ఆపదలకు దూరంగా.. ఒంటరి ప్రయాణం..!





పూర్వకాలంలో అయితే మహిళలు వంటగదికి మాత్రమే పరిమితమయ్యే వారు. దాంతో వారు బయటికి ఎక్కువగా వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారు. ఉద్యోగాలు చేసేందుకు చాలా దూరం వెళ్లాల్సిన పరిస్థితి నేటి యువతది. మరి అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు దేశాలు దాటి వెళ్లే అవకాశలు వచ్చినప్పుడు, ఒంటిరిగా ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో తెలుసుకొని సిద్దం కావడం మంచిది.

కొలువులు ఎలాంటివైనా ఒకేచోట స్థిరంగా ఉండే అవకాశాలు తక్కువ. భార్యభర్తలకు ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఒకరు అటు, ఇంకొకరు ఇటు అలాంటి పరిస్థితుల్లో వివాహితులు కూడా ఒంటరి ప్రయాణాన్ని కొనసాగించక తప్పట్లేదు.




వస్తువులపై ధ్యాస..

మీరు మీ వస్తువులను దగ్గరగానే ఉంచుకోండి. చూడగలిగేంత దగ్గర ప్లేస్‌లోనే  లగేజ్‌ను భద్రపరుచుకోవాలి. ఏమరపాటున కూడా అశ్రద్ద చూపకూడదు. వాటిమీద ఒక చూపు ఉంచడం మంచిది. మంచిగా మాట్లాడుతూ మాటల్లోనే వస్తువులను మాయం చేసేవారి సంఖ్య పెరిగింది. కాబట్టి నిద్రపోకుండా కాస్త మెలుకువగా, అలర్ట్‌గా ఉండాలి.

ఎవరేం ఇచ్చినా తినొద్దు..

అపరిచితుల వద్ద నుండి ఏమి అంగీకరించొద్దు. ఒకవేళ ఎవరైనా బిస్కెట్స్ లేదా పండ్లు కాని ఇస్తే, మర్యాదగా తిరస్కరించండి. మీరు తీసుకెళ్లిన వాటిని మాత్రమే తినాలి.

పర్స్ జాగ్రత్తగా..

మీ పర్స్ ఎప్పుడు మీ దగ్గరే ఉంచుకోవాలి. డబ్బును ఒకే చోట కాకుండా ఒక్కోచోట కొన్ని కొన్నిగా జాగ్రత్త చేయడం మంచిది. సైడ్ పాకెట్‌లలో, వెనుక జేబులో కూడా కొంత డబ్బు దాచండి. ఎందుకంటే అత్యవసరం అనుకోని పరిస్థితుల్లో ఏదైనా సంఘటన జరిగినా ఆపద నుండి బయట పడేందుకు అవసరమైతుంది.

అపరిచితులతో పరిచయాలొద్దు..

అందరితో కలిసిమెలిసి ఉండడానికి ఇష్టపడేవాళ్లునా కాస్త ఇతరులతో అప్రమత్తంగా ఉండగలగాలి. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు అందరితో కలిసేందుకు బదులుగా దూరంగా ఉండడమే ఉత్తమం. ఎవరితోనూ ముచ్చట్లోకి దిగొద్దు. ఒకవేళ ఎవరైనా మీతో మాటలు కలిపి సంభాషణను పొడిగించినా కొంత మేర తక్కువగా మాట్లాడి, వ్యక్తిగత వివరాలను తెలియనీయకుండా మాట్లాడాలి.

ఒంటరిగా వద్దు..

రైలులో కానీ బస్సులో కానీ అనుమానాస్పదంగా కనిపిస్తున్న మగవారు ఉన్నట్లుగా అనిపిస్తే, వెంటనే తోటి ఆడవారు ఉన్న చోటుకి వెళ్ళాలి. ఒకవేళ మీకు ముందున్న, వెనుక వారితో ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపిస్తే, వెంటనే సీట్ మారడం మంచిది.

మీపై మీరు నమ్మకంగా..

ఏదైన కొత్త ప్రదేశాలకు మొదటిసారిగా వెళుతున్నప్పుడు, వెళ్లినా అంతా తెలుసుగా అన్నట్లుగానే వ్యవహరిచాలి. బిత్తర చూపులు చూస్తుంటే ఇతరులకు కొత్త అని అర్థమైపోతుంది. దాంతో ఇబ్బంది కలిగించవచ్చు.

లైట్ జర్నీ..

జర్నీనే పెద్ద సమస్య. అందులో ఎక్కువ లగేజ్ ఇంకో సమస్యగా మారుతుంది. కాబట్టి ఒంటరిగా వెళ్లేప్పుడు కొన్ని అవసరమైన వస్తువులను మాత్రమే తీసుకొని వెళ్లడం మంచిది. దాంతో జర్నీ కూడా చాలా సులభంగా ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో డబ్బు, నగలను అస్సలు తీసుకెళ్లవొద్దు.

వస్త్రధారణ

సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం అవసరం. వస్త్రధారణ వారి వారి ఇష్టాన్ని సౌలభ్యాన్ని బట్టి ఎంపిక చేసుకున్నప్పటికీ ఎదుటివారి దృష్టిని ఆకర్షించకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. పదేపదే పైట సవరించుకోవడం, వదులు దుస్తులను సరిచేసుకోవడం, అసౌకర్యంగా అసహనంగా ఫీలవ్వడం వల్ల మీరు ఎదుటివారి దృష్టిలో పడతారు. దుస్తులు ఏవయినా మినీస్, మిడ్డీస్, కుర్తా పైజామా, జీన్స్, చీరలు మీకు సౌకర్యాన్ని ఇవ్వాలి. ధరించిన దుస్తులపై ఏమాత్రం శ్రధ్దపెట్టకుండా కేర్‌ఫ్రీగా ఉన్నప్పుడే ధీమాగా ప్రయాణం చేయగలుగుతారు.



Previous
Next Post »