శ్రీరామ నామస్మరణ పరమ పవిత్రం






పూర్వ జన్మ పుణ్య బలం చేత భగవన్నామ స్మరణ పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ధర్మ శాస్త్రాలని పఠించడం, ఉపదేశాలివ్వడం, శాస్త్రార్థం చేయడం సులభమే. కానీ నిశ్చలమైన మనస్సుతో భగవంతుడి నామాన్ని స్మరించడం అంత సులభం కాదు. కేవలం నామోచ్ఛారణ చేస్తే ఏం ప్రయోజనమని చాలా మంది పట్టించుకోరు. మంచి పని చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. పుణ్యం వస్తుంది కాని భగవన్నామ స్మరణ  చేస్తే ఏమొస్తుందని కొందరు ప్రశ్నిస్తుంటారు. కాని అలా ప్రశ్నించిన వారే ఆపద ఎదురైనప్పుడు ఎవరూ చెప్పకుండానే రామా! నన్ను కాపాడు అని స్మరిస్తుంటారు. కుంతీదేవి భగవన్నామ స్మరణ కోసమే కష్టాలను వరాలుగా కోరుకుందని, శ్రీమద్భాగవతం చెబుతుంది.

నామ జపానికి అంతటి శక్తి ఉంది. నామం జపించే కొద్దీ అది మంత్ర మహత్యాన్ని పొందుతుంది. మంత్రంలో ఉండేదే శబ్దశక్తి. అర్థ సామర్థ్యం కాదు. నామాల అర్థం తెలుసుకుంటూ ఉచ్ఛారణ చేస్తే ఏకాగ్రత కలుగుతుంది. నామానికి భగవంతుడ్ని ఆకర్షించే శక్తి ఉంది. అది భగవంతుడిని మన దగ్గరకు వచ్చేలా చేస్తుంది. అంటే భగవంతుడి అనుగ్రహం మనకి లభించేలా చేస్తుంది. అటువంటి నామ జపాల్లో రామనామ జపం ఉత్తమమైందని శాస్త్రాలు చెబుతున్నాయి. రామనామ జపం వల్ల పూర్వ జన్మ పాపాలు, వర్తమాన పాపాలు, పాప వాసనలు నశిస్తాయి. ‘నువ్వెందుకు నీ హంగెందుకు నీ నామమే చాలు’ అన్నాడు పురందర దాసు. శ్రీరాముడిని ఉద్దేశించి... ఈ మాటలు అక్షరాలా నిజం. ఎందుకంటే రామ నామానికి అంతటి మహత్యం ఉంది. శక్తి ఉంది. ఓం శ్రీ రామాయ నమః

ఈ నామానికి ఎంతో పవిత్రత ఉంది. దివ్యత్వం ఉంది. ముందు చెప్పినట్లుగానే అనంతమైన శక్తి ఉంది. ‘రామ’ అనగా, రూపాతిశయతో అందరిని సంతోష పెట్టువాడు అని అర్థం. ఏ నామము సహస్ర నామ పఠనంతో సమానంగా ఫలితాన్నిస్తుందో ఆ నామమే రామ నామము. ఇక్కడ ఒక శ్లోకం గురించ చెప్పుకోవాలి. “శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే” ఈ శ్లోకాన్ని స్మరణ చేసుకోలేని వారు సులభంగా ఉండే శ్రీరామాయనమః అని నామజపం చేసుకుంటే చాలు. అలాగే ఎలాంటి నామాన్ని అయినా, మంత్రాన్ని అయినా, మనసులో అనుకోకుండా పైకి పలకాలని పెద్దల మాట. ఏ నామమైనా పైకి జపిస్తే దానికి ఫలితం లభిస్తుంది. అసలు శ్రీరామ నామమే ఎందుకు జపించాలి అంటే... అది త్రేతాయుగం కావచ్చు. ద్వాపర, కలియుగం కావచ్చు. ఏ యుగంలో అయినా ధర్మం ధర్మమే. ధర్మ స్వరూపుడైన రాముడు రాముడే.

రామకథ వింటే మనసు ఉప్పొంగుతుంది. రాముడిని తలచుకుంటే తనువు పులకిస్తుంది. ఉత్తరాలైనా, రాతకోతలైనా శ్రీరామనామంతోనే ప్రారం భిస్తాం. పసిబిడ్డకు స్నానం చేయిస్తు తల్లి శ్రీరామ రక్ష అంటుంది. ఇలా తలిస్తే ఆ తల్లికెంతో నిశ్చింత కలుగుతుంది. పల్లె పల్లెలో రామాలయం ఉంది. అందుకు కారణం శ్రీరాముడి సుగుణాలే. వ్యక్తిత్వ సంపదే. కాబట్టి శ్రీరామ నామ జపమే ఉత్తమమైనది. శ్రీరాముడి గురించి ఇంకా చెప్పాలంటే ‘స్మితపూర్వ భాషి’ ఎవరినైనా సరే తనే ముందుగా పలకరించేవాడట. ‘మధురభాషి’ చాలా మధురంగా మాట్లాడేవాడట. ‘నిత్యం ప్రశాంతాత్మా’ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడట. ‘నచానృత కథః’ అంటే అబద్ధాలంటే తెలియనివాడు. ‘నిభృతః’ అంటే చాలా అణకువ కలవాడు.

