ఫాస్ట్ చేసి ఆఫీసుకు బయలుదేరే క్రమంలో గ్లాసుడు నీళ్లు తాగడం మర్చిపోయేవారు కూడా ఉంటారు. ఇంటి నుంచి బయటపడిన తర్వాత దాహం గుర్తుకు వస్తుంది. వెంట వాటర్ బాటిల్ ఎండాకాలంలో తప్ప మిగిలిన ఏడాదిలో ఉండదు.
ఆఫీస్‌కు వెళ్లాక తాగుదాం అని వాయిదా వేస్తారు. ఆఫీస్ కి వెళ్లగానే నీళ్లు తాగుదాం అనుకుంటూనే రెండోసారి టీ తాగేస్తారు. పనిలో పడిన తర్వాత ఎప్పుడో మళ్లీ గుర్తుకు వస్తుంది దాహం. రెండు గుక్కలు తాగి మరో టీ కి సిద్ధమవుతారు. దాదాపుగా ఇలాగే ఉంటుంది ఏసీలో పని చేసే చాలామందికి. మధ్యాహ్న భోజనం తర్వాత ఓ అరగ్లాస్ నీళ్లు తాగితే చాలా ఎక్కువ.
మధ్యాహ్నానికి తలనొప్పి మొదలు, దానికి ఏ తలనొప్పి మాత్రో వేసుకుని వేడి టీ తాగుతారు తప్ప అప్పటికైనా ఒంటికి కావలసినంత నీటిని తీసుకుందాం అనే ఆలోచనే చేయరు. నీరు తాగకపోవడంతోనే తలనొప్పి వచ్చింది అంటే ఒప్పుకోరు కూడా. అయితే అది నీళ్లు చాలకపోతే ఎదురయ్యే కష్టమే. నీళ్లు సరైన మోతాదులో తీసుకోవడం లేదని చెప్పే కొన్ని లక్షణాలివిగో...
తలనొప్పి
దేహానికి నీరు తగినంతగా అందకపోతే రక్తంలోని నీటిని పీల్చుకుంటుంది. దాంతో రక్తప్రసరణ వేగం తగ్గిపోతుంది. మెదడుకు రక్తసరఫరా సరిగ్గా అందదు. మెదడుకు రక్తం అందకపోవడంతో ఆక్సిజన్ కూడా సరిపడినంత అందదు, తలనొప్పి వస్తుంది. ఈసారి మీకు తలనొప్పి వస్తే టాబ్లెట్ వేయడానికి ముందు ఒక గ్లాస్ నీటిని తాగండి.
చర్మం, కళ్లు పొడిబారడం
నీరు తగినంత అందనప్పుడు నోరు తరచుగా తడారిపో తుంటుంది. ఒంట్లో నీరు తగ్గిపోతే చర్మం పొడిబారి పోతుంది. కళ్లు కూడా పొడిబారుతాయి. నోరు తడారిపోవడం మొదటి లక్షణం. దీనిని గుర్తించిన వెంటనే సోడా, కాఫీలు మానేసి వాటికి బదులు నీటిని తాగాలి.
మూత్రం డార్క్ ఎల్లోగా...
యూరిన్ కలర్ డార్క్‌గా ఉందంటే మరొక లక్షణం కనిపించే వరకు ఆగాల్సిన అవసరమే లేదు. వెంటనే పావు లీటరు లేదా అరలీటరు నీటిని తాగాల్సిందే.
ఆకలిగా అనిపించడం
ఒంట్లో నీరు తగ్గినప్పుడు మెదడు నుంచి అందే సంకేతాలు తప్పుగా ఉంటాయి. ఒక్కోసారి ఆకలిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పటికి గంట కిందటే ఫుల్‌గా భోజనం చేసి ఉన్నా సరే, ఆకలి అనిపిస్తుంది. వెంటనే ఏదో ఒకటి తినాలని కూడా అనిపిస్తుంది. తినడంతోపాటు నీటిని తాగుతారనే ఉద్దేశంతో బాడీ విడుదల చేసిన సిగ్నల్ కావచ్చు. అలాంటి సమయంలో మొదట నీటిని తాగాలి.
జీర్ణవ్యవస్థ పనిచేయకపోవడం
జీర్ణక్రియలో తేడాలు వచ్చినప్పుడు మామూలుగా తాగే నీరు సరిపోదు, శరిరానికి అదనంగా నీరు కావాలి, అన్నం సరిగ్గా జీర్ణం కాలేదనిపించినప్పుడు, పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు, మలబద్దకం ఉన్నప్పుడు కూడా ఎక్కువ నీటిని తాగాలి.
బరువు పెరగడం
తగినంత నీరు అందకపోతే దేహం జాగ్రత్తపడడం మొదలు పెడుతుంది. అందిన నీటిని రొటీన్ క్రియలకు విడుదల చేయకుండా దేహం నిల్వ చేసుకోవడం మొదలుపెడుతుంది. అది బరువు పెరుగుదలకు దారి తీస్తుంది.
EmoticonEmoticon