పెళ్లి మూడునాళ్ల ముచ్చటేనా ...?





కుటుంబ వ్యవస్థకు మూలాధారం వివాహం. అందుకే పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు. భారతీయ వివాహ బంధానికి ప్రపంచమే తలవంచుతుంది. సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, కుటుంబ జీవనంపై ఉన్న గౌరవం, సామాజిక అంశాలు ఇందుకు కారణం. ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతి అంటే ఈసడించుకునే పరిస్థితి పోయి ఇప్పుడు మనం కూడా అదేదారిలో నడిచేందుకు ఇష్టపడుతున్నామన్న భావన క్రమేపీ బలపడుతోంది.

పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు ఒకరంటే ఒకరు ఇష్టపడి చేసుకునే ప్రేమ పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. వందేళ్ల బంధం కాస్త మూడునాళ్ల ముచ్చటగా మారుతోంది. ఓర్పు, సహనం అన్న మాటలు దూరమయ్యాయి. అవగాహనా లోపం, అహం, మితిమీరిన స్వేచ్ఛకోరుకోవడం వంటి కారణాలు వివాహ బంధం విచ్ఛిన్నానికి కారణమవుతున్నాయి. పరస్పరం గౌరవించుకోవడానికి బదులు ఒకరిపై మరొకరు ఆధిపత్యం సాధించాలన్న ధోరణి ఈతరం యువతను కోర్టు మెట్లెక్కిస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్తుకు ప్రమాదమే అంటున్నారు నిపుణులు.

చిన్న చిన్న కారణాలకే..

కాలం మారింది. పరిస్థితులూ మారాయి. పటి ష్టమైన భారతీయ వివాహ వ్యవస్థ కూడా ప్రస్తుతం ఆటుపోట్లకు లోనవుతోంది. పెళ్లి విషయంలో ఒకప్పు డు ప్రపంచమే మనల్ని చూసుకుని అనుసరించా లనుకుంటే ఇప్పుడు మనమే ఆ ప్రపంచం వైపు అడు గులు వేస్తున్నాం. బిడ్డలకు పెళ్లి చేసి ఓ ఇంటివారిని చేస్తే తమ బాధ్యత తీరుతుందని తల్లిదండ్రులు భావించేవారు. ఇప్పుడు పెళ్లిచేశాక ఎటువంటి పరిస్థి తులు ఎదుర్కోవాల్సి వస్తోందో అని మధన పడుతు న్నారు.

చిన్నచిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్తు న్న ఈ తరం దంపతుల పోకడ ఆ తరం వారి ఆందో ళనకు కారణమవుతోంది. ‘భార్య తన తల్లిదండ్రులను బాగా చూసుకోవడం లేదు వేరు కాపురం పెట్టమని కోరుతుంటే భర్త అంగీకరించడం లేదు. పెళ్లయ్యాక నిద్రకు దూరమయ్యాను,ఈ గురక రాక్షసుడితో కాపురం చేయలేను. నెలసరి సమయంలో నన్ను కింద పడుకోమంటున్నాడు, ఇలాంటి చిన్నచిన్న కారణాలతోనే ఈతరం విడాకుల వరకు వెళ్తోంది.



పెళ్లయిన నెలరోజులకే ‘ఇక నీతో వేగడం నా వల్ల కాదు’ అని ఒకరినొకరు ఈసడించుకుంటున్న జంటలు ఎన్నో. తమ పెద్దరికంతో దంపతుల మధ్య సఖ్యత కుదిర్చి కాపురం నిలబెట్టాల్సిన కొందరు తల్లిదండ్రులు కూడా ‘కలిసి బతకలేనప్పుడు విడిపోయి హాయిగా ఉండడమే మేలు’ అని వంతపాడుతుండడం సమస్యకు మరింత కారణమవుతోంది. 

 చిన్నచిన్న అలకలు, చికాకులు పెద్దగా చూడటం

పెద్ద లు కుదిర్చిన పెళ్లిళ్లలో ఏదో అవగాహన లోపం అనుకోవచ్చు. ప్రేమ పేరుతో కొన్నాళ్లపాటు చెట్టా పట్టాలేసుకుని తిరిగి, తర్వాతే పెళ్లి చేసుకున్న ప్రేమ జంటలూ ఇదేదారిలో నడుస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇందు కుకారణం ఏమిటి మార్పు సాధ్యమేనా. కాపురం అన్నాక చిన్నచిన్న అలకలు, చికాకులు సహజం. వివాహ బంధం పవిత్రమైనదే కాదు, బలమైనది. కోట్లు, లక్షల రూపాయలు ఖర్చు చేసిన పెళ్లి ఆర్భాటపు సందడి సమసిపోకముందే కోర్టు మెట్లెక్కే స్థాయికి కొందరు దిగజారుతున్నారు.

