ఉదయం లేచినప్పటి నుండి మళ్ళీ నిద్రపోయేంత వరకూ ఏదో ఒక విషయాన్ని మాట్లాడుతూ, ఆలోచిస్తూనే ఉంటాం కదా! కాసేపు మౌనంగా ఉండడం అంటే అబ్బో ఊహించుకోలేము. కానీ సాధ్యమే నండీ... శరీరానికి కావాల్సిన ఆరోగ్యం, మెదడుకు కావాల్సిన ప్రశాంతతని చేకూర్చేది మౌనమేనని రుజువైంది. మౌనంతో మేలు జరుగుతుందంటే ఎవరు కాదంటారు. మౌనం మంచిదేనని తెలుసుకోవాలంటే పాటించి చూడాల్సిందే...
రోజూ ఒక్క అర గంట మౌనంగా ఉంటే చక్కటి శారీరక మానసిక ఆరోగ్యం మీ సొంతం అవ్వటమే కాదు. ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు అన్ని నెరవేరుతాయని చెబితే నమ్మగలరా? నమ్మలేం కదూ? కానీ ఇది నిజం. అదెలా సాధ్యమంటే, ప్రయత్నిస్తే తెలుస్తుంది సాధ్యమా కాదా అనేది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎంత సేపు మాట్లాడతాం.. ఎప్పుడైనా లెక్కేశారా.. పోనీ ఎంత సేపు మౌనంగా ఉండగలరో ప్రయత్నించారా.. ఓసారి ట్రై చేద్దామా..
పదే.. పది నిమిషాలు..
మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ, లేదా టీ.వీలోని కార్యక్రమాన్ని చూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చొని ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ సైలెంట్‌గా ఉన్నా కదా అంటే ఇది కాదు మౌనమంటే. అచ్చంగా మౌనంగానే ఉండగలగాలి. పనులు అన్నీ చేస్తున్నపుడు నోరు మాట్లాడకపోయినా, మనసు అలోచనల్లో పరుగులు తీస్తూనే ఉంటుంది. ఆ ఆలోచనలు మనల్ని మన నుంచి వేరుగా ఉంచలేవు. కాబట్టి కళ్ళుమూసుకుని మాటని, మనసుని మౌనంలోకి జార్చితే చాలు. అలా ఓ పదినిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే మనసు హాయిగా, ప్రశాంతంగా ఉంటుందట.
మౌనంతో మాటలు వస్తాయి..
మౌనం.. మనల్ని మనకు దగ్గర చేస్తుంది. రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు, అరుపులు... అక్కడితో అయిపోతుందా.. లేదు. అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వదిలించుకోవటం ఎలాగంటే సింపుల్. కాసేపు మౌనంగా కళ్ళు మూసుకోవటమే. దాన్ని ధ్యానమనండి, మెడిటేషన్, ప్రాణామాయం ఏదైనా కావచ్చు ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు. అ తరువాత అంతక ముందు వరకు ఉన్న చికాకు ఇట్టే మాయమవుతుంది. అంతే కాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు కూడా చక్కగా వస్తాయట.
ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది..
మౌనంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ఉండే వారి మాటలు సూటిగా, స్పష్టంగా ఉంటాయి. బెరుకు, బెదురు అనవసరమైన కబుర్ల లాంటి వృధా సమయం వీరికి ఉండదు. ఈ అలవాటు ఎదుట వ్యక్తులకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచి తూచి మాట్లాడటం చేతకాని తనం కానే కాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును, నమ్మకాన్ని తెలియచేస్తుంది. చేజారిన కాలం, పెదవి దాటినా పలుకు వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి. అందుకు మౌనంతో సాధ్యమైతే మాటల్లో నోరు జారకుండా అదుపు చేసే ఆలోచనా శక్తి పెరుగుతుందన్న మాట.
పరిస్థితులను ఆపగలిగేది..
ఉదయం లేచిన దగ్గుర్నుంచి అన్ని రకాల అనుభూతులు, భావాలు, ఆలోచనలు పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మనస్సుపై పడుతుంది. దాంతో ఒత్తిడి, చికాకు మొదలై మన మాటలపై, చేతలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా సంబంధాలలో కోపతాపాలు, ఆరోపణల మధ్య ఇరుక్కుంటాయి. వీటన్నింటి ప్రభావం మనస్సుపై చక్రంలా తిరిగినట్టు ఒకదాని వల్ల మరొకటి ఏర్పడి ప్రమాదాల్లో చిక్కుకునేలా చేస్తాయి.
ఈ చక్రాన్ని ఆపే అవకాశం మన చేతుల్లోనే వుంది. అదే ‘మౌనం’. ఆ మౌనంలో ఏ అలోచనలు ఉండకూడదు. ప్రశాంతంగా మనసుతో మమేకమై , ఓ పదినిమిషాలు అయినా ఉండగలిగితే చాలు. ఫలితం ఏమిటన్నది చెప్పటం ఎందుకు, ఇక మీరే తెలుసుకోవచ్చు. ఒకసారి అ ప్రశాంతతని రుచి చూసాక దాని గరించి మీరే మరో పదిమందికి చెబుతారు.
EmoticonEmoticon