వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి
ఈ వ్రతాన్ని ఆయా కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుంటుంది. దీన్ని పెద్దల నుంచి అంటే అత్తగారి నుంచి లేదా అమ్మగారి నుంచి పట్టుకోవాలి. ఒకవేళ వ్రతం చేసే ఆచారం ఆయా కుటుంబాలలో లేకుంటే కేవలం వరలక్ష్మీ అమ్మవారిని పటం లేదా విగ్రహాన్ని లేదా కలశాన్ని ఏర్పాటుచేసుకుని కలశం పూజ, గణపతి ఆరాధన, లక్ష్మీ అష్టోతరం, మంగళారతి పాటలు పాడి తియ్యని నైవేద్యాలు, కొబ్బరికాయ, పండ్లు దానిమ్మ, అరటి తదితర పండ్లు నైవేద్యంగా సమర్పించి మంగళారతి ఇచ్చి ప్రసాదాన్ని స్వీకరించాలి.
ముతైదువులకు పసుపు, కుంకుమ, పండ్లు, శక్తి ఉంటే జాకెట్ పీసులు, వస్త్రదానం లాంటివి చేయాలి. దీనివల్ల ఐదోతనంతోపాటు ఇంట్లో సర్వసౌభాగ్యాలు కలుగుతాయి. అన్నింటికంటే ప్రధానం భక్తి,శ్రద్ధ. ఈ వ్రతం చేసినా ఆడంబరాల కంటే భక్తి ప్రధానంగా చేస్తేనే సత్ఫలితాలు వస్తాయనేది శాస్త్ర ప్రవచనం. భక్తితో వ్రతం చేస్తే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి నిష్ఠలు, నియమాలు, మడులు పాటించినా, పాటించకపోయినా నిశ్చలమైన భక్తి, శ్రద్ధ ఉండాలి.
ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం, సంతానం, ధాన్యం, పశు సంపద, గుణ, జ్ఞానం తదితరాలు. వ్రతం అనేసరికి అమ్మవారికి ఎంతెంత పూజ చేయాలో, ఎన్నెన్ని నైవేద్యాలు పెట్టాలో అని భయపడనక్కరలేదు. మన శక్తిమేర శుచి, శుభ్రతతో ఆహారాన్ని వండాలి. వీలైతే, చేతనైన పిండివంటలు చేయాలి. ఇంటికి వచ్చిన పేరంటాళ్లకు మర్యాద చేసి, కాళ్లకు పసుపు రాసి, నుదుట బొట్టు, మెడకు గంధం పెట్టి, చేతికి తోరం కట్టి, చేతిలో పండ్లు, తాంబూలం పెట్టి, నమస్కరించి, ఆశీస్సులు అందుకోవాలి.
EmoticonEmoticon