కళ్లు లేని మా నలుగురితో అమ్మ వీధిన పడింది!




'అమ్మా.. నాన్నా.. ఇద్దరిలో నీకెవరంటే ఇష్టం?' చిన్నప్పుడు నన్నెవరు ఈ ప్రశ్న అడిగినా.. 'నాన్నే!' అని టకీమని చెప్పేదాన్ని. అవును.. అందరు ఆడపిల్లల్లాగే నాన్న నాకో హీరో. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఆయన కాళ్లకి చుట్టుకుపోయేదాన్ని. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్లూ, తమ్ముడూ పుట్టాక కూడా నేను ఈ అలవాటు మానుకోలేదు. ఆయన మమ్మల్ని వదిలి వెళ్లిన ముందు రోజూ ఇంతే! దిల్లీలో నాన్న వాళ్లది పెద్ద ఉమ్మడి కుటుంబం. అమ్మానాన్నలిద్దరిదీ మేనరికం. నేను పుట్టినప్పుడు బాగానే ఉన్నాను. మూడేళ్ల వయసు నుంచీ కంటిచూపు తగ్గడం మొదలైంది. వైద్యులు 'రెటినింటిస్ పిగ్మెంటోసా' అనే జన్యువ్యాధి అందుకు కారణమని చెప్పారట. ఘోరమేంటంటే.. నా తర్వాత పుట్టిన ఇద్దరు చెల్లెళ్లూ, తమ్ముడికీ ఇదే సమస్య! పుట్టడంతో బాగానే ఉండి మెల్లగా కళ్లు పోతాయన్నమాట. నాలుగేళ్లప్పుడు నన్ను మామూలు బడిలోనే వేశారు. చక్కగా చదివేదాన్ని. టీచర్లూ ముద్దు చేసేవారు. నా చూపు మందగించే కొద్దీ విడిగా చూడటం మొదలుపెట్టారు. హాజరు తీసుకునేప్పుడు నా పేరు చెప్పేవారు కాదు. ఇవన్నీ నన్ను మరీ పెద్దగా ఇబ్బందిపెట్టలేదు. నిజానికి నాకు నాన్న మమ్మల్ని వదిలి వెళ్లేదాకా బాధంటే ఏమిటో తెలియదు
అమ్మ సేల్స్ ఉమన్‌గా: ఆ రోజు నాన్న ఇంటికి రాలేదు. తర్వాతి రోజూ, ఆ తరవాతా, అలా వారం పాటు ఆయన మాట వినపడలేదు! 'నాన్నెక్కడమ్మా..' అంటే అమ్మ ఏడుపే వినిపించేది. పది రోజుల తర్వాత అమ్మనెవరో అన్నారు. 'మీ ఏడుపు మొహాలు చూడలేకే 'వాడు ఎక్కడికో వెళ్లిపోయాడు' అని. మరో రెండ్రోజులకే 'కొడుకే వెళ్లిపోయాక.. మాకు కోడలూ, పిల్లలెందుకు! మీ దారి మీరు చూసుకోండి!' అన్న మాటలు నానమ్మ నోటి నుంచి వచ్చాయి. అమ్మ మమ్మల్ని తీసుకుని వీధిన పడింది. ఆ రోజు ఆమె ఏడ్చిన వెక్కిళ్ల శబ్దం నాకింకా వినిపిస్తూనే ఉంది. మా మేనమామ ఇంట్లో తలదాచుకున్నాం. అమ్మ చదువుకోకపోయినా.. పట్టుదలగల మనిషి. బంధువులపై ఆధారపడకూడదు అనుకుంది. ఓ చిన్న షాపులో సేల్స్ ఉమన్‌గా చేరింది. బొటాబొటీ జీతం. అయినా మేమందరం సొంతకాళ్లపై నిల్చునేలా చేయాలన్నది ఆమె సంకల్పం. నాన్న వెళ్లిన ఆర్నెల్లకే నా చూపు పూర్తిగా పోయింది. మిగతా వారి పరిస్థితీ అంతే. మాకు చదువు నేర్పించే ప్రత్యేక బడుల్లో అనుమతి సాధించడం కోసం అమ్మపడ్డ కష్టం అంతాఇంతా కాదు. ప్రతి చోటా వేలల్లో ఫీజులడిగారు. మాకా స్థోమత లేదంటూ వలవలా ఏడ్చేది. చివరికెవరో చెప్పారు 'రాష్ట్రపతి ఎస్టేట్ స్కూల్‌లో ఇలాంటి పిల్లలకి చదువు చెబుతున్నారూ..!' అని. అక్కడికెళ్లి వాళ్ల కాళ్లావేళ్లాపడి మమ్మల్ని చేర్చింది.