ఈ తరంలో ఓర్పు, సహనం కరువవ్వడమే ఇందుకు కారణం. తమకాళ్లపై తాము నిలబడగలమన్న ధైర్యంతో వివాహ బంధానికి విలువివ్వడం లేదు. ప్రతిదాన్నీ భూతద్దడంలో చూడడం పరిపా టిగా మారింది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి. ఈ తరం సౌకర్యాలు, స్వేచ్ఛ కోరుకుంటున్నారు. భంగం కలిగితే సహించలేక పోతున్నారు. విడిపోయేందుకు సిద్ధపడుతున్నారు. కలిసి ఉండలేనప్పుడు విడిపోవడమే మేలన్న భావన కనిపిస్తోంది.



ఒకప్పుడు విడాకులు తీసుకో వడం అంటే సమాజంలో చిన్నచూపన్న భయం ఉండేది. ఆ భయం కూడా పోయింది. సమాజం కూడా అంగీకరిస్తోంది. ఇద్దరి మధ్య సఖ్యత కుదరనప్పుడు కలిసి ఉండాల్సిన అవసరం ఏమొచ్చిందన్న భావన ఉంది. కూతురికి సర్దిచెప్పి అత్తారింటికి పంపే తల్లిదండ్రుల సంఖ్య కూడా తగ్గిపోయింది. 

అహం అసలు సమస్య

దంపతుల మధ్య అహం, తనమాటే నెగ్గాలన్న పట్టుదల చాలా సమస్యలకు మూలమవుతోంది. కొందరు మగాళ్లు భార్య ఉద్యోగం చేయకూడదని భావిస్తారు. మరికొందరు భార్య ఉద్యోగం చేసినా తన అడుగులకు మడుగులొత్తాలని ఆశిస్తారు. తను చెప్పిన దానికి గంగిరెద్దులా తలూపాలని కోరుకుంటారు. తన సంపాదన విషయం భార్య కు చెప్పడు. కానీ ఆమె సంపాదనపై పెద్దరికం కోరుకుంటాడు. ఇటువంటి ఆలోచనలకు అహమే కారణం.

సర్దుకుపోయే మహిళలైతే సమస్య ఉండదు. జీవిత భాగస్వామికి కూడా అదే అహం ఉంటే ఘర్షణలు తలెత్తుతాయి. ఆత్మాభిమానం సమస్య బయటపడి కాపురాలు కూల్చు కుంటున్నారు. అలాకాకుండా మనసెరిగి మసల డం, ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం, సర్దుకుపోయే తత్వాన్ని అలవర్చుకోవడం జరిగితే ఈ సమస్య ఉండదు. నూతన దంపతుల మధ్య అవగాహన పెరగడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకు సమన్వయంతో మెలగడం చాలా అవసరం

పెళ్లికి ముందు కౌన్సెలింగ్ అవసరం

అయితే కుటుంబ నేపథ్యం, వ్యక్తిత్వం, భావోద్వేగాలు, వ్యవహారశైలి, ఉద్యోగ కారణాలు, అత్తగారితో వివాదాలు, ఆర్థిక విషయాలు, అనుమానం, తాగుడు, సెక్స్ సంబంధిత కారణాలతో చాలామంది విడిపోతున్నారు. ఉమ్మడి కుటుం బాలు లేక విలువలు తెలియడం లేదు.

పెళ్లికి ముందు (ప్రీ మెరి టల్) కౌన్సెలింగ్ వల్ల భవిష్యత్తు, బంధం, వివాహం విలువ, జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం వంటి విషయాలపై అవగాహన కలుగుతుంది. తద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది. అలా సాధ్యంకాక పోయినా, గొడవలు ప్రారంభం కాగానే కౌన్సెలింగ్ తీసుకోవడం మేలంటున్నారు సైకాలజిస్ట్‌లు.
Previous
Next Post »