చికాకులోనే ఇంటిని సర్దేయండి.





చికాకు, కోపం, ఆవేశం ఇవన్నీ మనిషికి మామూలే. నిత్యం ఏదో ఒక విషయంలో దేన్నో ఒక దానిని ఎదుర్కోవడం సహజంగా జరిగేదే. కొన్ని సందర్భాలలో ఆడవారికి కలిగే విసుగుతో కాస్త సతమతమవుతారు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియదు. ఏం చేస్తే చికాకు తొలగిపోతుందో అర్థం కాదు. ఇలాంటి సందర్భాల్లో నిత్యం చేసుకునే పనినే ఆ రోజు కొత్తగా మొదలు పెట్టండి. దాంతో చికాకు చిగురంత కూడా ఉండదు. మరి ఆ పనేంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఎందుకు ఆలస్యం చదివేయండి.



మీకు ఎప్పుడైనా కారణం లేకుండా చిరాకుగా అనిపిస్తే ఒక్కసారి ఇల్లు శుభ్రంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. అకారణంగా వచ్చే కోపం, చిరాకులకి ఇల్లు శుభ్రంగా లేకపోవటం కూడా ఒక కారణం అంటున్నారు పరిశోధకులు. ఇల్లు శుభ్రంగా పెట్టుకోకపోతే ఎదో తెలియని చిరాకు, ఒత్తిడి వంటివి ఇబ్బంది పెడతాయట.

దొరికిన టైమ్‌లోనే సర్దేయండి..

ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, దొరికిన సమయంలోనే ఇంటిని చక్కగా సర్దుకోవటం మంచి అలవాటు. ఎక్కడి వస్తువు అక్కడ పెట్టడం, అవసరమైన వస్తువు కనిపించేలా పెట్టుకోవడం, ఇవన్నీ మన జీవితంపై మనకున్న శ్రద్ధని చూపిస్తాయట. ఎక్కడి వస్తువులు అక్కడ పడేస్తూ, తిరిగి సర్దుకుంటూ, మళ్ళీ పాడుచేస్తూ ఇలా ఓ పధ్ధతి పాడు లేకుండా ఉండే వాళ్ళు తప్పనిసరిగా ఇల్లుని సర్దేయాలంటున్నారు.

క్రమశిక్షణగా సాగిపోతుంది..

జీవితం ఒక పద్ధతిలో సాగిపోవాలంటే, ముందు ఇంటి నుంచే మొదలు పెట్టమన్నారు పెద్దలు. ఎప్పుడైతే ఇంటిని పొందికగా, చక్కగా సర్దుతూ దానిని రోజు అలాగే శుభ్రంగా ఉంచుకుంటామో, ఆ క్రమశిక్షణే నెమ్మదిగా తమపై తమకు శ్రద్ధని చూపుతాయట. దీనివల్ల జీవితంలో చేసే ప్రతి పనిలో కూడా ఈ క్రమశిక్షణ అలాగే అలవాటుగా కొనసాగిపోతుంది.

చికాకులో చీపురే మార్గం..

విపరీతమైన కోపం లేదా చికాకు వంటివి ఇబ్బంది పెట్టే సంఘటనల నుంచి తప్పించుకోవటానికి తక్షణ మార్గం ఏమిటంటే? చీపురు పట్టుకొని ఇల్లు మొత్తం దులిపెయ్యడమే.

ఆ పని పూర్తయ్యేలోపు మనసులోని కోపం, చికాకు లాంటి కొన్ని ఉద్వేగాలు తొలగిపోతాయి. కాబట్టి ఇలా  చేయడం వల్ల అనవసరంగా వచ్చే కోపం, చికాకులు తగ్గిపోతాయి. ఆలోపు చేసే పనిలో ఇల్లు సర్దే పని కూడా పూర్తయిపోతుంది. అలాగే ఇల్లు ఇంటి వాతావరణం శుభ్రంగా, అందంగా ఉంటుంది. కాబట్టి ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మర్చిపోవద్దు.
Previous
Next Post »