కాళ్ల నొప్పులూ: మా బడికి మేమున్న చోట నుంచి గంట ప్రయాణం. అమ్మ ఉదయం ఎప్పుడో  నిద్రలేచి నలుగుర్నీ సిద్ధంచేసి బస్సులో మాకోసం అంతదూరం వచ్చేది. అక్కణ్నుంచి చిన్న చెల్లెలూ, తమ్ముణ్ని మోసుకుని నడిచేది. అట్నుంచటే షాపుకి వెళ్లిపోయేది. సేల్స్ ఉమన్ కాబట్టి ఎక్కువ సమయం నిల్చునే ఉండాలి. రాత్రయ్యాక 'కాళ్లు నొప్పులూ' అని ఎంత బాధపడేదో! డాక్టర్ దగ్గరికి వెళ్లమంటే... ఆ డబ్బేదో మీ చదువులకి ఉపయోగపడుతుంది అనేది. 'వీలైనంత తొందరగా చదువు పూర్తిచేసి అమ్మకీ, చెల్లెళ్లూ తమ్ముడికీ అండగా నిలవాలి' అనే ఆలోచన అప్పుడే వచ్చింది నాలో. మేం కొత్తగా చేరిన బడి.. పూర్తిస్థాయి 'ప్రత్యేక పాఠశాల' కాదు. ఇద్దరు టీచర్లు తమ ఖాళీ సమయాల్లో నాలాంటి అంధులకి బ్రెయిలీ నేర్పుతారంతే. ఆ అక్షరాలు నేర్చుకోవడం నాకు కొత్త ప్రపంచాన్ని చూపించాయి. ఉదయమంతా మామూలుగా పాఠాలు వినడం.. సాయంత్రం ఆ పాఠాల్ని మళ్లీ మిత్రుల్ని చదవమని అడిగి రికార్డు చేసుకోవడం.. వింటూ వాటిని బ్రెయిలీలోకి మార్చడం... దాదాపు తొమ్మిదేళ్లు నా దినచర్య ఇదే. నేను ఈ పనిని చాలా శ్రద్ధగా చేసేదాన్ని. ఎందుకంటే నేను రాసిన నోట్సుని చెల్లెళ్ళు చదువుకోవాలి కాబట్టి! సాయంత్రం పూట మిగతా వారికంటే ఎక్కువ సమయం చదువుకి కేటాయించడం.. నన్ను ఓటమి అంటే ఎరుగని స్థాయికి తీసుకొచ్చింది. పదో తరగతి, ఇంటర్ ఫస్టు క్లాసులో పాసయ్యా. డిగ్రీలో చేరా. ఆ తర్వాతా అమ్మ కాయకష్టం చేస్తుంటే నేను చదువుతూ ఉండటం భావ్యం కాదనిపించింది. అమ్మ వద్దంటున్నా వినకుండా... ఓ మున్సిపల్ బడిలో తాత్కాలిక ఉపాధ్యాయినిగా చేరాను. పగటిపూట టీచర్‌గా.. మధ్యాహ్నం డిగ్రీ విద్యార్థినిగా ఉండేదాన్ని. పొద్దున్నే బడిలో పాఠాలు చెప్పడం కోసం రాత్రిదాకా గ్రంథాలయంలోనే కూర్చుని నోట్సు రాసుకునేదాన్ని. ఆదాయం ఫర్వాలేదనుకున్నప్పుడే అమ్మ నాకు కొత్త లక్ష్యం నిర్దేశించింది.

