ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషికి ఏమున్నా, ఎన్నున్నా ఆరోగ్యంగా లేకపోతే ఎందుకూ పనికిరాడు ఇంటిని చూసి, ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు. ఎందుకంటే? ఇంటి శుభ్రత ఎక్కువగా ఇల్లాలికే తెలుసు, ఎక్కువ ఇల్లాలిపై ఆధారపడిపడి ఉంటుంది. ఏ వస్తువు ఎక్కడ ఉండాలి? ఏది ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి?అనే విషయాలు ఇల్లాలికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఇంటిని ఎంత చక్కగా దిద్దుకుంటే, అంత అందంగా ఉంటుంది. అందుకే ఇంటిపై ఎక్కువ శ్రద్ధ చూపండి, ఒక వ్యక్తి శుభ్రత ఒకరికే మంచి చేస్తుంది.
ఒక ఇంటి శుభ్రత కుటుంబం మొత్తానికి మంచి చేస్తుంది. సామాన్లు చిందరవందరగా పడేస్తే చాలా చికాకు అనిపిస్తుంది. గదిలో ముప్పావు భాగం లేదా సగభాగమైనా ఖాళీగా వదిలేస్తే చూడటానికి విశాలంగా కనిపిస్తుంది. గదులన్నీ సామాన్లతో నింపేస్తే ఎంత విశాలమైన ఇల్లయినా చిన్నదిగానే కనిపిస్తుంది. మీరు జాబ్ చేసే మహిళలైనా, లేదా కొత్తగా కాపరం పెట్టుకున్నవారైనా ఇంటి నిబంధనలు పాటించాల్సిందే, ఇంట్లో కొన్ని వస్తువులు ప్రతిరోజూ శుభ్రం చేయాలి, లేకుంటే మీకే చికాకు కలిగిస్తాయి. కొంతమంది దేనినైనా సరే వారానికోసారి, శెలవు రోజులో చేద్దామని వదిలేస్తారు. కానీ, అది సరికాదు. ప్రతిరోజూ శుభ్రపరచుకోవాల్సిన వస్తువులేమిటో చూడండి.
సోఫా సెట్ దుమ్ము దులపటం:
చాలామంది వారానికొకసారి దులుపుదామనుకుంటారు. దుమ్ము పట్టిన సోఫాలు, టీపాయ్ వంటివి మన ఉపయోగానికే అసహ్యం పుట్టించేవిగా వుంటాయి. ప్రతిరోజూ వాడే వస్తువుల దుమ్ము దులపటమనేది అవసరంగా భావించండి.
వంట గిన్నెలు:
మీరు ఏ డిష్ చేసినప్పటికి, గిన్నెలను వీలైనంత త్వరగా, కనీసం 10 లేదా 12 గంటలలోపు శుభ్రం చేసేయండి. లేదంటే, అవి వాసన కొట్టటమే కాక, అనారోగ్యాన్ని కూడా కలిగిస్తాయి.
డైనింగ్ టేబుల్:
మీరు దీని ముందు తినటానికి కూర్చుంటారు. కనుక ఇది శుభ్రంగా వుండాలని చెప్పనవసరం లేదు. వాటిపై ఆహార పదార్ధాలు, మరకలు, ఎన్నో వుంటాయి. వారాంతంలో చేద్దామనుకుంటే చాలా అసహ్యంగా తయారవుతుంది. కనుక ఒక తడి గుడ్డను తీసుకొని వీలైనంత త్వరగా తుడిచేస్తే మరకలు మాయమై డైనింగ్ టేబుల్ క్లీన్‌గా ఉంటుంది.
కిచెన్ సింక్:
దీనిలో వంట పాత్రలను శుభ్రం చేస్తాం. కనుక సింక్ కూడా శుభ్రంగా ఉంటే, పాత్రల శుభ్రత మరింత బాగుంటుంది. ప్రతిరోజూ శుభ్రం చేయాల్సిన వాటిలో ఇది ప్రధానమైంది.
కిచెన్ స్లాబ్ దానిపై ఉండే స్టవ్:
వంట పూర్తయిన తర్వాత, గ్యాస్ స్టవ్, కిచెన్ స్లాబ్‌ని తప్పక శుభ్రం చేయండి. అక్కడ ఏ మాత్రం మురికి లేదా పదార్ధాలు పడి వున్నా తినే ఆహారం అనారోగ్యానికి దారితీస్తుంది.
బెడ్స్:
బెడ్స్ ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి, బెడ్ షీట్ మార్చకపోయినప్పటికీ దులపటం, తలగడలు సరి చేయటం, రాత్రి కప్పుకున్న దుప్పటి మడత పెట్టటం వంటివి తప్పక చేయాలి. మరల పడుకునే సమయంలో శుభ్రపరచిన బెడ్ పై పడుకోవటం మానసికంగానూ, శారీరకంగానూ హాయిని కలిగిస్తుంది. ప్రతిరోజూ శుభ్రం చేసుకుంటే, పండుగలపుడు, ఇంట్లో ఏదైనా సందర్భాలు వచ్చినపుడు పని కూడా తక్కువగా ఉంటుంది.
కిచెన్ టవల్స్ అండ్ స్పాంజ్:
వంటగది పరిశుభ్రతే ఇంటిల్లిపాదిని ఆరోగ్యంగా కాపాడుతుంది. కాబట్టి, వంటగదిలోని టవల్స్, స్పాంజ్ లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి.
ఈ విధంగా ఇంటిని శుభ్రంగా ఉంచడం వల్ల ఇంటికి అందం, మీకు మానసిక ఆనందాలతో పాటు చక్కని ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు
EmoticonEmoticon