కాబట్టి రామనామ జపమే ఉత్తమం.  అలాగే ‘రామో ద్విర్నాభిభాషతే’ అంటే రాముడు.. ముందొకటి, వెనుకొకటి మాట్లాడడు. ఒకటి చెప్పి మరొకటి చేయడు. రెండు గొంతుకలు లేవు. ఒకే మాట. ఒకటే బాణం. శ్రీరాముడికి మాతృభూమి మీద అపారమైన ప్రేమ. అరణ్య వాసానికి వెళ్తున్నప్పుడు ‘అయోధ్య నగరమా సెలవు! వనవాసం తర్వాత మళ్లీ నీ దర్శనం చేసుకుంటాను’ అని నమస్కరించి వెళ్లాడు. తిరిగి వస్తున్నప్పుడు కూడా ఆ మట్టికి ప్రమాణాలు చేసాకే అయోధ్యలో కాలు మోపాడు. కాబట్టి రాముడి మాట, రామ బాణం ఒకటే. అలాగే రాముడు సమదర్శిత్వం కలవాడు. విశ్వామిత్ర, వశిష్టాది ఋషులతో ఎంత గౌరవంగా మాట్లాడాడో.. గుహుడు, శబరి మొదలైన సామాన్యులతోను అంతే ప్రేమగా వ్యహరించాడు. మమ్మల్ని కలుసుకోవడానికి అంత దూరం నుంచి వచ్చావా అంటూ గుహుడిని ఆలింగనం చేసుకున్నాడు. గిరిజన మహిళ శబరి పట్ల కూడా అపారమైన ప్రేమను కురిపించాడు. భక్తితో ఆమె సమర్పించిన ఎంగిలి పళ్లను ఇష్టంగా తిన్నాడు.

రామ వాక్కు :
1. నాకు సంపద మీద ఆసక్తి లేదు. ఆశా లేదు. ధర్మాన్ని కాపాడటమే నా లక్ష్యం. ధర్మ మార్గంలో నడవటంలో నేను ఋషులతో సమానం.
2. భర్తకు భార్య విషయంలో జీవిత కాల బాధ్యత ఉండాలి. భార్య కూడా జీవిత పర్యంతం తన భర్తను తప్ప మరెవరిని అనుసరించకూడదు.
3. ప్రతి మనిషికి పితృభక్తి ఉండాలి. దేవతల కంటే తల్లితండ్రులే ఎక్కువ. కన్నవారిని ప్రేమించలేని బిడ్డల పూజల్ని భగవంతుడు స్వీకరించడు.

ఇలా రాముడి వాక్కుల గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. రాముడు ధర్మాన్ని గౌరవించాడు. సీత రాముడిని గౌరవించింది. శ్రీరామ నామం జగత్ వ్యాపితం. పూర్వం శివుడి దగ్గరికి దేవతలు వచ్చారట. తమకు స్మరణ చేసుకోవటానికి శివుడి దగ్గర ఉన్న శ్లోకాలు, మంత్రాలు అన్ని ఇవ్వమని ప్రార్థించారట. దానికి శివుడు ప్రసన్నుడై నా దగ్గర ఉన్న సమస్త మంత్రాలు, శ్లోకాలు, ఉపనిషత్తులు అన్నీ ఇచ్చేస్తాను. కాని “రామ” అనే రెండక్షరాల మంత్రాన్ని నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పి మిగిలినవి అనుగ్రహించారట. ‘ఓం నమోనారాయణాయ, ఓం నమశ్శివాయ’ అనేవి అత్యంత శక్తమంతమైన మహామంత్రాలుగా చెబుతారు.

ఆ రెండు మంత్రాలలో ఉన్న ‘రా’- శబ్దాల సంపుటీకరణ మంత్రంగా ‘రామ’ నామాన్ని చెబుతారు. అంటే రెండు మహామంత్రాల సంక్షీప్తకరణే రామనామం..దీనిని బట్టి చూస్తే రామనామం ఎంత బలమైనదో తెలుస్తోంది. ఎక్కడ శ్రీరామ అనే పదం ఉచ్చరింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. పిశాచ శక్తులు పారిపోతాయి. శ్రీరామ శ్రీరామ అని జపిస్తు ఉంటే కష్టాలన్నీ తొలగిపోతాయి. కోరుకున్నది లభిస్తుంది. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఓం శ్రీరామాయనమః అని 108 సార్లు జపించే వారి యోగక్షేమాలు ఆ శ్రీరాముడే చూసుకుంటాడన్నది తరతరాల విశ్వాసం.
Previous
Next Post »

1 Comments:

Write Comments
November 28, 2018 at 6:49 PM delete

చక్కని వ్యాసం. ధన్యవాదాలు.
శ్రీరామనామస్మరణ మొకటి చాలుననే జన్మము
ఔరా అసలైన జన్మ మదే చివరి జన్మము

పదుల కొలది జన్మము లవి పదవులలో నున్న వారి
పదముల కడ పడిగాపులు పడుచు సతము సేవించుచు
పదవులకై ఆత్రపడుచు పాటుపడుచు చెడినవాయె
పదవులపై భ్రమలు వదలి బాగుపడెడు నొక జన్మము

పదులకొలది జన్మములవి పెదవులపై ఆశలతో
మదవతుల కొంగుబట్టి వదలక కుండ సేవించుచు
పెదవులిచ్చు స్వల్పసుఖము భావించుచు చెడినవాయె
పెదవులపై భ్రమలు వదలి బాగుపడెడు నొక జన్మము

పదులకొలదు జన్మములవి ముదనష్టపు సొమ్ములకై
పదవులపై పెదవులకై మొదవులకై వెదకులాట
వదలలేని యొక జీవికి తుదకు రాము డొకడు చాలు
తదితరముల వలదటన్నతలపుజేయు నొక జన్మము
( శ్రీరామసంకీర్తనంలో 471వ కీర్తన)

Reply
avatar