(వ్రతకథ చెప్పుకొనే ముందు కొన్ని అక్షతలు చేతిలో వుంచుకోవాలి.
కథ పూర్తయిన తరువాత ఆ అక్షతలను శిరసుపై వేసుకోవాలి)
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంపదలన్నీ పోగొట్టుకున్నాడు.భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు.అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి “అయ్యా! మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవము పొందేలా ఏదయినా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది” అని ప్రార్థించాడు. అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.
“ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి- తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలను, విజయాలను, వైభవాలనూ పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు- నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామార్థ సిద్ధిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి, స్నానం చేసి, నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తిమేరకు బంగారంతో గాని, వెండితోగాని, లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి.
అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలములను, రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి, యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్యభోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈవిధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములూ సిద్ధిస్తాయి.
అన్ని వ్రతములలోకీ అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధార్వాదులందరిచేతా ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా నువ్వుకూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే- నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే శ్యమంతకమణితో బాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు.
పూర్వకాలమున గజముఖుడయిన గజాననుడు అనేరాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ నీవు నాయుదరమందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్తసులభుడగు శివుడు అతడి కుక్షియందుండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో వున్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకొనే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు.
గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాదిదేవత లందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేశాడు. మహావిష్ణువు తానును చిరు గంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దులను ఆడించుచుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనము ఎదుట గంగిరెద్లును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూతధారియగు నాహరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దు నాడించాడు. గజాసురుడు పరమానందభరితుడై “ఏమి కావాలో కోరుకోండి…. ఇస్తాను” అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుని సమీపించి “ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చింది, శివుడ్ని అప్పగించు” అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడగు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో వున్న పరమేశ్వరుడ్ని ఉద్దేశించి “స్వామీ! నా శిరస్సు త్రిలోక పూజ్యముగ చేసి, నా చర్మము నీవు ధరించు” అని ప్రార్థించాడు.
తన గర్భంలో వున్న శిపుడ్ని తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారము తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భమునుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. ‘దుష్టాత్ములకు ఇటువంటి వరముసు ఇవ్వరాదు – ఇచ్చినచో పామునకు పాలుపోసినట్ల అవుతుందని సూచించాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు.
వినాయకోత్పత్తి
కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి, తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్యసుందరుని వాకిట్లో వుంచి, ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది.
శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో వున్న బాలుడు పరమశివుడ్ని అభ్యంతర మందిరం లోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమాని శివు డు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి, లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై, శివపార్వతుల ముద్దుల పట్టియైనాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.
విఘ్నేశాధిపత్యం
ఒకనాడు దేవతలు, మునులు, మానవులు, పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యము తన కు ఇమ్మని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారుల నుద్దేశించి “మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర న దులన్నింటిలో స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంద”ని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా, సులువుగా సాగివెళ్ళాడు.
గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని, తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు. జలములన్నియూ నారాయణుని అధీనములు. అనగా నారాయణ మంత్రం అధీనంలో వుంటా యి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు.
ఆ మంత్ర ప్రభావమున ప్రతితీర్థ స్నానమందును కుమారస్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా మూడుకోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజాననుని చూచి నమస్కరించి “తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మ”ని ప్రార్థించాడు.
చంద్రుని పరిహాసం
అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజాననుకి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి, పూజించగా, విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్ని చేత ధరించి మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసముకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు.
ఉదరం భూమికానిన చేతులు భూమికానక ఇబ్బంది పడుచుండగా, శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గవుతాయి అనే సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అంత పార్వతి శోకించుచూ చంద్రుని చూచి “పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసినవారు పాపాత్ములై నీలాపనిందల పొందుదురుగాక” యని శపించింది.
ఋషిపత్నులకు నీలాపనిందలు
ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి, శాప భయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము దక్క మిగిలిన ఋషిపత్నుల రూపము ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలేయని శంకించి, ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చం ద్రుని చూచుటచే వీరికి ఈ నీలాపనింద కలిగింది.
దేవతలు, మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపగా, అతడు సర్వజ్ఞుండగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధాన పరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు. మహేశ్వరుల సేవించి, మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. పార్వతీపరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాదులు “ఓ పార్వతీ! నీ శాపము వల్ల ముల్లోకాలకు కీడువాటిల్లింది కాబట్టి శాపన్ని ఉపసంహరించుకోవా”ని ప్రార్థించారు. తనయుడు మరల బతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది. “ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదు” అని శాపాన్ని సడలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి. ఇలా కొంతకాలము గడచె.
శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుని దర్శించి, స్తుతించాడు. మాటల సందర్భంగా స్వామీ! సాయంకాలమయింది, నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు. ఇక సెలవు అని పూర్వవృత్తాంతమంతయూ శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతట కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుడ్ని ఎవరూ చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలుపిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబమును చూశాడు. “ఆహా! ఇక నాకెట్టి అపనింద రానున్నదో” అని అనుకున్నాడు.
కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్య వరముచే శమంతక మణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు. “రోజుకు ఎనిమిది బారువుల బంగారమిచ్చు దానిని ఏ ఆప్తునకైన నెవ్వరు ఇవ్వ”రనిన సత్రాజిత్తు తిరస్కరించాడు. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతక మణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగ ఇచ్చింది.
మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని, కృష్ణుడు, మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటించాడు. అది కృష్ణుడు విని చవితి నాడు పాలల్లో చంద్రబింబమును చూచిన దోష ఫలమని అనుకున్నాడు. దానిని బాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెదుకగా ఒకచోట ప్రసేనుని కళేబరము, సింహం కాలిజాడలు, పిదప ఎలుకబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంబును చూచి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు. అచట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది.
అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరచుచు, గోళ్ళతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ ఘోరముగ యుద్ధము చేసెను. కృష్ణుడు వానికి బడద్రోసి వృక్షములు, రాళ్ళతోను, తుదకు ముష్టిఘాతలముతోను రాత్రింబవళ్ళు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధము చేసెను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది. తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడగు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు. అంజలి ఘటించి “దేవాధిదేవా! ఆర్తజనపోషా! భక్తజనరక్షా నిన్ను శ్రీరామచంద్రునిగా తెలిసికొంటిని. ఆ కాలమున నాయందలి వాత్సల్యముచే వరం కోరుకొమ్మనగా, నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధం జేయవలెనని కోరుకున్నాను.
భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణ చేయుచూ అనేక యుగములు గడిపాను, ఇపుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇక జీవితేచ్ఛ లేదు. నా అపరాధములు క్షమించి కాపాడుము. నీ కన్న వేరు దిక్కులేదు” అంటూ భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయూ తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు. శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొనుటకు ఇటు వచ్చాను.
కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగ తన కుమార్తెనగు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. అంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యంబులకు ఆనందం కలిగించి కన్యారత్నంతోను, మణితోను శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు. సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు “అయ్యో! లేనిపోని నింద మోపి దోషమునకు పాల్పడితి”నని విచారించి “మణి సహితముగ తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమింపు”మని వేడుకున్నాడు.
శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని తిరిగి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతీ సత్యభామలను పరిణయమాడాడు. అంత దేవాదులు, మునులు స్తుతించి “మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకొంటిరి మాకేమి గతి” యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై “భాద్రపద శుద్ధ చతుర్థిని ప్రమాదవశంబున చంద్రదర్శనమయ్యెనేని ఆనాడు గణపతిని యధావిధి పూజించి ఈ శమంతక మణి కథను విని అక్షతలు శిరంబున దాల్చువారు నీలాపనిందలు పొందకుందురుగాక” అని చెప్పాడు. అంత దేవాదులు సంతోషించి, తమ ఇళ్ళకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమతమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ సుఖసంతోషాలతో వున్నారు.
సర్వేజనాః సుఖినోభవంతు.
విఘ్నేశ్వరుని మంగళహారతులు
శ్రీశంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతావంద్యునకును
ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును
॥ జయ మంగళం నిత్య శుభమంగళం ॥
నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు
వేరువేరుగదెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికినిపుడు ॥ జయ ॥
సుచిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజగొల్తు
శశి చూడరాదన్న జేకొంటి నొక వ్రతము పర్వమున దేవగణపతికినిపుడు ॥ జయ ॥
పానకము వడపప్పు పనస మామిడిపండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు
తేనెతో మాగిన తియ్య మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ॥ జయ ॥
ఓ బొజ్జ గణపయ్య నీ బంటునేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండుపంపు
కమ్మనినెయ్యయ్య కడుముద్దపప్పును బొజ్జవిరుగగ దినుచును పొరలుచున్ ॥ జయ ॥
వెండి పళ్ళెములోన వేయినేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసికొని దండిగా నీకిత్తు ధవళారతి ॥ జయ ॥
పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ
ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికినిపుడు ॥ జయ ॥
ఏకదంతంబును ఎల్లగజవదనంబు బాగయిన తొండంబు వలపు కడుపు
జోకయిన మూషికము పరక నెక్కాడుచు భవ్యుడగు దేవగణపతికినిపుడు ॥ జయ ॥
మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు
మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవగణపతికినిపుడు ॥ జయ ॥
సిద్ధివిఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువదియొక్క పత్రి
దానిమ్మ మరువమ్ము దర్భ విష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ॥ జయ ॥
కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు
జాజి బలురక్కసి జమ్మిదాసానపువ్వు గరికి మాచిపత్రి మంచి మొలక ॥ జయ ॥
అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములను
భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబ్రాలు ఉండ్రాళ్ళు పప్పు ॥ జయ ॥
పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరిపూజింతు నిన్నెపుడు కోర్కెలలర ॥ జయ ॥
బంగారు చెంబుతో గంగోదకముదెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి
మల్లెపువ్వులు దెచ్చి మురహరిని పూజింతురంగైన నా ప్రాణలింగమునకును ॥ జయ ॥
పట్టుచీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు
ఇష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవ గణపతికినిపుడు ॥ జయ ॥
ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తు సమితి గూర్చి
నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కువగు పూజలాలింపజేతు ॥ జయ ॥
మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారములను
ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ॥ జయ ॥
దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును
దేవతలు మిముగొల్చు తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికినిపుడు ॥ జయ ॥
చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను
పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధ గణపతికి బాగుగాను ॥ జయ ॥
మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు
నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ ॥ జయ ॥
ఓ బొజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచినన్నేలుమీ కరుణతోను
మాపాల గలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర
॥ జయ మంగళం నిత్య శుభమంగళం ॥
EmoticonEmoticon