వ్యాపారం చేయాలంటే బోలెడంత అనుభవం అక్కర్లేదు.. సవాళ్లను ఎదుర్కొనే సత్తా, సమస్యలు పరిష్కరించుకునే నేర్పూ ఉంటే చాలు... అని నిరూపించింది దీక్షిరెడ్డి! ఫోన్ కాల్ దూరంలో ‘సేఫ్ వాష్’ పేరుతో లాండ్రీ, డ్రైవాష్ సేవల్ని అందిస్తోన్న ఆమె ‘ప్రణాళిక ఉంటే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది’ అంటోంది. సంస్థ ప్రారంభించిన ఏడాదిలోనే వేలాది మంది వినియోగదారులకు దగ్గరై కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకున్న దీక్షి ప్రస్థానం ఆమె మాటల్లోనే..
ప్రతి పనినీ మనం చిన్నప్పట్నుంచి కలగని చేయాలని లేదు. కానీ ఒక్కసారి ఆ దారిలో నడక ప్రారంభించాక ఎదురొచ్చే అడ్డంకుల్ని దాటాల్సిందే! నేనిలాగే అనుకున్నాను! ‘సేఫ్ వాష్’ మొదలుపెట్టాక.. ఈ సరికొత్త సేవారంగంలో నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డాను. ముప్ఫై మంది వినియోగదారులతో ప్రారంభమైన మా సంస్థ ఏడాదిలోనే మూడువేల మందికి సేవలందించే స్థాయికి చేరుకుంది. మొదట్లో ‘మీరు బట్టలు ఉతుకుతున్నారా?’అని అందరూ అడిగేవారు. మరికొందరు ‘ఇదీ ఓ వ్యాపారమేనా’ అంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు మాకొస్తున్న ఆదరణ చూసి మీ ‘సేవలు చాలా బాగున్నాయి!’ అని పొగుడుతున్నారు. ఒకప్పుడు సెలూన్‌లూ, లాండ్రీల వంటివన్నీ కులవృత్తులే కావొచ్చు. కానీ వాటన్నింటికీ ఇప్పుడు బ్రాండింగ్ వచ్చింది. ప్రాధాన్యం పెరిగింది. వినియోగదారులకూ సౌకర్యంగా ఉండటంతో ఇలాంటి సేవలు కోరుకుంటున్నారు.
ఇటెలా వచ్చానంటే
మాది హైదరాబాద్. నాన్నకు రైస్‌మిల్‌లకు అవసరమయ్యే యంత్రాలను తయారు చేసే సంస్థ ఉంది. దాంతో నాకూ వ్యాపార మెలకువలు ఒంటబట్టాయి. నేనేమో ఇంటర్ అయ్యాక బీటెక్‌లో చేరా. అయినా నాన్న వ్యాపార వ్యవహారాల్లో పాలుపంచుకోవడం మానలేదు. చివరి ఏడాది క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగమొచ్చింది. చదువైపోగానే ఉద్యోగంలో చేరిపోయా. ఉత్సాహంగా చేరినా సంతృప్తి లేదు. తెలియకుండానే మనసు వ్యాపారం గురించి ఆలోచించేది. ఇంతలో నాకు శిశిర్‌తో పెళ్లి కుదిరింది. తను విదేశాల్లో చదువుకుని ఉద్యోగం చేశాడు. వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఇక్కడికి తిరిగొచ్చేశాడు. ఇక ఉద్యోగం మానేసి నాన్న సంస్థలోనే సేవల విభాగానికి సంబంధించిన బాధ్యతలు తీసుకున్నా. ఏడాదిలో ఎన్నో మార్పులు. మా అమ్మకాలూ పెరిగాయి. నా తాపత్రయం చూసి అంతా మెచ్చుకున్నారు. కానీ ఎప్పుడూ నేనూ, మా వారూ సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచించే వాళ్లం. సోలార్ ఉత్పత్తుల తయారీ, ఏరో స్పేస్ విడిభాగాల తయారీ, కాఫీ షాపులూ, రెస్టారంట్ల వంటి అనేక వ్యాపార ఆలోచనలు వచ్చాయి. వాటికోసం కొంత అధ్యయనం చేశాం కూడా. కానీ వాటివైపు వెళ్లలేకపోయాం. కొంత అధ్యయనం చేశాక సేవల రంగంలోనే కొనసాగుతూ వినూత్నంగా ఉండే వ్యాపార ఆలోచనను ఎంచుకుంటే బాగుంటుందని ఇద్దరికీ అనిపించింది.
