బంధాలు నాజూకైనవి...




మనిషి సంఘజీవి. బంధాలు నాజూకైనవి.. ఈ విషయం జగమెరిగిన సత్యం. కలసివుంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. కాని నేడు మనిషి తన స్వార్థంతో తనకు తానుగా చుట్టూ కాంక్రీట్ నిర్మాణాన్ని నిర్మించుకుంటున్నాడు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు తప్ప తన వాళ్లు గుర్తుకు రావట్లేదు. ఆతర్వాత పశ్చాత్తాపం చెందడం నేడు సర్వసాధారణమై పోయింది. ఈ యాంత్రిక జీవనంలో తనూ ఓ యంత్రంలా మారిపోయాడు మనిషి.

మనీతోనే సంబంధం అని మనిషి తనలోని మానవత్వాన్ని మరచి బంధాలను తెంచేసుకుంటున్నాడు. దీంతో కన్నవాళ్లను కూడా కాదనుకుని రెక్కలొచ్చిన పక్షిలాగా ఎగిరిపోతున్నాడు. తమ పిల్లలకు వారి బంధువులను తమవద్దవున్న ఫోటోలద్వారా పరిచయం చేసుకునే పరిస్థితి దాపురించింది. 





బంధాలు సన్నని దారంలాంటివి. ఆ దారం తెగితే మళ్ళి ముడివెయ్యాలంటే అది సహజంగా వుండదు. అలాంటిదే ఈ మానవ సంబంధాలు. ఈ బంధాలుకూడా ఎన్నో ఏళ్లతరబడి కొనసాగినా కాసింత మాట పట్టింపువల్ల బెడిసికొట్టే పరిస్థితి తలెత్తకూడదు. బంధాలలో అపనమ్మకాలు ఉండకూడదు. అపనమ్మకం ఉంటే ఆటుపోట్లు తప్పవు. 

* బంధాలు తెగిపోయినప్పుడు మానసిక క్షోభ తీవ్రాతితీవ్రంగావుంటుంది. నిరాశా నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతుంటారు. కాని ముందుగానే మానసికంగా బంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటూవస్తే ఏ సమస్యా ఉండదంటున్నారు మానసికవైద్యనిపుణులు. 

* మనకెవరిపైనైనా ఇష్టం కలిగినప్పుడు వారి ప్రేమ బంధంలో ఇమిడి పోవాలనిపిస్తుంది. ఈ బంధం ఎంత త్వరగా గట్టిపడుతుందో అంతే త్వరగా విడిపోయే ప్రమాదంవుంది. అది వారిపట్లవున్న ఆకర్షణ మాత్రమే తప్ప నిజమైన ప్రేమ ఏ మాత్రం కాదంటున్నారు విశ్లేషకులు.

ఒకరినొకరు అర్థం చేసుకోవాలి...

* ఎవరితోనైనా అనుబంధం కొనసాగించేటప్పుడు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బంధాలు దృఢపరచుకోవడానికి ముందుగా ఒకరిపై మరొకరికి నమ్మకం కలగాలి. 

* ఒకరిపట్ల మరొకరికి వున్న అవగాహనతోనే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒకరి ఇష్టాయిష్టాలు మరొకరివిగా భావించి మసలుకోవాలి. 

* బంధాలలో నిజాయితీ కనపడాలి, నిబద్ధత వుండాలి....

* అబద్దo దాచినా దాగదు. ఏదైనా పొరబాటు జరిగితే అది వెంటనే తమవారికి చెప్పేయాలి. దాన్ని దాచివుంచితే ఎప్పటికైనా ప్రమాదమే మరి. దీంతో అనుబంధం తెగిపోయే ప్రమాదంవుంది. 

* నిజం నిలకడగావుంటుంది. చేదుగానూ ఉంటుంది. కాబట్టి నిజాయితీగానే వ్యవహరిద్దాం. నీతి నియమాలను పాటిస్తూ నిజాయితీగావుంటే బంధాలు అనుబంధాలవుతాయి. అదే ప్రేమబంధమౌతుంది.
Previous
Next Post »