ప్రొఫెసర్‌వి కావాలి: 'నువ్వు మున్సిపల్ బడికే పరిమితం కాకూడదు. దిల్లీ యూనివర్సిటీలో లెక్చరర్ కావాలి!' అంది. నాకు కళ్లు లేవని గుర్తుకోలేదు. అమ్మ కలని నిజం చేయాలనుకున్నా. డిగ్రీ పూర్తయ్యాక ఎంఏలో చేరా. పీజీ చేస్తూనే ఓ ప్రైవేటు కాలేజీలో అధ్యాపకురాలిగా కుదిరాను. ఆ తర్వాత ఎం.ఫిల్ పూర్తిచేశాను. చదువే జీవితాన్నిస్తుందని చెల్లెళ్లిద్దరి చేతా పీజీ చేయించాను. తర్వాత దిల్లీ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం కోసం దృష్టిపెట్టాను. ఓపిగ్గా ఎన్నో పోటీలూ, ఇంటర్వ్యూలకి హాజరయ్యా. 2008లో పొలిటికల్ సైన్స్ అధ్యాపకురాలిగా కుదిరాను. ఆ రోజే అమ్మ నన్ను గట్టిగా హత్తుకుని ముద్దాడింది. బహుశా.. నాన్న వెళ్లాక అమ్మ మనస్ఫూర్తిగా నవ్వింది ఆ రోజే! ఎం.ఫిల్ చేస్తున్నప్పుడే నాకు సురేష్ రథ్‌తో పరిచయమైంది. పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడు. అమ్మతో చెప్పాను. బాగా ఆలోచించుకో అంది. ఆయనతో మాట్లాడి.. తన భయాలన్నింటినీ పోగొట్టుకుంది. ఆ తర్వాతే ఒప్పుకుంది. సురేష్ ప్రభుత్వోద్యోగి. 'కళ్లులేని అమ్మాయిని చేసుకుంటావా?' అంటూ ఆయన్ని వాళ్లింట్లో వాళ్లు వెలివేశారు! ఇద్దర్నీ అమ్మే అక్కున చేర్చుకుని పెళ్లి చేసింది.

కళ్లులేకపోవడమే మంచిది:  నా పెద్ద చెల్లెలు అమితా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. తనకి ఈ మధ్యే పెళ్లి చేశాం. రెండో చెల్లెలు కాలేజీ లెక్చరర్. తమ్ముడు.. ఓ ఎన్జీఓ నిర్వహిస్తున్నాడు. చెల్లెలు పీజీలో చేరేదాకా అమ్మ ఉద్యోగం చేస్తూనే ఉంది. ఆ తర్వాత మేమంతా వద్దని చెప్పి మాన్పించాం. వృద్ధాప్యం కారణంగా తనిప్పుడు మాట్లాడలేకపోతున్నా ఇప్పటికీ మా ఐదుగురికీ (మా ఆయనతో సహా!) అమ్మే అండా దండా! వర్సిటీలో నేను చాలా స్ట్రిక్టు లెక్చరర్‌గా పేరు తెచ్చుకున్నా. తీరిక దొరికినప్పుడల్లా అంధత్వ సమాఖ్య సమావేశాలకు వెళ్లి, ప్రేరణ నింపేలా ఉపన్యాసాలు ఇస్తున్నా. అక్కడ చూపులేని బాలికలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు ఎన్నో! సమాఖ్య మహిళా విభాగానికి అధ్యక్షురాలినయ్యాక వాళ్లకి ప్రతినెలా వెయ్యి రూపాయలు ఉపకారవేతనం అందించేలా నిర్ణయం తీసుకున్నా. మీతో మరో విషయం చెప్పి ముగిస్తాను. కళ్లు లేకపోవడంవల్ల నలుగురం ఎంతో వివక్ష ఎదుర్కొన్నాం! స్కూల్‌లో కాలేజీలో చాలామంది మా వైపు జాలి చూపేవారే కానీ.. స్నేహం చేసేవాళ్లు కాదు. అయితే ఒక్క కారణం వల్ల నాకు కళ్లు లేకపోవడమే మంచిదనిపిస్తోంది. ఏమిటంటారా... మమ్మల్నిలా నిర్దాక్షిణ్యంగా వదిలివెళ్లిన నాన్న ముఖాన్ని కళ్లుంటే మళ్లీ చూడాల్సి వస్తుందేమో అనే భయం అది!!
Previous
Next Post »