అధ్యయనం చేశాకే..
వ్యాపారం చేయాలనుకున్నప్పుడు దీర్ఘకాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎక్కువ మందికి సేవలు అందించినప్పుడే వ్యాపారంలో కొనసాగగలుగుతాం. ఇలా ఆలోచిస్తున్నప్పుడే నాకు ఓ అనుభవం గుర్తొచ్చింది. దుస్తులు కొనేటప్పుడు రాజీ పడం. నాణ్యతా, ఖరీదూ, బ్రాండ్ అన్నీ చూసుకుంటాం. అలాంటప్పుడు.. వాటిని శుభ్రపరిచే విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి. అలా కొన్న వాటిని నేను డ్రైవాష్‌కి ఇచ్చి వాటిని తిరిగి తీసుకోవడానికి ఆ షాపుకి పదే పదే వెళ్లేదాన్ని. వారమే అన్నవారు నెలకూ ఇచ్చేవారు కాదు. ఇలాంటి అనుభవం చాలామంది మహిళలకు ఎదురయ్యే ఉంటుంది. ఫోన్ చేస్తే ఇంటికొచ్చి తీసుకెళ్లే, చెప్పిన సమయానికి అందించే ప్రొఫెషనల్ డ్రైవాష్ సంస్థలు మన దగ్గర తక్కువ. మరి అలాంటి సేవల్ని ‘నేను ఎందుకు ప్రారంభించకూడదు!’ అనిపించింది. శిశిర్‌కీ ఆలోచన నచ్చింది. చాలామంది ‘అంత చదువుకొని లాండ్రీ పెట్టుకోవడమేంటి?’ అన్నారు. మాకు ఆ పనేం చులకనగా అనిపించలేదు. అందుకే ముందుకెళ్లాం. మొదట్లో కేవలం కార్పొరేట్ సంస్థలూ, హోటళ్లూ, రైల్వే వంటి సంస్థలను ఎంచుకుని వాటికే మా సేవలు అందించాలనుకున్నాం. కానీ వారిచ్చే బెడ్‌షీట్లూ, కర్టెన్లూ, ఇతరత్రా వస్త్రాలన్నీ తెలుపు రంగువే అయి ఉంటాయి. వాటికోసం మేం చేసే పనీ తక్కువే. ప్రత్యేకత చూపించే అవకాశమూ ఉండదు. దానికంటే నేరుగా వినియోగదారులతోనే సంబంధాలుండే సేవా రంగం మేలనుకున్నాం. మా కజిన్ ఇలాంటి వ్యాపారానికి కావల్సిన యంత్రాలను అందించే ఓ బెంగళూరు సంస్థ గురించి చెప్పాడు. అక్కడికెళ్లి యంత్రాలూ, వాటి పనితీరు గురించి అవగాహన తెచ్చుకున్నాం. అలానే మా సన్నిహితుల్ని కలిసి లాండ్రీ సర్వీసుల మీదున్న అభిప్రాయం తెలుసుకున్నాం. హైదరాబాద్‌లోనూ వివిధ ప్రాంతాల్లో తిరిగి ఓ చిన్నపాటి సర్వే నిర్వహించాం.
ఒక్క ఫోన్ కాల్‌తో..
