పిల్లల్లో మానసిక ఒత్తిడి ని ఎలా అధిగమింనచాలో ఇలా నేర్పండి




ప్రస్తుతం ‘మానసిక ఒత్తిడి’ అనేది పిల్లల నుంచి పెద్దల దాకా అందరినీ పట్టి పీడిస్తున్న సమస్య. ఈ ఒత్తిడికి ముఖ్యకారణం ఆందోళన. ఏదైనా పని చేసే ముందు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆందోళనకు గురికావటం సహజం. నెలల వయస్సు నుంచి మనిషి జీవితంలోని ప్రతి దశలో ఒత్తిళ్ళు తప్పవు. కానీ అదే ఆందోళన శృతి మించితే ఒత్తిడిగా మారుతుంది. అయితే ఈ ఆందోళన, ఒత్తిడి కొంతమంది పిల్లల్లో తీవ్రమైన మానసిక సమస్యలకు దారితీయవచ్చు.

పిల్లల్లో ఒత్తిడిని గుర్తించటం చాలా క్లిష్టమైన పని. మానసిక ఒత్తిడికి గురయిన పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మరీ చిన్న పిల్లలో ఈ ఒత్తిడి నోట్లు వేలు పెట్టుకోవటం, జుట్టు మెలిపెట్టుకోవటం, ముక్కు గిల్లుకోవటం.. లాంటి ప్రవర్తనా సమస్యలద్వారా బయటపడుతుంటుంది.

అదే ఇంకొంచెం పెద్ద పిల్లలలో అబద్ధాలు చెప్పటం, తోటి పిల్లలని కొట్టటం, హింసించటం, పెద్దవాళ్లని ఎదిరించటం, రోజువారీ పనులు మరచిపోవటం, నిద్రలేమి, నిద్రలో మూత్ర విసర్జన, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, జ్వరం, కడుపునొప్పి, నిస్సత్తువ లాంటి వాటికి గురవుతారు. 

అలాగే.. చదివినది ఏదీ గుర్తుండక పోవటం, ఒక విధమైన నిరాశ, నిరాసక్తి, ఏమీ చేయాలని అనిపించక పోవటం, చేసే పనిమీద శ్రద్ధ లేకపోవటం, ఏదో కోల్పోయిన భావన, తోటివారితో కలవలేక పోవటం, ఆత్మన్యూనతా భావం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

పెద్దవారి ప్రోత్సాహంతోనే...!

కుటుంబ వాతావరణం, పెద్దల ప్రవర్తన, వారు అందించే ప్రోత్సాహం, సహాయ సహకారాలే పిల్లల ఒత్తిడిని అధిగమించేందుకు సహకరిస్తాయి. పిల్లల్లో ఎలాంటి అసహజ ప్రవర్తన కనిపించినా సరే, తల్లిదండ్రులు అప్రమత్తం అవ్వాలి. అంతేగానీ అవి సహజమేకదా అని వదిలేయకూడదు

మరికొంతమంది పిల్లల్లో ఈ మానసిక ఒత్తిడి మూలంగా పీడకలలు, అతిభయం, చిన్న చిన్న విషయాలకి కూడా అతిగా స్పందించటం, అకస్మాత్తుగా చదువులో వెనుకబడి పోవటం, తమను తాము హింసించుకోవటం లాంటివి కూడా సంభవిస్తుంటాయి. అయితే పిల్లల మానసిక ఒత్తిడి స్థాయినిబట్టి, వారు పెరిగే వాతావరణాన్నిబట్టి, తల్లిదండ్రులతో వారికి ఉన్న సంబంధ బాంధవ్యాలనుబట్టి ఈ లక్షణాలు ఉంటాయి.

కుటుంబ వాతావరణం, పెద్దల ప్రవర్తన, వారు అందించే ప్రోత్సాహం, సహాయ సహకారాలే పిల్లల ఒత్తిడిని అధిగమించేందుకు సహకరిస్తాయి. పిల్లల్లో ఎలాంటి అసహజ ప్రవర్తన కనిపించినా సరే, తల్లిదండ్రులు అప్రమత్తం అవ్వాలి. అంతేగానీ అవి సహజమేకదా అని వదిలేయకూడదు. ముందుగా పిల్లలకి మంచి పౌష్టికాహారం, తగినంత విశ్రాంతి అందేలా చూడాలి. పిల్లలలో సన్నిహితంగా మెలుగుతూ, ఎప్పుడూ వారికి అందుబాటులో ఉండాలి.

పిల్లలు స్వేచ్ఛగా వారి భావాలను వ్యక్తం చేసే అవకాశాన్ని పెద్దలు వారికి కల్పించాలి. పిల్లలకు ఉండే సమస్యలు, వాటికి గల కారణాలు, పరిష్కార మార్గాల గురించి వారితోనే చర్చించాలి. వారి స్నేహితులను, ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉండాలి. వారికి ఇష్టంలేని వ్యాపకాలను, వారి వయస్సుకు మించిన లక్ష్యాలను వారిమీద రుద్దటం మానివేయాలి. వారి అభిరుచులను, సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని పిల్లలకు లక్ష్యాలను నిర్దేశించాలి.

తల్లిదండ్రులు కుటుంబ సమస్యల గురించి పిల్లల ముందు చర్చించటం, వాదులాడుకోవటం లాంటివి వీలైనంతవరకూ లేకుండా చూడాలి. జీవితంలో ఎదురయ్యే కొన్ని సహజమైన సమస్యలు, ఒత్తిడుల గురించి వారికి ముందే ఒక అవగాహన కల్పించాలి. కోపం, భయం, బాధ, ఒంటరితనం, ఆందోళన లాంటివన్నీ జీవితంలో చాలా సాధారణమన్న విషయం వారికి తెలిసేటట్లు చేయాలి.

మంచి పుస్తకాలు పిల్లలకు మంచి నేస్తాలు. కొంతమంది పిల్లలు పుస్తకాలు చదవటం ద్వారా వాటిలోని పాత్రలకి తమను తాము అన్వయించుకుని, తమ సమస్యలకు వాటిద్వారా పరిష్కారం పొందుతుంటారు. కాబట్టి.. మానసిక ఒత్తిడికి లోనయ్యే పిల్లలకు, వారికి ఇష్టమైన పుస్తకాలను ఇచ్చి చదవమని ప్రోత్సహించాలి. పై విధమైన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్లో ఏర్పడ్డే మానసిక ఒత్తిడిని చాలావరకు తగ్గించవచ్చు. అయితే ఈ ఒత్తిడి మరీ ఎక్కువగా ఉండి, తీవ్రమైన ప్రవర్తనా లోపాలతో బాధపడే చిన్నారులను మాత్రం తప్పకుండా మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
Previous
Next Post »