సేకరించిన అభిప్రాయాలన్నీ చూసుకున్నాక ఈ సేవలు ప్రారంభించాలనుకున్నాం. అలా ఏడాది క్రితం ‘సేఫ్ వాష్’ పేరుతో లాండ్రీ సర్వీస్‌ని అందుబాటులోకి తెచ్చాం. మాకు ఒక్కఫోన్ చేస్తే చాలు మా ఉద్యోగులే వినియోగదారుల తలుపు తడతారు. సేకరించిన దుస్తులకు ట్యాగులు వేసి.. వివరాలు రాసుకుని ఆర్డర్ తీసుకొస్తారు. వస్త్రం తీరుని బట్టి కొన్నింటిని చేత్తో కూడా ఉతకాల్సి ఉంటుంది. ఇందుకు మూడురోజులు సమయం పడుతుంది. నాలుగో రోజు శుభ్రమైన దుస్తుల్ని ఇంటికి పంపుతాం. దీనికీ లాండ్రీలో సరైన నైపుణ్యం కలిగిన వారుంటే మేలని ఆయా విభాగాల్లో లాండ్రీ సొల్యూషన్స్‌లో డిప్లొమా చేసిన వారిని ఉద్యోగులుగా నియమించుకున్నాం. ప్రస్తుతం ఫోన్‌కాల్‌తో పాటూ నేరుగా మా అవుట్‌లెట్‌కు తీసుకొచ్చి ఇచ్చే సదుపాయం కూడా ఉంది. నలగండ్ల, కొండాపూర్, తార్నాక, నాగోల్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో మా అవుట్‌లెట్లు ఉన్నాయి. వివిధ రకాల దుస్తులతో పాటూ తివాచీలూ, కిటికీ పరదాలూ, షూస్, హ్యాండ్ బ్యాగులు, సాఫ్ట్‌టాయ్స్ వంటివాటినీ శుభ్రపరిచి అందిస్తాం. అందరికీ అందుబాటులో పదిహేను నుంచి నాలుగువందల రూపాయల వరకూ ఛార్జ్ చేస్తాం.
అన్నీ దాటి..
ఈ వ్యాపారంలో నెగ్గడం అంత సులువేం కాదు. ఎదురయ్యే ప్రతి అనుభవం నుంచీ పాఠాలు నేర్చుకోవాలి. మాకు వచ్చిన ప్రతి ఫిర్యాదునీ పరిశీలిస్తాం. మాకిచ్చిన దుస్తుల్లో కొన్నిటికి గుండీలు వూడిపోయి ఉండొచ్చు, చిరుగులుండొచ్చు.. వినియోగదారుల వద్దే మేం వాటిని సరి చూసుకుంటాం. లేకపోతే మా వల్లే ఆ సమస్యలంటారు. మొదట్లో ఇలాంటి ఫిర్యాదులు చాలానే ఎదురయ్యాయి. అందుకే ఆర్డరు బుక్ చేసుకునే సమయంలోనే వారు ఏయే దుస్తులు ఇస్తున్నారు. వాటికి అందివ్వాల్సిన సేవలు ఏంటి? రంగూ, వస్త్రం తీరూ, జాగ్రత్తల వంటివన్నీ రసీదులోనే రాసేస్తాం. ప్రతిదానికీ ట్యాగ్ వేస్తాం. ఉతికేందుకు ఆర్వో(శుద్ధి చేసిన) నీళ్లను మాత్రమే వాడతాం. ప్రతి దశలో దుస్తుల్ని పరిశీలించేప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డు చేస్తాం. ఎవరైనా మమ్మల్ని ప్రశ్నించినప్పుడు ఫుటేజ్‌ని ఆధారంగా చూపిస్తాం. అప్పుడే వారూ నమ్ముతారు. ఇప్పటి వరకూ 1.9 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాం దానిలో దాదాపు డెబ్భై లక్షల రూపాయలను బ్యాంకు రుణంగా తీసుకున్నాం. నగరంలో మూడువేల మందికి పైగా వినియోగదారులతోపాటూ ల్యాంకో, ఎన్‌సీసీ అర్బన్...వంటి గేటెడ్ కమ్యూనిటీలకూ మేం సేవలు అందిస్తున్నాం. ఏడాదికి కోటి రూపాయలకు పైగా టర్నోవర్‌నూ సాధించాం.
EmoticonEmoticon